Saturday, November 8, 2025
E-PAPER
Homeమానవిరెండు నోబెల్స్‌ పొందిన ఏకైక మహిళా శాస్త్రవేత్త

రెండు నోబెల్స్‌ పొందిన ఏకైక మహిళా శాస్త్రవేత్త

- Advertisement -

‘వ్యక్తుల గురించి తక్కువ ఆసక్తి చూపండి. ఆలోచనల గురించి ఎక్కువ ఆసక్తిని చూపండి’ అని ప్రపంచంలోనే రెండు సబ్జెక్టులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో నోబెల్‌ ప్రైజ్‌ పొందిన ఏకైక మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరీ చెప్పిన గొప్ప మాటలివి.. ప్రస్తుత సమాజంలో వీటిని మనం గుర్తు చేసుకుని పాటించాల్సిన అవసరం ఉంది. మేరీ క్యూరీ తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులు కావడం వల్ల విజ్ఞానమే విశ్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళగలదని బలంగా నమ్మారు. మేరీని చిన్నప్పటి నుంచి బాగా చదివించారు. అప్పటినుండే మేరీకి సైన్స్‌ ప్రయోగాలపట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. కానీ పై చదువులు, ప్రయోగాలు చేయాలంటే డబ్బులు సరిపడా లేక మేరీకీ ఆమె అక్కకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. ముందుగా ఒకరు చదువుకోవాలని, మరొకరు ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు. అలా మేరీ ఉద్యోగం చేసి వాళ్ళ అక్కను చదివించింది. అయితే పోలెండ్‌ దేశంలో మేరీ పరిశోధనలకు అనువైన పరిస్థితులు లేకుండడం వల్ల అక్కడి నుండి పారిస్‌కి వెళ్లింది. అక్కడే మేరీకి పియరీ క్యూరీ అనే శాస్త్రవేత్త పరిచయమయింది. ఇద్దరు అయస్కాంతత్వంపై పరిశోధనలు జరిపారు.

ఆ తర్వాత సైన్స్‌ పట్ల ఉన్న ఆసక్తి వాళ్ళిద్దరినీ ఒకటి చేసింది. తర్వాత కాలంలో క్యూరీ దంపతులు రేడియం, పొలోనియం అనే మూలకాలను కనుగొన్నారు. మేరీ మాతృదేశం పోలెండ్‌ పేరు నుండి పొలోనియం అనే పేరు పెట్టారు. మేరీ రేడియం ఆవిష్కరణలోనే రేడియో ధార్మికత(స్థిరంగా లేని అణు కేంద్రకాల నుండి ఆల్ఫా, బీటా, గామా కిరణాలు విడుదల కావడం)ను కనుగొన్నారు. రేడియం కనుక్కునే సందర్భంలో రేడియేషన్‌ ప్రభావానికి వాళ్ల శరీరాలు బాగా దెబ్బతిన్నాయి. ప్రపంచం అంతా క్యాన్సర్‌ ట్రీట్మెంట్‌ కోసం రేడియం ఉపయోగిస్తుంది. దీన్ని రేడియం థెరపి అంటారు. ఇంత పెద్ద జబ్బుకు ట్రీట్మెంట్‌ కోసం ఉపయోగించే రేడియం మీద పేటెంట్‌ మాత్రం మేరీ తీసుకోలేదు. రేడియం అనేది మానవజాతి మొత్తానిది అని ఎంతో విశాల దృక్పథంతో ఆలోచించింది.

రేడియో ధార్మికతను యూనిట్‌గా క్యూరీ దంపతుల గౌరవార్థం క్యూరీ అనే పేరు పెట్టారు. 1903లో ఫిజిక్స్‌లో, 1911లో కెమిస్ట్రీలో రెండుసార్లు నోబెల్‌ బహుమతి పొందిన ఏకైక మహిళా శాస్త్రవేత్త మేరీ. రెండుసార్లు నోబెల్‌ బహుమతి సాధించినా కొంచెం కూడా గర్వం లేకుండా, నిరాడంబరంగా జీవితాంతం సైన్స్‌ కోసం కృషి చేసింది. ఈ జనరేషన్‌ విద్యార్థులకు చిన్న వయసు నుండే పురాణాలు ఇతిహాసాల వంటివి కాకుండా శాస్త్రవేత్తల గురించి, వారు చేసిన ఆవిష్కరణలను, వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఎలా అధిగమించారో, వాళ్ళ లక్ష్యాన్ని ఎలా చేరుకోగలిగారో వివరించి సైన్స్‌ పట్ల కుతూహలాన్ని పెంచాలి. భావి శాస్త్రవేత్తలుగా తయారు చేయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రధానంగా ప్రభుత్వాలు ఈ బాధ్యత తీసుకొని కృషి చేయాలి.

  • కె.ప్రభాత్‌, 9542585226
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -