Sunday, November 9, 2025
E-PAPER
Homeకథనల్లకూర

నల్లకూర

- Advertisement -

నేనే అంటే, నా బిడ్డ సంజన నా కన్నా నీసు ముచ్చుది. రోజు నీసుండాలే. ‘పల్లెలుంటే ఏమో గానీ గీ సిటీలల్ల రోజు నీసు వండుడు, తినుడు కుదుర్తదానే యేదుంటె గదె తినాలే’ అని తొమ్మిది సదివే నా బిడ్డకు సగ జెప్త గానీ, నేను దీన్ని మించిన నీసు ముచ్చును. నాకు సదువు, ఉద్యోగం పెండ్లి, పిల్లలు, సంసారం బెరిగి, నీసు కౌసు తినుడు జరంత తగ్గింది గానీ, సిన్నప్పుడు మా ఊరిల ఉన్నప్పుడు తునుకలో, కోడికూరో చాపలో, రొయ్యలో, బొక్కలో, ఆఖరికి గుడ్డన్నా ఉంటేనే తినేది లేకుంటే, ఉపాసమే. ‘జరమొచ్చినప్పుడు తినొద్దనీ తింటే, అరుగదని, కామిల్లత్తయని ‘కట్టడి జేసినా యినక పోదును. దొంగతనంగా తినేది. అందరూ పండుకున్నంక మెల్లగ పిల్లోలే లేసి, పొయికాడ జూసి, ఆడ లేకుంటే, ఉట్టి మీద బెట్టిన అటికె కాడికి స్టూలు దెచ్చి ఎక్కి,సప్పుడు కాకుండా తునుకలు దేవుక తిని, గప్‌చుప్‌గా పండుకునేది.

తెల్లారి ‘అటికెల తునుకలు ఏమయినయని’ మా అవ్వ మా తమ్ముణ్ణి, అక్కను, నన్ను నిలేస్తే … మాకు తెల్వదంటె మాకు తెల్వదనేది, వాళ్ళతోనీ మాట కలిపి. ఓ రోజు చీకట్ల స్టూలు మీదికి ఎక్కి, ఉట్టి మీది కూరటికె దించబోయి, కూరటికెతో పాటు దబ్బున కిందబడ్డ. ఏందో సప్పుడైతందనీ మా అయ్య దిగ్గున లేసి, సేతి లైటు పట్టుకొని కుక్కో, పిల్లో అని కట్టెతోనీ ఒక్కటేయ బోయిండు. నన్ను జూసి ‘ అరే… నువ్వా బిడ్డ! గీ సీకట్ల కుక్కనా, పిల్లినా అనుకుంటి. జెరమచ్చే.., తగ్గిందా బిడ్డ? రాత్రి బువ్వ తినలేదార, అవ్వ తునుకలు సాలినన్ని ఎయ్యలేదా? కూరంత కిందబడే, దెబ్బగిన దాకిందా?’ అన్నడు కిందబడ్డ నన్ను లేవదీసుకుంట. ఇంతల మా అవ్వ నిద్రల నుంచి లేసి ‘యేందే సప్పుడు?’ అనుకుంట వచ్చింది. కింద పలిగిన అటికె, కూర, నా వాలకం జూసి ”అవ్వల్లా జెరమచ్చిందని రాత్రి తునుకల కూర వెట్టనందుకు గింతేశమానే, నీ అగుడు సల్లగుండ! నీసంటే సాలు, జీవంత కూర కుండలనే ఉంటది.

నీ జీవి సావ! గింత అద్మానమా, కూరంత తెర్లాయే. గిందుకేనా… రాత్రి అండిన కూర తెల్లారికి వుంటలేదు! యేడ దొరకకుంటా దాసినా, పిల్లి నాస వట్టినట్టు వాసన బడ్తది, ఇది సిన్న పిండం గాదు వావ్వో! ఏడాకుల కింది రౌతం బొట్టు ఎరుక బడుతది. మంచిగ మాల్‌ మసాలేసి వండితే, తేనె బొట్టోలే కుదిరిన కూరను నేల పాల్జేస్తివే!’ అని కొట్ట కొట్టచ్చింది. జరమొచ్చిందాన్ని యేంగొడుతవని మా అయ్య ఆపిండు గానీ, లేకుంటే ఇయ్యర మయ్యర దంచేది. గట్లాంటి నీసు నియ్యతి వున్న నేను, నా బిడ్డకు పైకి గిట్ల సమజు జేసినా లోపల్లోపట ‘నా ముందట నువ్వెంతనే పోరీ’ అని నవ్వుకుంట. అర్ధరాత్రి దొంగ తిండ్ల బుద్ధి నా బిడ్డకు కూడొచ్చింది. ఫ్రిడ్జీల పెట్టిన చాపల ఫ్రై, మటన్‌ చికెన్‌లు మాయమైతయి. ‘అమ్మా మన సిటీల నల్ల ఎందుకు దొరకది? మటన్‌ షాప్‌ అంకుల్‌కి చెప్పు నల్ల తెమ్మని’ అంటది. వూరికి బోతేనే దొరుకుతది. అదేందో సంజుకు గా దొరకని నల్లకూరంటే… మస్తు ఇష్టం. గీ సంగతి మా సుట్టాలల్ల అందరికీ ఎరికే. అందుకే వాళ్ళ కాడికి పోయినప్పుడు నల్లకూర వండుతరు.

నల్లకూరుంటే… చికెన్‌, మటన్‌ ముట్టది. కూరగాయలు పప్పండిన్నాడు సరింగ తిననే తినది. కిచెన్‌ మొకమే సూడది. ఆదివారం నీసు వండే రోజు మాత్రం ”అమ్మా ఉల్లిగడ్డలు కొయ్యనా? అల్లమెల్లిగడ్డలు మిక్సి బట్టనా? చెక్క, లవంగ నూరనా? అమ్మా దాంట్లా చుక్కకూర, పుంటికూర, సొరకాయ, దోసకాయ గిట్ల యేమి కలుపొద్దు” అంటది. కూరయే దాకా కిచెన్‌ల నుంచి కదులది. ”అమ్మా నాన్‌ వెజ్‌ వండుడంటే నీ తర్వాతనే ఏ ఫైవ్‌ స్టార్‌ చెఫ్‌ అయినా, నిజ్జం అమ్మా! నాన్‌వెజ్‌ వండుట్ల నువ్వు సూపర్‌, ఎక్స్‌ పర్ట్‌. ఎవ్వరైనా ఒక్కసారి తింటే సాలు జిందగీల మరువరు తెల్సా? నా దోస్తు హసీనా నీ నాన్‌ వెజ్‌కర్రీస్‌తోనే కనెక్ట్‌ అయిందని తెలుసామ్మ?” అని నన్ను ఉబ్బిచ్చి, వూరిచ్చి, పొగిడి పొగిడి పొన్నపూల సెట్టెక్కిస్తుంటది. అప్పుడు నా బిడ్డ మొకం సూడాలే వేయి వోల్టులతో వెలుగుతుంటది. మా సంజు అప్పుడప్పుడు నేను వండిన నీసు కూర దోస్తులగ్గూడ తీస్కపోయి, మస్తు ఖుషీ జేస్తది. దీనికి తోడు దీని క్లాసుమేట్‌ ,జిగిరి దోస్తు హసీనా, మా స్ట్రీట్‌లనే ఉంటది. యీళ్ళిద్దరూ కలిసే బడికి పోతరు. కలిసే లంచ్‌ తింటరు. పిల్లల వల్ల పెద్దలంగూడ దోస్తులమైనం.

వాళ్ళింట్ల నీసండినా ,స్వీట్‌ చేసినా మాకు పంపిస్తరు. మా ఇంట్ల వండినా వాళ్ళకు పంపిస్త. రంజాన్‌ నెలల వాళ్ళు రోజాలో వున్నప్పుడు వాళ్ళకోసమే నీసు కూరలతోనీ పండ్లు, పాయసం గూడ వండి పంపిస్తుంట. వారంల ఏరోజు వండినా వండకున్నా ఆదివారం వచ్చిందంటే సాలు మా ఇంట్ల నీసు కౌసే ఉండాలే. హసీనా వాళ్ళింట్ల వారంల రెండు మూడు రోజులు ఉంటది. మా అసొంటి నెల జీతగాళ్లే కాదు, రోజు కూలి కైకిలి చేసుకునేటోల్లు, ఎంత పూటకు లేనోళ్ళైనా, ఆదివారం నాడు మటనో, కాళ్ల కూరో, తలకాయ కూరో, చికెనో, చాపలో, రొయ్యలో తుక తుక వుడుకాల్సిందే. ”దసర రోజు కంచంల బొక్కేగితే, కాశిల గంటేగుతది” అంటరు గానీ, గా గంట కంచంల మోగేది ఆదివారమే. సంజు బడికి సెలువులొస్తే సాలు ”వూరికి పోదామమ్మా, పెద్దమమ్మీని చూడాలే, మామ, అత్త వాళ్ళని, వాళ్ళ పిల్లలు మిన్ను, మన్ను వాళ్లతో ఆడుకోవాలె” అనేది. ‘ఆ… ఆ… అట్లనే వాళ్ళు వండి పెట్టే నల్లకూర నములాలే.

తీరు తీరు మటన్‌ కూరలతో మజా చెయ్యాలే అది గూడ సెప్పక్కా’ అని నా కొడుకు జోకులు జేస్తుంటడు. నిజమే గీ సిటీలల్ల నీసుకౌసు ఎక్కువ తక్కువ తెచ్చుకునుడు, వండుడు తినుడు కష్టమే. మళ్ళా తింటే కొలెస్ట్రాల్‌ అనీ, గుండెకు పరేషాన్‌, తినొద్దనీ డాక్టర్‌ నస నస. మా పెద్దోళ్ళందరూ తిని ముద్దుగనే ఉన్నరు. సచ్చేదాక బతికిండ్రు. మాకే గివన్ని. ఓసారి మా సిన్నక్క ‘దురుగమ్మను కొలిపిస్తున్నము రాండ్రి సెల్లె’ అని ఫోన్‌ జేస్తే పోయినము. దురుగమ్మ దేవరను బైండ్ల సమ్మన్న రాత్రంత కొలిసినంక, తెల్లారి మేకనో, గొర్రెనో తెంపుతడు. ఆ కూరండి చుట్టాలకు, బందువులకు బంతి పెడుతరు. ఆ బంతిల మటన్‌ పెడుతుంటే… సంజు ‘పెద్దమ్మా నల్లకూర లేదానే?’ అన్నది మూతి ముందడికి బెట్టి. ‘అయ్యో బిడ్డా! దురుగమ్మ ముందట కోసిన రౌతమ్‌ మొత్తం దురుగమ్మకే ఉంచాలే, తియ్యద్దు. మావ్వ గాదు! యిప్పడికైతే యిదేతిను బిడ్డా, అవ్వతోడు, నువ్వు మీ ఇంటికి పోయెలోపట నీకు నల్లకూర తినబెట్టే తోలుత’ అని బతిలాడి, బామాలి సమజ్జేసింది మా సిన్నక్క.
ఇగ కొలుపు మావుసం, కొలుపిల్లు దాటొద్దనే నమ్ముకాలున్నయి.

అందుకే తిన్న ఇస్తార్లను బైట పారె య్యక ఇంట్ల గుంట తవ్వి గుంటలేసి కూడ్పుతరు. కొలుపయినంక వచ్చిన సుట్టాలందరూ ఎటోళ్లటు ఎల్లి పోయిండ్రు. మేం కూడా బయలు దేరనీకి తయారై తుంటే, మా సిన్నక్క మా గూడెంల ఎక్కడెక్కడ దేవులాడిందో యేమో, మొత్తానికైతె నా బిడ్డకోసం నల్లకూర తెచ్చి ‘అవ్వా సంజవ్వా నీ కాయిషు కూర తెచ్చిన బిడ్డా వుడుకు గూడ సల్లార్లే.వండితే,తిని తీస్క పోదువు’ అనుకుంట దగ్గరికి తీసుకొంగనే, నా బిడ్డ అమాంతం అలుముకొని ‘పెద్దమ్మా నువ్వు గ్రేట్‌! నాకోసం ఎంత కష్టపడి తెచ్చినవే థాంక్స్‌ పెద్దమ్మా’ అని ఇడువకుంట అట్లనే పట్టుకున్నది మురిపెంగ. ‘గిప్పుడు వండే కత వద్దక్కా, సదురు కొని తయారైనం. మీ మరిది ఆగడు. ఎంతల రెండు మూడు గంటల్ల ఇల్లు జేర్తం.’ అని బైల్దేరి, మద్యానము వరకల్ల యిల్లు జేరినం. లంచ్‌కి అన్నం, అక్క పంపిన నల్లకూర వండిన. సంజు ‘అమ్మా, వావ్‌! సూపర్‌ టేస్ట్‌!’ అనుకుంట తిని, హసీనాకు కూడా బాక్స్‌ల తీస్కపోయింది ఖుషీ ఖుషీగా.

