మర్రిగూడ తహసీల్దార్‌ ఇంట్లో ఏసీబీ దాడులు

Marriguda Tehsildar's house ACB attacks– ఏకకాలంలో 15 చోట్ల సోదాలు
– భారీగా నగదు, ఆస్తుల గుర్తింపు
– మహేందర్‌రెడ్డి అరెస్టు, ఏసీబీ కోర్టులో హాజరు
నవతెలంగాణ-మర్రిగూడ
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో నల్లగొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్‌ మహేందర్‌ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.2కోట్ల 50లక్షలు, కిలోల కొద్ది బంగారం బయటపడిందని సమాచారం. గతంలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో తహసీల్దార్‌గా విధులు నిర్వర్తించిన మహేందర్‌రెడ్డి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే కచ్చితమైన సమాచారంతో ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. మహేందర్‌ రెడ్డి నెల కిందటే బదిలీపై నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల తహసీల్దార్‌గా వచ్చారు. మొత్తం మహేందర్‌ రెడ్డికి సంబంధించిన 15 చోట్ల ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఓ బృందం మర్రిగూడ తహసీల్దార్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. కార్యాలయ సిబ్బందిని గంటల తరబడి అధికారులు విచారించారు. బినామీ పేర్ల మీద, బంధువుల పేర్ల ఉన్న ఆస్తుల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని వనస్థలిపురం హస్తినాపురంలోని శిరిడీసాయి నగర్‌లో ఉన్న ఆయన నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు, బంగారాన్ని గుర్తించారు. పెట్టెల్లో దాచిన సుమారు రూ.2కోట్లు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను గుర్తించారు. అక్రమాస్తులు సుమారు రూ.4.75కోట్లుగా ఏసీబీ అధికారులు తేల్చారు. తహసీల్దార్‌ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.

Spread the love