ఇక రహస్య భేటీలు షురూ గెలుపు కోసం ప్రధాన పార్టీల తీవ్ర కృషి
3,92,669 మంది ఓటర్లు
భారీ పోలీస్ బందోబస్తు
అమల్లోకి 144 సెక్షన్ : సీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టాక్ ఆఫ్‌ది స్టేట్‌గా మారింది. ఇక్కడి ఫలితాలు భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతమని ప్రధాన పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాయి. ఆదివారంతో (నేటితో) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మిగిలిన కొన్ని గంటలనైనా తమ ప్రచార సమయాన్ని సద్వినియోగిం చుకోవాలని అన్ని పార్టీల నాయకులు గల్లీలు, బస్తీలు, రహదారులను సైతం వదలకుండా ప్రతి ఒక్కరినీ పలకరిస్తున్నారు. ఇక రహస్యంగా నేతలు జనాలతో భేటీ అవుతున్నారు. దాదాపు నెల రోజులపాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తమ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేశాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ నాయకులు గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దింపగా, కాంగ్రెస్ నుంచి వి.నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి పోటీలో ఉన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ తమ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాలా కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేషన్ చైర్మెన్‌లతోపాటు క్షేత్రస్థాయి కార్యకర్తలు పనిచేస్తుండగా, బీఆర్‌ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు, ఈటల రాజేందర్ వంటి ప్రముఖులు ప్రచారం నిర్వహిస్తు న్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న కాంక్షతో ప్రభుత్వంపై, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్‌ఎస్ విమర్శల వర్షం కురిపిస్తోంది. అభివృద్ధి, సంక్షేమంతోపాటు మాగంటి చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎలాగైనా విజయం సాధించాలన్న కసితో ఉన్న అధికార కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో జరిగిన మొదటి ఉపఎన్నిక కంటోన్మెంట్ సిట్టింగ్ సీటును తమ ఖాతాలో జమ చేసుకున్నట్టే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సైతం సత్తా చాటి నేటితో జూబ్లీహిల్స్ ప్రచారానికి తెర రాష్ట్రవ్యాప్తంగా ఓ మెసేజ్ పంపాలని ముఖ్యమంత్రి తోపాటు మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు.
139 ప్రాంతాలు, 407 పోలింగ్ స్టేషన్లు
జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. 139 లొకేషన్స్‌లో, 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 38మంది సెక్టార్ అధికారులు, 2400 మంది పోలీస్ సిబ్బందితోపాటు ఇతర శాఖలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఏంలు), వీవీ ప్యాట్(వీవీపీఏటీ) యంత్రాలను వినియోగిస్తున్నారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేస్తారు. 16తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.
ఓటర్ల ఆదరణ ఎవరికో?
జూబ్లీహిల్స్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది సంపన్నులుండే ప్రాంతం. కానీ, ఈ నియోజకవర్గంలో జనాభాలో అధికంగా ఉన్నది పేద, మధ్యతరగతి వర్గాలే. ఓటర్ల ఆదరణ ఎవరికి ఉండనుందో చర్చనీయాంశమైంది. ఈ నియోజకవర్గంలో ఏడు డివిజన్లు షేక్‌పేట్, ఎర్రగడ్డ, బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, సోమాజీగూడ ఉన్నాయి. అన్ని డివిజన్లలోనూ భిన్న తరగతుల ఓటర్లున్నారు. ఒక్కో డివిజన్‌లో ఒక్కోపార్టీకి ఆదరణ లభించే అవకాశం ఉంది. షేక్‌పేట డివిజన్‌లో దాదాపు 55వేల మంది ఓటర్లున్నారు. ఈ డివిజన్‌లో మైనార్టీలు అధికంగా ఉన్నారు. దిగువ మధ్యతరగతి వర్గాల వారున్నారు. బోరబండలో మైనార్టీలు, పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉన్నారు. ఇక్కడ 62వేలకుపైగా ఓటర్లున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అతి పెద్ద డివిజన్ రహ్మత్‌నగర్‌లో సుమారు 65వేల మంది ఓటర్లుండగా.. 60శాతం మంది మైనార్టీలున్నారు. ఇక్కడ బస్తీలు అధికంగా ఉంటాయి. ఎస్పీఆర్ హిల్స్‌లో సుమారు 23వేల మంది ఓటర్లుండగా, కార్మికనగర్‌లో 21వేల మంది ఓటర్లున్నారు. ఎర్రగడ్డ డివిజన్‌లో బస్తీలతోపాటు, కొన్ని కాలనీలున్నాయి. ఇక్కడ అపార్ట్‌మెంట్స్ కల్చర్ అధికంగా ఉంటుంది. అపార్టుమెంట్‌లలో సుమారు 12వేలకుపైగా ఓటర్లున్నారు. వీరంతా సైలంట్ ఓటర్లు. వెంగళరావు నగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వెంగళరావు నగర్‌లో కాలనీలు, బస్తీలే కీలకం. విద్యావంతులు అధికంగా ఉంటారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లో సినీ పరిశ్రమ వారు అధికంగా నివాసముంటారు. మధురానగర్‌తోపాటు కృష్ణానగర్, వెంకటగిరి, యాదగిరినగర్ బస్తీల సమాహారంగా యూసుఫ్‌గూడ డివిజన్ ఉంది. సుమారు 43వేల మంది ఓటర్లున్నారు. బస్తీలు, కాలనీలు, మైనారిటీలు, బీసీ, ముదిరాజ్‌లు ఇలా భిన్న వర్గాలున్నా ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఉప ఎన్నికల్లో ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాల్సి ఉంది.
నేటి నుంచి ఆంక్షలు అమలు : సీపీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సివి.సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం (9వ తేదీ) సాయంత్రం 6 గంటల తరువాత ప్రచారాన్ని ముగించాలని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6గంటల నుంచి పోలింగ్ జరగనున్న 11వ తేదీ (మంగళవారం) సాయంత్రం 6గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ రోజు రహదారులు, జనావాసాల్లో బాణాసంచా కాల్చడం నిషేధమన్నారు. 200మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడవద్దన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేటితో జూబ్లీహిల్స్ ప్రచారానికి తెర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