అంత ఖుషీగా పోయిన పోరీ దిగాలు పడ్డ మొకంతో బాక్స్‌ పట్టు కొని వచ్చింది.’ ‘యేందే ఏమైంది? వాళ్ళు లేరానే’ అని బాక్స్‌ తెరిసి చూసిన. ‘వాళ్ళు ఉన్నరమ్మా, నేను హసీనాకు నల్లకూర స్పెషల్‌, వూరుకాంచి’ అని ఫుల్లు జోష్‌ల తినబెట్టబోతుంటే వాళ్ళమ్మ ‘ఏ సంజనా ఆగు! అది నల్లకూరనా? హసీ తినొద్దు బేటా. మన కాందాండ్ల తినము. సంజు ఏమనుకోవద్దు. ఇంకోసారి తేవద్దు’ అని ఖరాకండిగ చెప్పింది. తల్లి సడన్‌గా అట్లనంగనే, హసీనా గూడ బాగా హర్ట్‌ అయి, ఎందుకమ్మీ ఆ కర్రీ చాలా టేస్తుంటది. నువ్వోసారి టేస్ట్‌ చేస్తే అట్లనవు, జిందగీల మర్సిపోవు. మూడంత ఖరాబ్‌ చేస్తివి’ అన్నది. వామ్మో ఇది వరక్కూడా తిన్నవా హసీ? అసలు నల్ల కూరంటే తెలుసా జీవాల రక్తాన్ని వుడుక బెట్టి వండేదే నల్లకూర. అది మనము తినొద్దని ఖురాన్‌ల, యింకా దాదా, దాదిమా, నానా వాల్లు చెప్తరు’ హసీనా తల్లీ ఉర్దూల చెప్తుంటే… ఏడుపొచ్చి ఇంటికి వచ్చేసిన. హసీ తిన్నది వాళ్ళ మమ్మీనే తిన నియ్యలే.

”అయితే మాయే, నువ్వెందుకు సిన్న బోతవ్‌ బిడ్డా’ అని ప్రేమగ దగ్గరికి తీసుకొని, ‘ఈ దునియల ఏది తినేటోళ్ళు అది తింటరే, అందరూ అన్నీ తింటరానే. మా హాస్టల్‌ దోస్తు సాలమ్మ వాళ్ళు ఎలుకల్ని, నక్కల్ని, పిల్లుల్ని , ఉడుముల్ని, ఉడుతల్ని తింటరు గానీ, మనము, హసీనోళ్లు తినే పెద్దకూర తినరు. సాలమ్మ వాళ్ళు తినేయి మనము తినము అలవాటు లేక. గీ సిటీల పెద్దకూర మంచిది, తాజాది దొరకక, సిన్నకూర తింటన్నమే గానీ, వూరిల ఎవడు కానుతడు, సంజూ. హసీనా వాళ్లమ్మ జెప్పినయీ నాకు గూడా సిన్నప్పటియి యాదొ స్తున్నయి. ముస్లిమోల్లు నల్లకూర నిజంగానే తినరు. ఎందుకు తినరో సెప్పు తిను. మనకు కూర అంటే మావుసం కూరనే కూర. మన గూడెంల మా చిన్నాయిన మా అయ్య కలిసి వారానికోసారి గొడ్డును కోసేది. ఆదివారం పరకాల గొడ్లంగడికి పోయి, ఎవుసానికి పనికిరాని వయసుడిగిన ఆవులను, ఎడ్లను కొనుక్కొచ్చి మంగళ, బుధవారంలో కోసేది. మన ఇంట్ల ఆవులు, ఎద్దులు వున్నా కూడా కోయకపోదురు. యింటి ఆవులెద్దుల్ని కోయొద్దని ఉండేది.

ఎద్దును కోసే దానికి మా ఊరిల అమ్మదాలి తాత (అహ్మద్‌ అలీ) కోడిగూసే పొద్దుకు ఇంటి కొచ్చి లేపితే, మీ మామలు, తాత, చిన్న తాత గిట్లా నలుగురైదుగురు లేసి, కందీలలు పట్టుకొని పోదురు. ఒక్కోసారి మావ్వ,మాక్క, వదిన వాళ్లు కూడా పోయేది. అమ్మదాలి తాత గానీ, ఆళ్ల కొడుకు గానీ, వచ్చేది హలాలు జెయ్యనీకి. వూరికి ఒకరిద్దరే హలాల్‌ జేసే విద్య తెలిసినోళ్లు వుండేటోళ్లు. ముస్లిమ్‌ లు లేకుంటే పక్కిరోళ్ళు చేసేది. మా వూల్లే దూదేకులోల్లు వుండే గానీ, వాళ్ళకు హలాల్‌ చేయనీకి రాదందురు. మా గూడెంల హలాలు చేసిన మాంసాన్నె తినేది. చేయకుంటే ఇప్పటికీ తినరు. హలాల్‌ చేస్తేనే ఆ మాంసానికి విలువ, ఆరోగ్య మంటరు. మా వూరిల సూదరి కులాలు కూడా మేక, గొర్రె, పొట్టేళ్లను హలాల్‌ చేయించే తింటరు. గీ మన సిటీ సంగతి తెల్వది గానీ, ఈనాటికి పెద్ద టౌన్‌ లల్ల చికెన్‌ సెంటర్లోల్లు కూడా కోళ్ళను హలాల్‌ చేసే అమ్ముతరు.

వూరిల ఎవరన్నా హలాల్‌ చేయకుంట తింటే… కొట్లాటలు వచ్చినప్పుడు ‘మీ లెక్క మేము ముర్దాల్‌ కూర తినేటోల్లంగాదని, మేము హవ్వల్‌ దర్జా హలాల్‌ కూర తినేటోల్లం’ అని హేళన జేసి తిట్టుకుంటరు. ‘హలాల్‌ అనేది సైంటిఫిక్‌’ అని చైనా కూడా ఆ మధ్య ఫుడ్‌ జర్నల్‌లో చెప్పింది. ఇగ కోడికూత పొద్దుకు మొదలు పెడితే, తెల్లారేటాలకు, తోలు మీద మాంసం కుప్పలు ఉండేవి. హలాల్‌ చేసిన అమ్మదాలి తాతకు గుండె, కార్జం, బట్టి మాంసం కలిపి ఇచ్చేది. రక్తం ఒక పెద్ద రెండు మూడు గమేలాలకు నిండేది. అయితే అమ్మదాలి తాత రక్తం తీసుకోక పోయేది. ఓనాడు అడిగిన మా అయ్యను ‘గీ హలాల్‌ జేసే తాత మాంసాలన్నీ కొంట బోతండు. రక్తమెందుకు కొంట బోతలేడు?’ అని. ‘అవు బిడ్డా! గాళ్ళు రౌతం బట్టుకోరు, తినరు. రౌతం తింటే పాణాలు తిన్నంత పాపమనీ నమ్మిక. బూమికి ముడితే మోచ్చెమంటరు. ఆళ్ళ నియ్యతి ఆళ్లది బిడ్డా!’ అని చెప్పేదాకా నీలెక్క నాగ్గుడ తెల్వలే. మాంసం వుడుకుడు లేటయితదని, పిల్లలకు జెప్పన వండిపెట్టాలని మీ అమ్మవ్వ గడ్డగట్టి వున్న రక్తాన్ని పొయి మీన పెట్టి, నీరంతా పోయేటట్టు వుడుక బెట్టినంక కేకు లాగయ్యేది.

గదే నల్ల. దాన్ని కూరండితె నల్లకూర. కేకులాగ అయిందాన్ని వక్కలు వడ కోసి పొయ్యి మీద కంచుడు పెట్టి, నూనె పోసి ఉల్లిగడ్డలు, అల్లమెల్లిగడ్డ యేసి ఉప్పు, కారం, పసుపూ, మసాలేసి, అవి నూనెల గోలినంక, నల్లను జెర సిదిపి, కంచుట్లేసి మాలు మసాలంతా నల్లకు బట్టేటట్టు కలెబెట్టి, కొంచెం సేపు ఉంచి దించి, మాకు తిన బెట్టేది. ఇగ అప్పుడు సూడాలే మా మొకాలు ఆకాశమ్‌లో సందమామ మీన కూసున్నంత సంబురంగ, యెలిగిపోయేది! గా సంబురంమీద ఎన్ని పండుగ లైనా దిగదుడుపే పో… అన్నట్లుండేదే… అని నేను సంతోషంల తేలి పోతుంటే, సంజూ అంటూ, హసీనా వచ్చింది. ‘సంజూ సారీ’ అని హగ్‌ చేసుకుంది. నేనే వంద సారీలు హసీ, నల్లకూర మీరు తినరని నాకు బిల్‌ కుల్‌ తెల్వదే. మా అమ్మ చెప్పే దాకా!’ ‘సంజూ మా మమ్మీ హర్ట్‌ చేసిందానికి నేనే వెయ్యి సారీలు, ప్లీజ్‌ లైట్‌ తీసుకోవే! నా జిందగీ మొత్తం నీ దోస్తానీ టేస్టును, నల్లకూర టేస్టును అస్సలు వదులుకోను సంజూ’ అని ఒకరి కొకరుగ నడుస్తున్న ఆ పసి బిడ్డల సారీలు, హలాల్‌ జేసిన తేట మనసులు, మాటలు గీ లోకానికి కూడా యెక్కితే, యెంత బాగుండనుకొని ఆ ఇద్దర్ని హగ్‌ చేసుకున్న.

  • జూపాక సుభద్ర
    9441091305
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -