జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
“వందేమాతరం” గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ గీతం కోట్లాది భారతీయుల హృదయాల్లో జాతీయ భావనకు శాశ్వత ప్రేరణగా నిలిచిందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అన్నారు. ప్రతి పాఠశాలలో, ప్రతి ప్రభుత్వ వేడుకలో, ప్రతి భారతీయుని హృదయంలో “వందేమాతరం” నినాదం గర్వంగా మార్మోగుతూనే ఉందని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ కె. శంకర్ మాట్లాడుతూ “వందేమాతరం” మన స్వాతంత్ర్య సమరానికి ఆత్మస్ఫూర్తిని అందించిన శక్తివంతమైన గేయమని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు ఈ గీతం ద్వారా జాతీయవాదాన్ని ప్రజల్లో నింపారని, ప్రతి భారతీయుడు ఈ గీతం యొక్క చరిత్రను తెలుసుకొని గౌరవంతో గానించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. దేశం ముందుకు రావడానికి ప్రాణత్యాగం చేసిన యోధులను స్మరించుకోవడం మనందరి ధర్మమని తెలిపారు.
బంకిమ్ చంద్ర చటర్జీ 1875 లో రచించిన “ఆనందమఠం” నవలలో “వందేమాతరం” తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. బలగంగాధర తిలక్, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్ వంటి మహనీయులు ఈ గీతాన్ని తమ ఉద్యమాలకు ప్రతీకగా తీసుకున్నారు. ప్రతి సభలో, ప్రతి పోరాటంలో “వందేమాతరం” నినాదం బ్రిటిష్ పాలకులను కూడా కుదిపేసింది. 1950లో భారత రాజ్యాంగ సభ “వందేమాతరం” ను జాతీయ గేయంగా ఆమోదించింది.
“వందేమాతరం” భారతమాత పట్ల గౌరవానికి ప్రతీకగా నిలిచింది.ఈ కార్యక్రమంలో డీఎస్పీ వై. మొగిలయ్య, సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అరీఫ్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, విజయభాస్కర్, చంద్రకాంత్, డి సి ఆర్ బి ఎస్‌ఐ బి. స్వాతి, భరోసా సెంటర్ ఎస్‌ఐ తారక , సిబ్బంది, షి టీం ఎస్‌ఐ తేజస్విని, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



