Sunday, November 9, 2025
E-PAPER
Homeసోపతిలోటస్‌ ఫిలిం కంపెనీ హైదరాబాద్‌ (దక్కన్‌)

లోటస్‌ ఫిలిం కంపెనీ హైదరాబాద్‌ (దక్కన్‌)

- Advertisement -

భారతదేశంలో 1920 నాటికి మూకీల నిర్మాణం ఊపందుకుంది. ఆర్‌.కె.వర్మ ‘ఫిల్మోగ్రఫీ సైలెంట్‌ సినిమా’లో పేర్కొన్నట్లుగా 1913లో దాదాఫాల్కే ‘రాజా హరిశ్చంద్ర, ‘భస్మాసుర మోహిని’ తయారుకాగా, 1914, 1915, 1916ల్లో ఒక్కొక్కటి, 1917లో 5, 1918లో 8, 1919లో 11, 1920లో 20 మూకీ చిత్రాలు రూపొందినవి. అయితే ఈ పరిణామాలన్నీ హైదరాబాదును ప్రభావితం చేసినవి. ఇవన్నీ నిజాం దష్టికి రావడంతో ధీరేన్‌ను హైదరాబాదుకు రమ్మని లేఖ రాశాడాయన.

నిజానికి ధీరేన్‌కి కూడా కలకత్తాలో పరిస్థితులేవీ అనుకూలంగా లేవు. తను అనుకున్నట్లుగా సినిమాలు తీయాలంటే అన్ని వసతులు కల్పించేవారు కావాలి. సరిగ్గా అలాంటి వాతావరణం ఆయనకు హైదరాబాదులో సమకూరుతుందని భావించారు. ఈ విషయాలన్నింటినీ గురుదేవులు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌తో చర్చించి హైదరాబాదు వెళ్ళడానికి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అప్పటికే కలకత్తాలో ఆయన ‘యశోనందన్‌’ అన్న మూకీ సినిమా తీసి ఉన్నాడు. అది జూన్‌ 5న కలకత్తాలో విడుదల అయింది. హైదరాబాదు వచ్చిన ధీరేన్‌ గన్‌ పౌండ్రీ ప్రాంతంలో ‘లోటస్‌ ఫిలిం కంపెనీ’ (దక్కన్‌)ని 1922లో నెలకొల్పి స్వంతంగా ఒక లాబోరేటరీని, రెండు థియేటర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. లోటస్‌ ఫిలిమ్‌ స్టూడియోను కూడా తయారు చేసుకున్నాడు. ఈ స్టూడియో, దాని పక్కనే ఉన్న లైట్‌ హౌస్‌ థియేటర్‌ ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. తన వెంట సినిమా నిర్మాణానికి సంబంధించిన సరంజామాను సాంకేతిక నిపుణులను వెంట తీసుకుని సోదరునితో సహా హైదరాబాదుకు ధీరేన్‌ వచ్చాడు.

తానే పిలిపించాడు గనుక నిజాం షూటింగులకు తమ భవనాలను ఉపయోగించుకోవచ్చని ధీరేన్‌కు అనుమతిచ్చాడు. హైదరాబాదులో ధీరేన్‌ తీసిన తొలి మూకీ చిత్రం ‘చింతామణి’. ఈ మూకీని ఆయన కేవలం 20 రోజులలోనే రూపొందించాడు. 1922 జూలై 21న విడుదలైన ఈ మూకీకి ధీరేన్‌ గంగూలీనే దర్శకత్వం వహించారు. కానీ ఈ చిత్రంలో నటించిన వారి వివరాలు ఎక్కడా నమోదు కాలేదు. అయిదురీళ్ళ ఈ ‘చింతామణి’ ధీరేన్‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక వెంటవెంట మూకీల నిర్మాణం కొనసాగించాలని ధీరేన్‌ నిర్ణయించుకున్నారు. హైదరాబాదు వచ్చిన మొదటి సంవత్సరం 1922లోనే ధీరేన్‌ గంగూలీ అయిదు సైలెంట్‌ చిత్రాలు తీశారు.

