Sunday, November 9, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబీజేపీ హయాంలో అన్ని వ్యవస్థలూ దుర్వినియోగం

బీజేపీ హయాంలో అన్ని వ్యవస్థలూ దుర్వినియోగం

- Advertisement -

ఓట్‌ చోరీతో ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఎన్నికల ఫలితాలు
వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ
కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌
బీఆర్‌ఎస్‌ గెలుపు సోషల్‌ మీడియాలోనే : పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీజేపీ హయాంలో దేశంలోని స్వతంత్ర సంస్థలన్నీ దుర్వినియోగమవు తున్నాయని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐ, ఎలక్షన్‌ కమిషన్‌ లాంటి వాటిని మోడీ సర్కార్‌ తన ఇష్టానుసారంగా వాడుకుంటోందని ఆమె విమర్శించారు. ఎల్‌ఐసీని, పోర్టులను కూడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఉపాధ్యక్షులు కైలాస్‌, లింగం యాదవ్‌ తదితరులతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మీనాక్షి ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్‌ చోరీ అనేది ఇందులో భాగమేనని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎనలేని పోరాటం కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. లోక్‌సభతోపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకతవకలను ఆయన ఆధారాలతో సహా నిరూపిస్తున్నారని తెలిపారు. కర్నాటకలోని మహదేవ్‌పురం నియోజకవర్గంలో సైతం ఓటర్ల జాబితాలోని తప్పులను, అక్కడ బీజేపీ చేస్తోన్న మోసాలను రాహుల్‌ ఆధారాలతో సహా బయటపెట్టారని వివరించారు. అయినా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవటం శోచనీయమన్నారు. హర్యానా ఎన్నికల్లో కూడా బీజేపీ ఇలాంటి కుట్రలకే పాల్పడిందని చెప్పారు. అక్కడ 25 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారని తెలిపారు. సుమారు 5 లక్షలకు పైగా డూప్లికేట్‌ ఓటర్లు, తప్పుడు చిరునామాలు, లక్ష మందికి పైగా తప్పుడు ఫొటోలు ఉన్నట్టు తేలిందని విశదీకరించారు. ఒకే మహిళ ఫొటోతో 22 ఎంట్రీలు, మరో మహిళ ఫొటోతో వంద ఓటరు కార్డులున్నాయని చెప్పారు. అందుకే హర్యానాలో 8 సీట్లలో 400 ఓట్ల వ్యత్యాసంతో కాంగ్రెస్‌ ఓడిపోయిందని చెప్పారు. బీహార్‌లో తమకు ఓటు వేయబోరని నిర్దారణకు వచ్చిన తర్వాత అలాంటి ఓటర్ల పేర్లను సర్‌ పేరుతో బీజేపీ తొలగింపజేసిందని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల ఆయా రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని మీనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓట్‌ చోరీపై ప్రజలను జాగృతం చేసేందుకు వీలుగా రాహుల్‌ గాంధీ బీహార్‌లో ‘ఓట్‌ అధికార్‌ ర్యాలీ’కి శ్రీకారం చుట్టారని ఆమె గుర్తు చేశారు. దీంతో బీజేపీకి వెన్నులో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. దీంతో అక్కడ ‘హర్యానా’ ఫార్ములాను అమలు చేసేందుకు కుయుక్తులు పన్నుతోందని దుయ్యబట్టారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టామని వివరించారు. దీనికి 5 కోట్ల మందికిపైగా మద్దతు పలికారని చెప్పారు. మున్ముందు ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని వెల్లడించారు. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ… ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా మన రాష్ట్రంలోనూ సంతకాల సేకరణ చేయాలని నిర్ణయించామని, తుపాను, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వల్ల అది కొంత ఆలస్యమైందని వివరించారు. ఈనెల 11 తర్వాత దాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. పదేండ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఓట్ల చోరీకి పాల్పడిందని విమర్శించారు. గతంలో సీఎస్‌గా పని చేసిన వ్యక్తి అంతకుముందు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. పక్క జిల్లాల ఓటర్లను కూడా జూబ్లీహిల్స్‌ ఓటర్లుగా చూపారని తెలిపారు. అక్కడ బీజేపీ సహకారంతో బీఆర్‌ఎస్‌ మూడు సార్లు గెలిచిందని చెప్పారు. హర్యానా, మహారాష్ట్ర, కర్నాటకలో జరిగిన ఓట్‌ చోరీని గుర్తించి, ఇక్కడ ప్రజలు తెలివిగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ గెలుపు అనేది సోషల్‌ మీడియాలో తప్ప బయట కాదని ఎద్దేవా చేశారు. కొన్ని సర్వే సంస్థలకు డబ్బులిచ్చిన ఆ పార్టీ… తనకు అనుకూలంగా రిపోర్టులను ఇప్పించుకుంటోందని విమర్శించారు. అక్కడ ప్రజలను అంటిపెట్టుకుని ఉన్న నవీన్‌ యాదవ్‌ను తాము అభ్యర్థిగా ప్రకటించామని చెప్పారు. అందువల్ల కాంగ్రెస్‌ విజయం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -