ప్రపంచ పెట్టుబడికి కేంద్ర స్థానమైన అమెరికాలో ఓ సోషలిస్టు నగర మేయర్‌గా ఎన్నికవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున పోటీ చేసిన సోషలిస్టు జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించి సంచలనం సృష్టించారు. ప్రతీ నాలుగేళ్లకు ఎన్నికలు సాధారణంగా జరిగేవే! అయితే ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి, అంతకంటే మమ్దానీ గెలుపు మరింత ప్రత్యేకం. అన్ని ఇజాలు పోయాయి అంటూ నిరంతరం కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రచారం చేసే పెట్టుబడిదారీ మీడియా ఎంత దుష్ప్రచారం చేసినా న్యూయార్క్ వాసులు మమ్దానీ వైపు నిలిచారు. ఈ నేపథ్యంలో 34ఏండ్ల జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్ గెలిచి చరిత్ర సృష్టించారు. పిన్న వయసులోనే అంత ఉన్నత స్థాయికి ఎదిగిన జోహ్రాన్ విశేషాలు ఈ వారం జోష్ లో…
34 ఏండ్ల జోహ్రాన్ మమ్దానీ… అతి పిన్న వయస్సులోనే న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మేయర్ అభ్యర్థి రేసులో నిలిచిన మొదటి భారత సంతతి వ్యక్తిగా కూడా ఇతనే. న్యూయార్క్ మేయర్ అభ్యర్థి కోసం జరిగిన పోటీలో మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై గెలిచాడు. 1991 అక్టోబర్ 18న ఉగాండాలో ప్రఖ్యాత చరిత్రకారుడు మహమూద్ మమ్దానీ , మీరా నాయర్ దంపతులకు జన్మించారు. జోహ్రాన్‌కు ఐదేండ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్‌టౌన్‌కు చేరుకుంది. రెండేండ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడింది. జోహ్రాన్‌కి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైస్కూల్ ఆఫ్ సైన్స్ తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరారు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో క్వీన్స్ 36వ జిల్లాకు ప్రతినిధిగా న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తాజాగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
తద్వారా న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్’ అమెరికన్ మేయర్‌గా, తొలి సోషలిస్టుగాచరిత్ర సృష్టించాడు. మీరా నాయర్…ప్రముఖ సినీ దర్శకురాలు. ఒడిశాలో జన్మించిన మీరా నాయర్ మీరా బాయి ఫిలిమ్స్ బ్యానర్‌తో పలు చిత్రాలు నిర్మించడంతో పాటు, దర్శకత్వం వహించారు. మీరా నాయర్ 2012లో పద్మభూషణ్ అవార్డు పొందారు. సినీ రంగంలో చేసిన సేవలకు గాను ఆమెకు ఈ పురస్కారం లభించింది. మీరా బాయి ఫిలిమ్స్ బ్యానర్‌లో వచ్చిన ”సలామ్ బాంబే!” చిత్రం 1988 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆడియన్స్ అవార్డును గెలుచుకుంది.బెస్ట్ మూవీగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మమ్దానీ, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాటలను గుర్తు చేసుకున్నారు. నవశకానికి స్వాగతం పలుకుతున్నామంటూ ఆనాడు నెహ్రూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. నవశకం వైపు అడుగువేసినప్పుడు.
ఒక శకం ముగిసినప్పుడు.. సుదీర్ఘ అణచివేతకు గురైన జాతి నుంచి గళం వినిపించినప్పుడు.. చరిత్రలో ఇలాంటి క్షణాలు అరుదుగా వస్తాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తీర్పు మార్పుకు సంకేతమన్నారు. భవిష్యత్తు మన చేతుల్లో వుందన్నారు. ‘మిత్రులారా’ మనం ఒక రాజకీయ రాజవంశాన్ని కూలదోశామని మమ్దానీ వ్యాఖ్యానించారు. ట్రంప్ మోసం చేసిన ఈ దేశానికి ఆయనను ఎలా ఓడించాలో చూపించాలంటే అది ఆయనను పెంచి పోషించిన ఈ నగరమేనని అన్నారు. క్యూమో వ్యక్తిగత జీవితం బాగుండాలని మాత్రమే నేను కోరుకుంటున్నానని అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చునని న్యూయార్క్ వాసులు భావించినందునే తాను ఈ విజయం సాధించానని చెప్పారు. డెమొక్రటిక్ ప్రైమరీ ఎన్నికలలో క్యూమోను మమ్దానీ ఓడించిన విషయం తెలిసిందే. అనేక మంది ప్రముఖులు క్యూమోను సమర్ధించినా చివరకు ఆయనకు ఓటమి తప్పలేదు. ఎన్నికలకు ముందు క్యూమోకు ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ‘మీరు ఇదంతా చూస్తున్నారని నాకు తెలుసు. నేను మీకు నాలుగు మాటలు చెప్పాలని అనుకుంటున్నా. వాల్యూమ్ పెంచండి’ అని ట్రంప్‌ను ఉద్దేశించి మమ్దానీ చురకలు వేశారు.
మీ ముందు చిన్నవాడినే
విజయం సాధించిన అనంతరం మమ్దానీ మాట్లాడుతూ నేను పెద్దవాడిని కావడానికి ఎంత ప్రయత్నించినా మీ ముందు చిన్నవాడినే. నేను ముస్లింను, అంతకు మించి డెమోక్రటిక్ సోషలిస్టుని అని ప్రకటించారు. న్యూయార్క్ నగరం వలసదారుల నగరం. వారితోనే నిర్మించబడిన నగరం. వలసదారులుచే శక్తి పొందుతున్న నగరం. ఈ రోజు నుండి ఒక వలసదారుడే పరిపాలించే నగరం అంటూ ఉత్తేజకరంగా ప్రసంగించారు. మమ్దానీ తన విధానాలను స్పష్టంగా ప్రజల్లో ప్రచారం చేసి ఓట్లు పొందారు. ముఖ్యంగా వలస వచ్చిన వారికి రక్షణ కల్పిస్తానని, అందరం కలిసి న్యూయార్క్‌ను అబివద్ధి చేద్దామంటూ ప్రసంగించారు. మరో ముఖ్యమైన విషయం డెమోక్రాట్ అగ్ర నాయకులు బరాక్ ఒబామా, కమలా హారిస్ వంటి వారు కూడా మమ్దానీకి సపోర్టుగా నిలబడలేదు. క్యాంపెయిన్ చేయలేదు. అయినా న్యూయార్క్ ప్రజలు 50.4 శాతం ఓట్లు వేసి మమ్దానీ వైపు నిలబడ్డారు.
చెరిగిపోయిన రికార్డులు
న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మమ్దానీ తన విజయంతో అనేక రికార్డులను చెరిపేశారు. 1892 తర్వాత నగర మేయర్‌గా ఎన్నికైన పిన్న వయస్కుడు ఆయనే. తొలి ముస్లిం మేయర్, ఆఫ్రికాలో జన్మించి అమెరికా నగరానికి మేయర్ అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే. క్వీన్స్ అసెంబ్లీ సభ్యుడైన 34 సంవత్సరాల మమ్దానీ గతఏడాదే మేయర్ రేసులో అడుగు పెట్టారు. అప్పుడు ఆయనకు పెద్దగా గుర్తింపు కూడా లేదు. ధన బలమూ తక్కువే. పార్టీ మద్దతు కూడా లేదు. అయినప్పటికీ మాజీ గవర్నర్ క్యూమో, రిపబ్లికన్ అభ్యర్థి లిండ్సేలను మట్టి కరిపించారు.
వామపక్ష నాయకత్వ లక్షణాలు
అన్నింటికంటే ముఖ్యంగా డెమొక్రటిక్ పార్టీలోని చాలా మంది కోరుకుంటున్న నాయకత్వ లక్షణాలు ఆయనలో కన్పించాయి. వివిధ అంశాలపై సామాజిక మాధ్యమాలలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు పలువురిని ఆకర్షించాయి. చిన్నారులను ఉచితంగా సంరక్షించాలని, ప్రజా రవాణాను విస్తరించాలని, స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేస్తుండగా వాటిని మమ్దానీ గట్టిగా సమర్ధించారు. డెమొక్రటిక్ పార్టీకి ఇటీవలి కాలంలో దూరమైన శ్రామిక ఓటర్లను తిరిగి సొంతగూటికి రప్పించడంలో ఆయన విజయం సాధించారు. వారు ఎదుర్కొంటున్న ప్రధాన ఆర్థిక సమస్యలపై దృష్టి సారించారు. వామపక్షాల సాంస్కతిక విలువలను ఆయన ఎన్నడూ తిరస్కరించలేదు.
ట్రంప్‌తో కలిసి పనిచేస్తా
ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్ స్థానంలో మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా బాధ్యతలు చేపడతారు. మేయర్ పదవికి తిరిగి పోటీ చేయరాదని సెప్టెంబరులో ఆడమ్స్ నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో మమ్దానీ, ట్రంప్ మధ్య పరోక్ష యుద్ధం సాగింది. మమ్దానీని ట్రంప్ పదే పదే కమ్యూనిస్టు వెర్రివాడు అంటూ తూలనాడారు. మమ్దానీ ఎన్నికైతే విపత్తు సంభవిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ మమ్దానీ మాత్రం ఎక్కడా ట్రంప్‌పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. న్యూయార్క్ ప్రజల క్షేమం కోసం దేశాధ్యక్షుడితో కలిసి పనిచేస్తానని తెలిపారు. అయితే న్యూయార్క్ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం పోరాడతానని స్పష్టం చేశారు.
మమ్దానీ గెలుపునకు గల కారణాలేంటి?
అతి పిన్న వయస్కుడైన 34 ఏళ్ల మమ్దానీ న్యూయార్క్ నగరం యొక్క ఆర్థిక సంక్షోభం, సామాజిక న్యాయం, ప్రజా భద్రతా సంస్కరణలు, పిల్లల సంరక్షణ, ఉచిత బస్సు ప్రయాణాలు, ఆహార ధరల నియంత్రణ, నగర యాజమాన్యంలో కిరాణా దుకాణాలు, అద్దె స్థిరీకరణతో పాటు 2 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తానని ప్రచారం చేశారు. అంతేకాదు సంపన్నులపై 2 శాతం పన్నులు వంటి ప్రగతిశీల విధానాల ప్రచారంతో, ఉద్యోగాలు, అద్దెలు, ఆర్థిక సమస్యల పరిష్కారం, ఎల్‌జిబిటిక్యూ హక్కులు, కనీస వేతనం వంటి విషయాలతో యువ ఓటర్లను సైతం ఆకట్టుకున్నారు. శ్రామికులు, అట్టడుగు వర్గాల జీవన నాణ్యతను మెరుగుపరుస్తానని మమ్దానీ ప్రకటించారు. నగర మేయర్‌గా ఎన్నికైన మొదటి ఇండో-అమెరికన్‌గా, మొదటి ముస్లింగా, మొదటి సోషలిస్టుగా మమ్దానీ చరిత్ర సష్టించారు.
- అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417



