ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి కాసుల నరేష్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు,ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను వెంటనే విడుదల చేయాలని ఎస్.ఎఫ్.ఐ ఆలేరు మండల కార్యదర్శి కాసుల నరేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకొని ఎస్.ఎఫ్.ఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా కాసుల నరేష్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.8,300 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువులు మానేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శిస్తూ,విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. లేనిపక్షంలో మంత్రుల ఇళ్ల ముట్టడికి దిగుతామని హెచ్చరించారు. అలాగే, విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు వెళ్తే యాజమాన్యాలు ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ మండల ఉపాధ్యక్షులు మద్దెల సాయి గణేష్, సభ్యులు గోపగాని అభినవ్, చిలుకు సిద్దార్థ్,గుండ్రాజు విష్ణు వర్ధన్,మామిడాల సంపత్,నీల భరత్, చిన్నం పరుషం,కన్నాయ్ మణిదీప్, మహంకాళి సంజయ్,భూపతి బాలు, దొరగళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.



