– 1,139 వాహనాల తనిఖీ..
– శబ్రీజ్ ఖురాన ట్రావెల్ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవ్
– బస్సు సీజ్, 45 మంది ప్రయాణికులు సురక్షితంగా తరలింపు
– మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన 27 మందిపై కేసులు నమోదు : ఎస్పీ యం. రాజేష్ చంద్ర
నవతెలంగాణ – కామారెడ్డి
బిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ ఎచ్ – 44 జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద గురువారం రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని ఎస్పీ యం రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో వచ్చిపోయే ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు, డీసీఎంలు, కార్లు వంటి వాహనాలను తనిఖీలు చేశారు. ఇలా మొత్తం 1,139 వాహనాలను తనిఖీ చేయగా 27 మంది డ్రైవర్స్ మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా వారిపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో శబ్రీజ్ ఖురాన ట్రావెల్ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్న సమయంలో డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడుపుతున్నట్లు గుర్తించారు.
వెంటనే ఆ డ్రైవర్‌ను వాహనం నుంచి దించి, ప్రయాణికులను సురక్షితంగా వేరే బస్సులో తరలించి, అనంతరం ఆ బస్సును సీజ్ చేసి, డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌ను బిక్నూర్ సీఐ సంపత్ ఆధ్వర్యంలో 8 బృందాలు సమర్థవంతంగా నిర్వహించాయి. డ్రైవ్‌లో పాల్గొన్న సిబ్బంది వాహనాలను శ్రద్ధగా తనిఖీ చేసి ప్రజల భద్రత కోరుతూ విధులు నిర్వహిస్తూ మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీతిగా నేరం మాత్రమే కాదనీ, అది ప్రాణాలతో చేసే ప్రమాదకర ఆట అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటాం, వాహనాలు నడిపే డ్రైవర్లు, ఆర్టీసీ, ప్రయివేట్ ట్రావెల్స్ డ్రైవర్లు, ట్రక్కులు, లారీలు, కార్లు నడిపేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి డ్రైవ్ చేయరాదు. మీ నిర్లక్ష్యం మీ ప్రాణాలను మాత్రమే కాదు, ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. ట్రాఫిక్ నియమాలు పాటించలని, మద్యం సేవించి వాహనం నడపవద్దు, మీ సురక్షిత గమ్యం – మా లక్ష్యం, జిల్లా లక్ష్యం, ప్రజల ప్రాణ భద్రత కోసం ఇలాంటి స్పెషల్ డ్రైవ్‌లు నిరంతరంగా కొనసాగుతయని జిల్లా ఎస్‌పి తెలిపారు.



