బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్
నవతెలంగాణ – మునిపల్లి
నరేంద్రమోడీ ప్రభుత్వము రైతుల పక్షానవున్నాము అని చెప్పుకొంటుంది తప్పితే రైతులకు మేలు చేసిన పాపాన పోలేదు అని బిఆర్ఎస్ నాయకులు విమర్శించారు. పత్తి రైతులు సీసీఐ విషయంలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్ అన్నారు. శుక్రవారం నాడు మండల పరిధిలోని పోల్కంపల్లి – ఖమ్మంపల్లి గ్రామాల శివారులో గల పీఎస్ఆర్ గార్డెన్ లో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్, మాజీ ఎంపీపీ చంద్రయ్యతో కలిసి స్థానిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తితోపాటు వివిధ పంటలు పచ్చనిపైరులా ఉన్న సమయంలో యూరియా వల్ల రైతులు పడరాని పాట్లు పడ్డారన్నారు. అలాగే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలన్నీ నీట మునగడంతో పాటు పత్తి కాయలు నల్లబారి, పంట చేతికందే సమయంలో మళ్లీ వర్షాలు కురవడంతో రైతులకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఎంతో కొంత పొలాల నుంచి పత్తి పండిన పంటను అమ్ముకుందామనుకుంటే సీసీఐ తీసుకవచ్చిన కొత్త నిబంధన వలన రైతులు మరిన్ని కష్టాలు పడుతున్నారన్నారు. అందుకు రైతులకు నిబంధన లేకుండా పత్తి పంటను సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోపత్తిపంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. అలాగే పత్తి పంటను నిబంధనలు లేకుండా రైతుల ద్వారానే కొనుగోలు చేయాలని, కపాస్ యాప్ లో భాగంగా స్లాట్ బుక్ చేసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నందున, పాత పద్దతి ద్వారానే పత్తిని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎకరాకు 7క్వింటాళ్లు కొనుగోలు చేయడం వలన రైతులకు ఇబ్బందులు అవుతున్నాయని, అందుకు ఎకరాకు 12క్వింటాళ్లు కొనుగోలు చేయాలన్నారు. ముఖ్యంగా ఎల్ 1, ఎల్ 2, .ఎల్ 3 నిబంధన ఎత్తి వేసి రైతులు స్వచ్ఛందంగా అందుబాటులో జిన్నింగ్ మిల్లులో పత్తిని అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ అధికారులను కోరారు.
ఒకే పట్టదారుకు ఒకటి కంటే అధికంగా సర్వే నంబర్లలో భూములు ఉన్నందున ఒకే ఓటీపీ వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు తేమ శాతం 8 నుంచి 12 వరకు నిబంధన ఉన్నందున, వర్షాల వల్ల ఎక్కువ తేమ వస్తుందని, అందుకు 20 శాతం తేమ వచ్చినా.. పత్తిని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై శనివారం నాడు మండల పరిధిలోని కంకోల్ టోల్ ప్లాజావద్ద ఏర్పాటు చేసే వంటావార్పు, ధర్నాను జయప్రదం చేసేందుకు మండలంలోని రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని వారు కోరారు. అలాగే రైతులు చేస్తున్న ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ వెంకటేశం, బీఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షుడు ఆనంద్ , నాయకులు సుభాష్, మొగులయ్య, విఠల్, శేఖర్, మాణయ్య, సంగమేశ్వర్, బాగయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.