మొదటిది ‘చింతామణి’ కాగా మిగతా నాలుగు ‘ఇంద్రజిత్‌’ పౌరాణికం), మేరేజ్‌ టానిక్‌’ (కామెడీ) ‘సాధు ఔర్‌ సైతాన్‌’ (సాంఘికం), ‘ది లేడీ టీచర్‌ (కామెడి). వీటిలో ‘సాధూకి సైతాన్‌’కి దర్శకత్వం వహించింది ‘నితీష్‌ చంద్ర లాహిరి’. మిగతా మూడు ధీరేన్‌ గంగూలీ దర్శకత్వంలో రూపొందినవి. పైన పేర్కొన్న మూకీల్లోని మిగతా చిత్రాలు ‘ఇంద్రజిత్‌’, ‘మేరేజ్‌ టానిక్‌’, ‘ది లేడీ టీచర్‌’లలో ధీరేన్‌ గంగూలీ, సీతాదేవిలు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సీతాదేవి అసలు పేరు రీనీస్మిత్‌. ఈమె ధీరేన్‌ ద్వారానే సినిమాల్లోకి ప్రవేశించింది. ఇక నితీష్‌ చంద్ర లాహిరి దర్శకత్వంలో నిర్మించిన కామెడీ చిత్రం ‘సాధూ ఔర్‌ సైతాన్‌’లో ధీరేన్‌తో బాటు లీనా వాలెంటైన్‌, సుశీలాదేవిలు నటించారు.

ధీరేన్‌ గంగూలీ సినిమా నిర్మాణం వేగంగా చేసేవారు. హైదరాబాదు వచ్చిన ఆర్నెల్లలోనే అయిదు మూకీలు తీసి ఘన విజయం సాధించారు. 1923లో దర్శక, నిర్మాతగా ఆయన తీసిన సినిమాలు మూడు. అవి ‘హరగౌరి’, ‘యయాతి’ రెండూ పౌరాణికాలు కాగా, కడపటిది ‘బిజోరు-బసంత’ లేదా ‘స్టెప్‌ మదర్‌’ సాంఘికం. ‘హరగౌరి’ నిడివి 4998 అడుగులు. ఇందులో నటించిన తారలెవరో సమాచారం లభించడం లేదు. కాగా ఈ సినిమా విడుదలైంది 1923 జనవరి 5న. రెండోది ‘యయాతి’లో ధీరేన్‌ గంగూలి, సీతాదేవి ప్రధాన పాత్రలు పోషించగా 1923 ఏప్రిల్‌ 14న విడుదలైంది.
ఈ మూకీలు అన్నీ కూడా హైదరాబాదులో ఆయనే నిర్మించిన రెండు థియేటర్లలో ప్రదర్శింపబడినవి. హైదరాబాదులో తాను తీసిన మూగ సినిమాలనే కాకుండా బొంబాయి కలకత్తాలలో తయారైన చిత్రాలను కూడా తన థియేటర్లలో ధీరేన్‌ ప్రదర్శించేవాడు.

ఈ నేపథ్యంలోనే బొంబాయిలో 1924లో అర్దేషిర్‌ ఇరానీ మెజెస్టిక్‌ ఫిలిం కంపెనీపై తీసిన ‘రజియా బేగం’ మూకీని గంగూలీ ఈ మూకీని హైదరాబాదులోని తన థియేటర్లో విడుదల చేయడంతో అది ప్రకంపనలు సష్టించింది. బానిస- వంశానికి చెందిన ఢిల్లీ రాజు ఇల్తు మిష్‌ (1211-1236) తర్వాత అధికారంలోకి వచ్చిన ఢిల్లీ ఏకైక మహిళా పాలకురాలు రజియా బేగం గురించిన చారిత్రక చిత్రం ‘రజియా బేగం’. ఆమె తన ఆస్థానంలోని ఒక అబిస్సినియన్‌ బానిసతో ప్రేమలో పడుతుంది. చివరికి ఆమె జీవితం విషాదకరమైన ముగుస్తుంది. ఇలాంటి కథతో తయారైన ఈ చిత్రానికి ఆసక్తికరమైన సెన్సార్‌ చరిత్ర ఉంది. మార్చి 1924లో బాంబే సెన్సార్‌ బోర్డు ఆమోదించిన రజియా బేగం ప్రదర్శనలను పంజాబ్‌, ఢిల్లీ, యునైటెడ్‌ ప్రావిన్స్‌, బీహార్‌, ఒరిస్సాలు ‘అనైతిక’ కారణాలతో సెన్సార్‌ ధవీకరణ నిరాకరించాయి.

