విష్ణుమూర్తి గొప్పతనాన్ని, ఆయన మహత్యాలను నారదుడు ప్రచారం చేసినట్లు మరెవరూ చేయరు పురాణ గాథల్లో. నారదుడు పాటగాడు, పండితుడు, చెడును మంచిగానూ, మంచిని చెడుగానూ మెప్పించగల దిట్ట. అందుకే ఆయనంటే అందరూ భయభక్తులు కలిగి మెలగుతుంటారు. అన్నిలోకాలకూ వార్తనందించి జనసమ్మతిని సాధించగలడు. అందుకే ఆయనను వార్తాహరునిగా పేర్కొంటారు. అతను దేవతల చుట్టూనే తిరుగుతుంటాడు. జన సామాన్యపుగాథనేదీ పట్టించుకున్న పాపానపోడు. ఎందుకంటే ఆయన ఉన్నదే వాళ్లకోసం. ఇప్పటి మనమీడియా, పత్రికలు దాదాపుగా కుబేరుల, కార్పొరేట్ల వారి సేవలో మునిగి తేలుతున్నాయి. ప్రజాప్రగతికి సంబంధించిన ఏ అంశమూ పెద్దగా చర్చలోకి రావు. బడాబాబుల సేవలో తలమునకలయిన నాయకుల గురించి మాత్రం కథనాలు బహు సుందరంగా మేకప్ అవుతాయి. ఇది ఆనాటి నారదుని నుండి, నేటి మీడియా వరకూ కూలీనుల గొంతుకలై మోగుతుంటాయి.
స్వాతంత్య్రం వచ్చి డెబ్బయి ఐదేండ్లు దాటింది. కానీ దేశంలో ఆకలి దారిద్య్రాలూ, నిరుద్యోగం వెన్నంటే కొనసాగుతున్నాయి. ఎన్నెన్ని పథకాలు, ప్రయత్నాలు, ప్రచారాలు జరిగినా అవి మనని వీడిన క్షణం లేదు. ‘భారతదేశం సంపద్వంతమైన దేశం, కానీ ప్రజలు పేదవారని’ పాఠాలలో కూడా చదువుకున్నాము. అట్లాంటి పరిస్థితిలో ఇన్నేండ్లకయినా, ఒక రాష్ట్రంలో అతి పేదరికాన్ని నిర్మూలించగలగడం, అదీ అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా ప్రకటించడం చిన్న విషయం కాదు. ప్రజల కేంద్రంగా, ప్రజల భాగస్వామ్యంతో సాధించిన ఈ ఫలితాన్ని ప్రతి ఒక్క రాష్ట్రమూ, ప్రాంతమూ అధ్యయనం చేసి, అనుసరించాల్సిన విధానం కదా! అనేకానేక పరిమిత అధికారాల పాలన లోనూ ప్రజాదృక్పథంతో పనిచేసి సాధించిన ఫలితాన్ని ప్రధాన మీడియా పెద్దగా చర్చకు పెట్టలేదు. మీడియానే కాదు, రాష్ట్ర పరిపాలకులు, దేశ పాలకులు, ఈ విషయం గురించి స్పందించరెందుకు!
నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తే సాధించేది కాదు పేదరిక నిర్మూలన. శాశ్వతంగా ప్రజలు పేదరికంలోకి వెళ్లకుండా, తమకాళ్లపై తాము నిలబడే బలాన్ని ఇవ్వగలగడం చేయాల్సిన పని. ఇది కేవలం ప్రజాదృక్పథంలో పనిచేసే ప్రభుత్వాలే చేయగలుగుతాయి. అలాచేసి నిరూపించింది కేరళ వామపక్ష ప్రభుత్వం. కేరళ రాష్ట్రావతరణ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ శాసనసభలో అతి పేదరిక నిర్మూలన రాష్ట్రంగా ప్రకటించడం ఒక పెద్ద చారిత్రక సంఘటన. ఇది కేవలం ప్రకటన కాదు, గత నాలుగేండ్లుగా తీసుకున్న నిర్ణయాల మేరకు, ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ప్రజలు, ప్రభుత్వ విభాగాలు సమిష్టిగా నిబద్ధతతో చేసిన కృషి ఫలితం ఇది. దృఢ సంకల్పం, సామాన్యుల పట్ల ప్రేమ, అంకితభావం, శాస్త్రీయమైన ప్రణాళిక ప్రగతి సాధనకు బాటలు వేశాయి. నాలుగు నెలలు శ్రమించి అత్యంత పేదరికం అనుభవిస్తున్న 64,006 కుటుంబాలను గుర్తించి, వారి స్థితిగతులను పరిశీలించి,కార్యక్రమాలను రూపొందించి అమలు జరిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తీవ్ర ప్రయత్నం చేసి, వాగ్ధానాన్ని నిజం చేసి చూపించారు. పేదరిక నిర్మూలనకు ఎక్కడయినా చేయాల్సింది ఏమిటి?ముందు వాళ్లందరికీ ఆహారం అందాలి. కుటుంబశ్రీ ద్వారా ఆ పేద కుటుంబాలకు ఆహారం, ఆరోగ్య సేవలు అందించారు. రేషన్, ఆధార్ కార్డులు అందజేశారు. ఇక రెండవది ముఖ్యమైనది. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు.భూమి కలిగి ఉండటం, సొంత ఇల్లు ఉండటం, అందరికీ గృహ వసతి కల్పించడంలో కేరళ ముందుంది. విద్యా, వైద్యాన్ని ప్రభుత్వం కల్పించడం పెద్ద విజయం. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, చేయూతనివ్వడం ప్రభుత్వమూ, ప్రజా ఉద్యమ నిరంతర జోక్యం వల్లనే ఈ పురోభివృద్ధి సాధ్యమయింది. ఐక్య రాజ్యసమితి పేర్కొన్న సుస్థిరాభివృద్ధి సూచికలో కేరళ గణనీయమైన ప్రగతిని సాధించింది. బహిరంగసభ నిర్వహించి సగర్వంగా తీవ్ర పేదరిక విముక్త రాష్ట్రంగా, గత నాలుగేండ్ల కృషి ప్రస్తావనపై నివేదికను సుప్రసిద్ధ మళయాల సినీనటుడు మమ్ముట్టికి ముఖ్యమంత్రి అందజేశారు. ‘ఆకలిని జయించడమే అసలైన అభివృద్ధి,అది కేరళలో సాధించిందని’ ఆయన అభినందించారు. ‘ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేరళ ప్రజానీకం మరింత విశ్వాసంతో ఇతర సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని’ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ కోరుకోవడం సముచితంగా ఉంది.
అభివృద్ధి అనగానే పెద్దపెద్ద కట్టడాలు, నిర్మాణాలు, రోడ్లు, వాహనాలు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు..ఇవి మాత్రమే కనపడుతుంటాయి. కానీ ప్రజల జీవన ప్రమాణాల ఆధారంగా అభివృద్ధిని లెక్కించాలని అనుకోరు. పేదరికం, దారిద్య్రం సహజమైనవేమీ కాదు. వ్యవస్థ సృష్టిస్తున్నవే. వీటిని తొలగించడం ప్రయత్నపూర్వకంగా చేయాలి. అలా ప్రయత్నం చేసి దేశంలోనే మొదటిసారి అతి పేదరికాన్ని కేరళ తరిమేయడం అందరం అభినందించాల్సిన విషయమే కాదు, అనుసరించాల్సిన విషయం కూడా. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన కేరళ మార్గంపై చర్చ జరగాలి. మీడియా వేదికవ్వాలి.
నవశకానికి నాంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



