అమ్మాయి సోకు అబ్బాయిని కవ్విస్తుంటే అబ్బాయి ఊరుకోడు. ఆగలేడు. అబ్బాయి పొగరు, రాజసం అమ్మాయిని మురిపిస్తుంటే అమ్మాయి తట్టుకోదు. ఆగలేదు. అలా అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటే వాళ్ళ ఇద్దరి మనసులు, వయసులు కట్టు తప్పుతుంటాయి. చిలిపిచిలిపి సరసాలు విరగబూస్తుంటాయి. ఆ సరసాల గురించి, గిలిగింతల గురించి మాస్ మాస్‌గా చెబితే చాలా బాగుంటుంది. అలా చెప్పిందే ఈ పాట. 2022 లో నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన ‘ధమాకా’ సినిమాలో భీమ్స్ సెసిరోలియో రాసిన ఆ పాటనిపుడు చూద్దాం.
భీమ్స్ ఈ జనరేషన్‌కి తగినట్టుగా పాటలు రాశాడు. నేటి యువత ఎలాంటి పాటలకు కనెక్ట్ అవుతారో భీమ్స్‌కి బాగా తెలుసు. అందుకే అలాంటి పాటలు రాసి, అలాంటి సంగీతం అందించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. పాటల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఔరా! అనిపిస్తాడు. ఈ పాటలో కూడా జానపద సొబగును ప్రవేశపెట్టాడు. ఇద్దరు ప్రేమికుల మధ్యన ఉన్న శృంగారానికి జానపద సొగసులు అద్ది ద్వంద్వార్థాలతో మెప్పించాడు. తాను పల్లెటూరి పిల్లాడిలా కనబడుతున్నాడని హీరోయిన్ అన్నట్టుగా చెబుతూ పల్లవి ప్రారంభిస్తాడు హీరో. హీరోకి ఉన్న దండ కడియాలను చూసి, చేతికి కట్టుకున్న దస్తీని చూసి మస్తుగున్నాడు అని అన్నదని, కిర్రు కిర్రుమనే చెప్పుల శబ్దం.. కిన్నెర వాయిద్యం చేసే శబ్దంలా ఉందని, పల్లెటూరోడిలా కనబడుతున్నాడని అన్నావ్ కదా..అని హీరో హీరోయిన్‌తో అంటాడు.
దానికి హీరోయిన్ సమాధానం చెప్పాలి కదా. నా కాళ్ళకు పెట్టుకోవడానికి పట్టీలు తెచ్చావ్. చేతికి వేసుకోవడానికి గాజులు ఇచ్చావ్. ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే బుట్టలో పడేశావ్. నా ముక్కుకు నువ్వే ముక్కెరై పూశావ్..అంటుంది. ముక్కుకు ముక్కెరలా పూయడమంటే.. తన వాడైపోయాడని, తన సొంతమైపోయాడని అర్థం. ముక్కెరై పూసి, ముద్దుల ముద్దరలిచ్చాడంటుంది. సందడి తానై వచ్చి తన సోకులు అనే అంగడి సరుకును తీసుకెళ్ళిపోయాడని కొంటెగా అంటుంది. హీరో తన పట్ల చేసిన చిలిపి పనుల గురించి హీరోయిన్ ఇలా చెబుతుంటుంది. హీరో చూపుల కత్తితో తన చెంపల మీద మూడుసార్లు ముద్దుల గాట్లు వేయాలని కోరుకుంటోంది. సంపంగి మొగ్గలతో మంచం వేసి, ఆ మంచంపై సరసాలాడి, మోటు సరసంతో నవ్వారు తెంపేరు అని ఘాటుగా చెబుతోంది. ఇది పచ్చి జానపద శృంగారాన్ని తలపిస్తోంది.
నీ మెట్టెల జాగీరు నాదే అంటాడు హీరో. నీకు మెట్టెలు పెట్టేవాడిని నేనే. అంటే నీకు మొగుడు అయ్యే అర్హత నాకే ఉంది అని చెప్పకనే చెబుతున్నాడు. నీ మెట్టెలు అనే స్థలాన్ని పొందే జాగీర్దారుని.. జమీందారుని నేనే. నీ పట్టా భూమిలో జోర్దారుగా గెట్టు నాటుకుంటా అంటాడు. అంటే నీ పరువమనే, నీ ఆడతనమనే స్థలాన్ని ఆక్రమించే అధికారం, మగతనం నాకే ఉందని మోటుగా చెప్పాడు. దానికి బదులుగా శ్రుతి మించి.. ఇంచు మించుగా నా వయసు అనే స్థలం శివారుతో సహా నీదే అని పచ్చిగా సమాధానమిస్తుంది. దిక్కులు చూడకుండా నా సొగసు అనే ప్రదేశంలో విచ్చలవిడిగా షికారు చేయరా అని హీరోకి స్వేచ్ఛనిస్తుంది. హీరో ముందే బాగా ఊపు మీద ఉన్నాడు. ఊరుకుంటాడా.. నువు ఆగమన్నా ఆగేటోన్ని కాదు. దూకమని నువ్వు అంత స్వేచ్ఛ ఇచ్చాక నాలోని మీసమున్న మగాడు ఎలా ఆగుతాడు చెప్పు.. అంటూ వీరవిహారం చేస్తాడు.
అపుడు..పచ్చి జానపదం వంత పాడుతుంటారు. అల్లో..రాములమల్లో.. జిల్లేడాకులో బెల్లం పెట్టిందని, నాకు కాకుండా జిత్తులమారి నక్కకు పెట్టిందని, అపుడు నక్క నోట్లో బెల్లం ఇరికి అది పీక్కుంటూ బయ్యారం అనే ఊరెళ్ళిపోయిందని చెబుతుంటారు. అది తెలిసి నా ఒళ్ళు ఝల్లుమన్నది. తోట్లో ఉన్న గుబ్బల పరుసుని జబ్బలనిండా వచ్చే రైకలో దాచిందని పరోక్షమైన శృంగారంతో మెలిక వేసి చెబుతారు. ఇది హీరో, హీరోయిన్ల శృంగారానికి జతకలిసేలా చెబుతున్నట్టుగా తోస్తుంది. నీకు నేను కందిపువ్వులాంటిదాన్ని. నిన్ను తాకాక కందిపోతాను. ఎందుకంటే నీ నాటు సరసం నేను భరించలేను కాబట్టి అని హీరోయిన్ అంటోంది. నీ ఛాతి చాలా విశాలమైనది. అంటే.. హీరో బాహుబలమున్నవాడు. దుడుకైన మగతనమున్నోడు. ఆ ఛాతి ఎకరంనర ఉంటుందని అతిశయోక్తితో కూడిన కొలతలతో చెప్పి, దానితో గొడుగు పట్టు నాకు, నీ ఛాతి కింద తలదాచుకుంటా. అంటుంది. అంటే.. తన గుండెలో చల్లగా దాచుకొమ్మని సుకుమారంగా అడిగినట్టు కూడా తోస్తుంది.
నీ జడలో ఉన్న పూలసెండులాగ, నీ కొంగు అనే దండలాగ, నీ గుండెల నిండా ఎన్నెలతో నిండిన కుండను దింపిపోతా అని అంటాడు. చింత చెట్టు మీద కూర్చొని జాగ్రత్తగా గమనించే సిలక లాగా అన్ని కనిపెడతావా. అంటే..నా అందాలన్నింటినీ గుచ్చి గుచ్చి, తొంగి తొంగి..కసితీరా చూస్తావా అని అంటోంది. బాయి మీద ఉండే గిలక తాడును మెలికేసి పట్టినట్టు నన్ను కూడా అంత ఆత్రంగా పెనవేస్తావా.. అని పచ్చిపచ్చిగా అడుగుతోంది. గుడిసెల్లో ఉండే గొడవలు ఎప్పుడుండేవే కాని, అందుకే..గుడిసెదాటి నీ పొలంలో నిలబడి వడిసెల్లో రాయిపెట్టి, గురిచూసి కసిగా ఇసిరికొడతా..ఆ దెబ్బకి నీకున్న ఆత్రం తీరిపోవాలి..అని అంటాడు హీరో.. అంటే..గుడిసె, మడిసె, వడిసెల, రాయి..వంటి పద ప్రయోగాలతో అమ్మాయి అందాలను, శరీరభాగాలను గురించి పరోక్షంగా చెప్పినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ద్వంద్వార్థాలతో అశ్లీల శృంగారం కనబడుతోంది. ఇది పచ్చి శృంగారమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ పాటలో భీమ్స్ చేసిన పద ప్రయోగాలు చాలా కొత్తగా ఉన్నాయి. భావం కూడా జానపదశైలితో కనబడుతూ నాటు సరసాన్ని ఘాటుగా చూపిస్తోంది. సూపుల తల్వారు, సెంపల తీన్మారు, మెట్టెల జాగీరు, చేపట్టే జాగీర్దారు, కందిపువ్వు, సింతమీద సిలక, బాయిమీద గిలక, గుడిసెల గొడవ, మడిసె, వడిసెల రాయి..ఇలా ఈ పాటలోని పదాల్లో జానపదస్పర్శ స్పష్టంగా కనిపిస్తోంది. పాట రచన ఎంత బాగుందో దానికి తగినట్టుగానే సంగీతాన్ని అందించాడు భీమ్స్. పాటలో.. తెలంగాణ పదాలకు తగిన సంగీతం అందడం వల్లే పాట ఇంత హిట్ అయిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది పచ్చి శృంగారంతో కనిపించే పాట అని భావించాల్సిన పని లేదు. ఈనాటి ట్రెండ్ కు తగినట్టుగా రాయబడిందని గమనించాలి. ఈ పాట నేటికీ కుర్రకారుతో ఈలలేయించి గోల చేయిస్తూనే ఉంది. చేయిస్తూనే ఉంటుంది.
పాట:
దండకడియాల్ దస్తి రుమాల్/ మస్తుగున్నోడంటివొ పిల్లో/అరె..కిరుకిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివొ పిల్లో/గజ్జెల పట్టీలిస్తివో గాజులిచ్చి బుట్టలవేస్తివో/ముక్కెర నువ్వై పూస్తివో నీ ముద్దుల ముద్దరలిస్తివో/అరె..సందడివోలె వస్తివో సోకులంగడి తీసుకుపోతివో/నీ సూపుల తల్వారు నా సెంపల తీన్మారు/సంపంగి మొగ్గల మంచెం ఎక్కి తెంపేరు నవ్వారు/నీ మెట్టెల జాగీరు చేపట్టే జాగీర్దారు/నీ పట్టా భూమిలో గెట్టు నాటుకుంటా జోర్దారు/ఇంచు మించు నీదే పోరా చుట్టూ శివారు/అటు ఇటు చూడకుండా చేసేరు షికారు/ఆగమన్న ఆగేటోన్ని కాదే బంగారు/దూకమంటె ఆగుతాడా దుమ్ములేపే మీసమున్న నాలో మగాడు/అల్లో మల్లో రాములమల్లో జిల్లేడాకుల బెల్లంపెట్టే/నాకు పెట్టక నక్కకు పెట్టే నక్క నోట్లో బెల్లం ఇరికే/పిక్కుంటు పిక్కుంటు బయ్యారం పాయే/అప్పుడే నా ఒళ్ళు ఝల్లుమనే/తోట్లో ఉన్న కూడా గుబ్బల పరుసు/గుబ్బల పరుసుకు జబ్బలరైక/నీ కందిపువ్వునురా/నే కందిపోతానురా/నే ఎకరంనర ఛాతితోటి ఛతిరిపట్టేరు రా/నీ సింగుల సెండోలే నీ కొంగుల దండోలే/నీ గుండెల నిండ ఎన్నెల కుండ దింపిపోతాలే/సింతమీద సిలకోలే కనిపెడతావా/బాయి మీద గిలకోలే మెలిపెడతావా/ఏ గుడిసెల గొడవేదో ఎపుడుండేదే పిల్లా/మడిసెలో నిలబడి వడిసెల్లో రాయిబెట్టి ఇసిరికొడతనే..
- డా||తిరునగరి శరత్‌చంద్ర,
[email protected]
సినీ గేయరచయిత, 6309873682



