Friday, November 7, 2025
E-PAPER
Homeజిల్లాలుపని దినాల్లో పత్తాలేని ఎస్టీఓ ఆఫీస్ అధికారులు

పని దినాల్లో పత్తాలేని ఎస్టీఓ ఆఫీస్ అధికారులు

- Advertisement -

అన్ని తానైనా అటెండర్

లీవ్ లో ఉన్నా సిఎల్ వేయకుండా హాజరు పట్టిక ఖాళీ

వచ్చినప్పుడే అన్ని సంతకాలు పెడుతున్న వైనం!

నవతెలంగాణహుస్నాబాద్

ప్రభుత్వంలో పని చేసే ఏ ఉద్యోగి అయినా తప్పనిసరిగా ఎస్టీఓ ఆఫీస్ కి వెళ్లాల్సిందే. ఉద్యోగం ఫస్ట్ అపాయింట్మెంట్ మొదలు రిటైర్మెంట్ వరకు ఏ పని కావాలన్నా ఆ కార్యాలయం తలుపు తట్టాల్సిందే. ఈ ఆఫీస్ వారే ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్స్ సంబంధించిన లెక్కలు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. ప్రభుత్వంలో పనిచేసి అందరి అధికారులను చక్కదిద్దాల్సిన ఈ అధికారులే తప్పుదారి పట్టారు. వారికి సంబంధించిన లెక్కలన్నీ తప్పుడుగా చూపించుకుంటూ విధులకు గైర్హాజరవుతూ వారానికి ఒకసారి, ఆఫీసుకు వస్తున్నట్టు వారి హాజరు పట్టికను చూస్తే అర్థమవుతుంది. కొంతమంది అధికారులు వచ్చిన కూడా హాజరు పట్టికలో సంతకాలు పెట్టి, వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది.

ఉదయం 10 గంటలకు అటెండర్ వచ్చి, అంతా శుభ్రం చేసి సాయంత్రం 5 గంటలకు మళ్ళీ క్లోజ్ చేసి వెళ్తోంది. కానీ అందులో ఉండే అధికారులు మాత్రం లీవుల పేరుతో ఆఫీస్ కు రాకుండా ఉంటున్నారు. దీనికి సంబంధించి నవతెలంగాణ గురువారం ఎస్టీఓ కార్యాలయానికి వెళ్లి పరిశీలన చేయగా ఒక్కరు కూడా ఆఫీసుకు వచ్చినట్టు లేదు. సబ్ ట్రెజరరీ ఆఫీసర్ కేదారేశ్వరి హాజరు పట్టికలో తన సంతకం పెట్టి, మళ్ళీ వెంటనే వెనుదిరిగి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆమెను ఫోన్ ద్వారా సంప్రదిస్తే పర్సనల్ పని మీద వెళ్లిపోయానని సమాధానం ఇచ్చింది. మిగతా సిబ్బంది గురించి అడగ్గా వారంతా లీవ్ లో ఉన్నారని సమాధానం ఇచ్చింది. కానీ హాజరు పట్టికలో మాత్రం గత వారం రోజులుగా సీఎల్ వేయకుండా ఖాళీగా ఉంచారు. దీన్ని బట్టి చూస్తే వాళ్లు వచ్చిన రోజునే అన్ని సంతకాలు పెట్టుకొని జీతభత్యాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఈ విషయం గురించి అసిస్టెంట్ ట్రెజరరీ ఆఫీసర్(ఏటిఓ)మైఖేల్ ఇమాన్యుయల్ రాజ్ ను చరవాణి ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. అతను నాలుగు రోజులుగా విధులకు గైర్హాజరైనట్టు తెలుస్తోంది. కానీ హాజరు పట్టికలో మాత్రం సి.ఎల్ వేయకుండా ఖాళీగా ఉంచారు. ఈ విధంగా ఎస్టిఓ కార్యాలయంలో ఒకరికొకరు సహకారం అందించుకుంటూ విధులకు హాజరు కాకున్నా కానీ, ఎంచక్కా జీతాలు తీసుకుంటూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మరి దీనిపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి, పూర్తిస్థాయిలో విచారణ చేసి, హాజరు పట్టికను పరిశీలించి, చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -