ప్రయివేటీకరణతో దేశానికి విఘాతం
ప్రాధాన్యత రంగాలకు పీఎస్బీలే దన్ను
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బ్యాంక్ యూనియన్ల ఆగ్రహం
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ప్రయివేటీకరణపై ఆందోళనలు అవసరం లేదని.. దేశానికి ఎలాంటి విఘాతం కలుగదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై బ్యాంకింగ్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశానికి ప్రభుత్వరంగ బ్యాంకులు ఎంతో సేవ చేస్తున్నాయని గుర్తు చేశాయి. ప్రాధాన్యత రంగాలకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లే మద్దతుగా నిలుస్తున్నాయని.. అలాంటి బ్యాంకులను ప్రయివేటీకరించాలనే ఉద్దేశాలు మానుకోవాలని డిమాండ్ చేశాయి.
ప్రభుత్వ బ్యాంక్‌లకు మరింత మూలధన సాయం అందించి వాటిని బలోపేతం చేయాలని తొమ్మిది బ్యాంకింగ్ సంఘాలతో కూడిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 1969లో జరిగిన బ్యాంకుల జాతీయీకరణ వల్ల అనుకున్న ఫలితాలు రాలేదని మంత్రి సీతారామన్ బుధవారం ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. జాతీయీకరణ జరిగిన 50 ఏళ్ల తర్వాత కూడా అనుకున్న లక్ష్యా లను సాధించలేకపోయాయని విమర్శించారు. ప్రయి వేటీకరణ ద్వారా బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్కరి దగ్గరకూ తీసుకెళ్లలేమన్నది తప్పుడు ఆలోచన అని పేర్కొన్నారు. మంత్రి ఈ వ్యాఖ్యలపై తాజాగా యూఎఫ్‌బీయూ భగ్గుమంది.
ప్రయివేటీకరణతో కార్పొరేట్లకు ప్రయోజనం
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) కింద 90 శాతం ఖాతాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే తెరుచుకున్నాయని యూఎఫ్‌బీయూ తెలిపింది. ప్రాధాన్యత రంగాలకు, ప్రభుత్వ పథకాలు ఈ బ్యాంకుల ద్వారానే అందుతున్నాయని తెలిపింది. గ్రామీణ స్థాయిలో బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అక్షరాస్యత ప్రభుత్వ రంగ బ్యాంకులతోనే సాధ్యమైందని పేర్కొంది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఇంతటి పటిష్ఠంగా ఉండడానికీ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లే కారణమని యూఎఫ్‌బీయూ తెలిపింది. అలాంటి సంస్థలను ప్రయివేటీకరించడం ద్వారా దేశ ప్రయోజనాలకు విఘాతం జరుగుతుందని హెచ్చరించింది.
ఉద్యోగ భద్రతతో పాటు, ప్రజల సొమ్ముకూ భద్రత ఉండబోదని తెలిపింది. ప్రయివేటీకరణ వల్ల కార్పొరేట్లకే తప్ప సాధారణ ప్రజలకు ప్రయోజనం ఉండబోదనని తెలిపింది. జాతీయీకరణ కంటే ముందు బ్యాంకులు పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపార సంస్థలకు మాత్రమే సేవలందించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రభుత్వ బ్యాంక్‌లు మాత్రమే రైతులు, చిన్న వ్యాపారులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలకు, గ్రామీణ ప్రాంత రైతులకు రుణాలు ఇస్తున్నాయని స్పష్టం చేసింది. ఆర్థిక మాంద్యం, కరోన వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వరంగ బ్యాంకులు దేశానికి మద్దతుగా నిలిచాయని గుర్తు చేసింది.
పార్లమెంట్‌లో చర్చ జరపాలి..
ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయివేటీకరించబోమని కేంద్రం హామీ ఇవ్వాలని యూఎఫ్‌బీయూ డిమాండ్ చేసింది. మూలధనం, టెక్నాలజీ ఆధునికీకరణ, పారదర్శక పాలన ద్వారా బ్యాంకులను మరింత బలోపేతం చేయాలని కోరింది. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరించబోమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరింది. డిపాజిటర్లు, ఉద్యోగులు, సాధారణ పౌరులపై ప్రభావం చూపే ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకునే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంతో పాటు పార్లమెంట్ వేదికగానూ చర్చ జరగాలని యూఎఫ్‌బీయూ డిమాండ్ చేసింది.



