-నైపుణ్యమే కొత్త బలం..అత్యున్నత ప్రమాణాల కోసం యూనివర్సిటీ కృషి చేయాలి
– యూనివర్సిటీ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపు
– అట్టహాసంగా శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవ వేడుకలు
– 161 గోల్డ్ మెడల్స్, 25 పీహెచ్‌డీ పట్టాల ప్రదానం
నవతెలంగాణ – కరీంనగర్
ప్రాంతీయ ప్రతినిధి విద్యార్థులు కేవలం అకాడమిక్ విజయాలకే పరిమితం కాకుండా, క్రమశిక్షణను దిక్సూచిగా, జిజ్ఞాసను ఇంధనంగా మలచుకోవాలి. నైపుణ్యం అనే కొత్త బలాన్ని పెంపొందించుకుంటూ విజయానికి ఆత్మలా ఉండే నిరంతర అభ్యాసాన్ని మరవద్దు.’ అని యూనివర్సిటీ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన రెండవ స్నాతకోత్సవం వేదికపై ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. యూనివర్సిటీల ఎన్‌ఏఏసీ, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌ల ఆవశ్యకత గురించి వివరించారు. ముఖ్యంగా తన ప్రసంగంలో యూనివర్సిటీ ఉన్నత ప్రమాణాలు సాధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. తెలంగాణలో మధ్య, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ యువ విశ్వవిద్యాలయాలలో శాతవాహన యూనివర్సిటీ ఒకటని, సమానత్వ ఆవిష్కరణలను మేళవించి విద్యార్థుల విజయ సోపానాలు సాధించడానికి ఈ వర్సిటీ ఎంతగానో కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే, విద్యార్థులు కనే కలలకు బలం చేకూర్చేందుకు, వాటి సాధన కు అవసరమైన మౌలిక వసతులు మెరుగుపడాలని ఆయన ఉద్ఘాటించారు.

ఎన్‌ఏఏసీ (న్యాక్) గుర్తింపు, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ కోసం కషి చేయాలని యూనివర్సిటీని కోరారు. ఇవి మరింత గుర్తింపు, వనరులు, వృద్ధికి మార్గాలు గా నిలుస్తాయని తెలిపారు. ఆధునిక విద్యారంగంలో వస్తున్న మార్పులను గవర్నర్ వివరించారు. ‘నేటి విద్య కేవలం సుద్ద, బోర్డు మాత్రమే పరిమితం కాదు. అది సాంకేతికత ద్వారా శాసిస్తోంది. అనుభవం ద్వారా పోషిస్తుంది. అనుకూలత ద్వారా వద్ధి చెందుతుంది’ అని అన్నారు. డిజిటల్ అభ్యాసం భౌగోళిక, ఆర్థిక పరమైన అడ్డంకులను తొలగించిందన్నారు. నైపుణ్యమే కొత్త బలం అని, నిరంతర అభ్యాసమే విజయానికి ఆత్మ అని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతి డిగ్రీ ఒక ప్రారంభం మాత్రమేనని, ప్రతి వైఫల్యం వినయం అనే దుస్తులు ధరించిన గురువు లాంటిదని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రయోగాత్మక విద్య ద్వారా కేవలం మేధస్సునే కాక, నిజాయితీని కూడా పెంపొందించుకోవాలని గవర్నర్ సూచించారు. చివరగా, గవర్నర్ అబ్దుల్ కలాం మాటలను గుర్తు చేస్తూ, ‘విద్య మీకు ఎగరడానికి రెక్కలు ఇస్తుంది.. మరింత ఎత్తుకు ఎగరడానికి ధైర్యాన్ని ఇస్తుంది.. అని తెలిపారు. గ్రాడ్యుయేట్లు ధైర్యంగా, పట్టుదలతో ముందుకు సాగి, తమ సేవ ద్వారా వికసిత భారత్ నిర్మాణానికి పాటుపడాలని ఆకాంక్షించారు.
సమాజ పరివర్తనకు విశ్వవిద్యాలయాలు కీలకం:హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్ బీజే.రావు

ఉన్నత విద్య ద్వారా గ్రామీణ, వెనుకబడిన యువత సాధికారతకు కషి చేయడంలో శాతవాహన విశ్వవిద్యాలయం దేశానికే ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా నిలుస్తోందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ బీజే.రావు ప్రశంసించారు. స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్లు అయిన వారిలో చాలా మంది మొదటి తరం అభ్యాసకులే ఉన్నారు. వీరు అనేక సవాళ్లను అధిగమించి ఈ మైలురాయిని చేరుకున్నారు. వారి విజయానికి యూనివర్సిటీ అందించిన అండదండలు, అధ్యాపకుల మార్గదర్శకత్వం, సమ్మిళిత వాతావరణమే కారణం’ అని కొనియాడారు. ఎం. ఫార్మసీ, ఎల్.ఎల్.బి, బి.టెక్ వంటి కొత్త కోర్సులను ప్రారంభించడం ద్వారా శాతవాహన యూనివర్సిటీ తన విద్యా పరిధులను విస్తరిస్తున్న తీరు, మారుతున్న పారిశ్రామిక, సామాజిక అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో వ్యవహరిస్తోందని అభినందించారు.
అనంతరం శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేష్‌కుమార్ కూడా ప్రసంగించారు. వీరి ప్రసంగాలకు ముందే వర్సిటీ పరిధిలో ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 161మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 25మంది పీహెచ్‌డీ విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు. అనంతరం గవర్నర్ సహా ఉన్నతాధికారులు కలెక్టరేట్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జిల్లాఅధికారులతో సమావేశమయ్యారు. తదనంతరం ప్రముఖ కవులు, రచయితలతో ముట్టడించి సాయంత్రం రాజ్‌భవన్‌కు తిరుగుప్రయాణం అయ్యారు.