హైదరాబాద్‌లో ఈ సినిమాలో తమ మనోభావాలు దెబ్బతినే కథనం ఉందని ఒక మత వర్గానికి చెందిన ప్రేక్షకులు థియేటర్ల నుండి ఒక్కసారిగా బయటికి వచ్చారు. ఈ అసహన పూరితమైన వార్త అందుకొన్న నిజాం తాను స్వయంగా తన మందీమార్బలంతో లోటస్‌ ఫిలిమ్‌ కంపెనీ స్టూడియోకు వచ్చి ముస్లిం మత వ్యతిరేక సినిమాను ప్రదర్శించినందుకు ధీరేన్‌ గంగూలీపై ఆగ్రహం చెంది 24 గంటలలోగా హైదరాబాదును వదిలిపెట్టి వెళ్ళవలసిందిగా ఆదేశించారు. నియంతకు ఎదురు చెప్పలేక, చేసేదేమిలేక కలకత్తా తిరిగి వెళ్ళాడు. కలకత్తా వెళ్లి ధీరేన్‌ సినీ, నాటకరంగంలో పనిచేస్తూనే 1927లో ‘శంకరాచార్య’ ‘పంచాసర్‌’ (1930), ‘ఆఫ్టర్‌ ది డెతో’ (1931) మనీ మేళ్ళవాట్‌ వాట్‌ (1951), ‘ది బోర్డర్‌ దీఫ్‌’ మూకీల్లో నటించారు. తాను దర్శకునిగా ‘బలీక్‌ బాబు’ (1930), ‘ఫ్లేమ్‌ ఆఫ్‌ ఫ్లెస్‌’ (1930), ‘నాటీ బారు’ (1931), ‘చరిత్రహీన్‌’ (1931) మూకీలను తీశాడు.

1931లో టాకీ సినిమాలు రాగానే న్యూథియేటర్స్‌ సంస్థాపకులలో ఒకరుగా కషి చేసిన ధీరేన్‌ గంగూలీ ‘వైట్‌ బర్డ్‌’, ‘ఎక్స్‌ క్యూజ్‌ మీ సర్‌’ (1934), ‘బిద్రోహి’ (హిందీ/ బెంగాలీ- 1935), ‘కంట్రీ గర్ల్‌’ (1936), ‘మస్ట్‌ బౌ భారు’ (1940) ఆహుతి (1941), శేష్‌ నివేదన్‌ (1948), ‘కార్టూన్‌’ (1948) వంటి టాకీలు తీసి వాటిలో కొన్నింటిలో నటించాడు. ఈయన తీసిన సినిమాల్లో ఎక్కువగా కామెడీలే, అందుకే ఆయనను ‘ఇండియన్‌ చాప్లిన్‌’ అనే వారు. ఆయనే ”జీవితంలో ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి సీరియస్‌గానే విశ్లేషణ జరపాలి. కానీ నేర్చుకున్న పాఠాలను ఇతరులకు చెప్పాల్సి వచ్చినపుడు వీలైనంత సరళంగా, హాస్య స్పోరకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఎక్కువగా కామెడీలు తీయడానికి కారణమిదే” అన్నారొక సందర్భంలో. సినిమా రంగానికి దేవికీబోస్‌, పి.సి.బారువా, సబితా దేవీలను ఆయనే పరిచయం చేశాడు.

1936లో ఆయన ‘డి.జి. టాకీస్‌’ సంస్థను నెలకొల్పి ‘దివాన్‌ దార్‌’ చిత్రాన్ని నిర్మించి, నటిస్తూ దర్శకత్వం వహించారు . అలా ఆయన ‘హల బంగళా’ (1938), ‘అభిసారిక’ మొదలైన చిత్రాలలో నటించి, వాటి దర్శకత్వం చేశారు. ఇతర సంస్థల కోసం ఆయన ‘ఆహుతి’, ‘దాబి’ (1943) వంటి చిత్రాలు డైరెక్ట్‌ చేశారు. 1948లో ‘డి.జి. పిక్చర్స్‌’ బానర్‌పై ‘శేష్‌ నిబేదన’ (1948) చిత్రం నిర్మించారు. 1949లో ఆయన అజంతా ఆర్ట్‌ పిక్చర్స్‌ కోసం ఒక కార్టూన్‌ చిత్రాన్ని డైరెక్టు చేశారు. డి.జి. సినీ రంగంలోనే గాక మంచి మేకప్‌ కళాకారుడుగానూ పేరు తెచ్చుకున్నారు.
ఆయన మేకప్‌ చేస్తే అది వేషంలా కనిపించేది కాదట. పోలీస్‌ శాఖవారు కూడా తమ గూఢచారులు సహజంగా కనిపించగల మారు వేషాలు వేసుకోవడానికి ఎలాంటి మేకప్‌ చేసుకుంటే బావుంటుందో తెలుసుకోవడానికి డి.జి.ని సంప్రదించేవారు.

డి.జి. ఎంతో పట్టుదల గల వ్యక్తి. తొలి రోజుల్లో ఒకసారి ఆయనకు కలకత్తాలోని ఒక వీధిలో ఒక అందమైన యువతి కనిపించింది. వెంటనే ఆయన ఆమె పక్కనే నడుస్తున్న ఆమె భర్త దగ్గరికి వెళ్ళాడు. ‘ఆమెకు సినిమా తార అయ్యే అభిప్రాయం ఉందా?’ అని అడిగాడు. దాంతో ఆ భర్తకు కోపం వచ్చింది. ‘మీ భార్యనే ఎందుకు సినిమా తారను చెయ్యకూడదు?’ అని బదులడిగాడు అతను. డి.జి. సూటిగా ఇంటికి వెళ్ళి తన భార్యను మర్నాడు షూటింగుకు సిద్ధం కమ్మన్నాడు. అలా తన భార్యను కమలాదేవి అన్న పేరిట చిత్ర రంగానికి పరిచయం చేశాడాయన.

అయితే సినిమా నిర్మాణం వ్యాపారపరంగా నష్టాలు తేవడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో శర పరంపరగా సినిమాలు తీయాలనుకున్న ధీరేన్‌ ఇంటికే పరిమితం కావలసి వచ్చింది. భారతీయ సినిమాకు 50 ఏళ్లపాటు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 1974 ‘పద్మభూషణ్‌’ పురస్కారంతో, 1975లో ‘దాదాఫాల్కే’ అవార్డుతో గౌరవించింది. భారతీయ సినిమా పితామహుల్లో ఒకరుగానే గాక హైదరాబాద్‌ సినిమాకు అద్యుడుగా, ధీరేన్‌ గంగూలీని మనం స్మరించుకోవాలి. ఆ మహనీయుడు 1978 నవంబర్‌ 17న తనువు చాలించారు. ఆయన వేసిన బీజాలే తెలంగాణ సినిమా చరిత్రకు పునాదిరాళ్లుగా నిలిచాయి. అందుకే తెలంగాణ సినిమా పితామహుడు ధీరేన్‌ గంగూలీ.

ధీరేన్‌ గంగూలి అవార్డును ప్రవేశపెట్టాలి
నిజాం కాలంలోనే హైదరాబాదులో సైలెంట్‌ సినిమాల నిర్మాణానికి పూనుకొని, ఇక్కడ స్టూడియోలు, లాబరేటరీలు, థియేటర్లు నిర్మించిన తొలి చలనచిత్రకారుడు ధీరేన్‌ గంగూలీ. ఆయన చలనచిత్రాలు నిర్మించిన కాలం మద్రాసులో జరిగిన సినీ పరిణామ వికాసాలకు సమాంతరంగా చరిత్రలో మనకు కనిపిస్తుంది. స్వీయ అస్తిత్వంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం గడిచాక గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సినీ అవార్డులలో తెలంగాణకు చెందని వారి పేరు అవార్డులు పెట్టారు. కానీ తెలంగాణలో సినిమాలకు బీజం వేసిన ధీరేన్‌ గంగూలీ పేర ఒక అవార్డును ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో సినీ ప్రముఖులకు బహుకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • హెచ్‌ రమేష్‌ బాబు, 7780736386
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -