Sunday, November 9, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసామినేని హంతకులను తేల్చరేం?

సామినేని హంతకులను తేల్చరేం?

- Advertisement -

– రామారావు హత్యకు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీల ఖండన
– హత్యకు సుదీర్ఘకాలంగా పథకం!
– ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే..
– బీజేపీ చిచ్చు నుంచి కాపాడే వారిపై కాంగ్రెస్‌ దాడులా?
– ఈ హత్యకు ప్రజలే సమాధానం చెబుతారు: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– పాతర్లపాడులో సంస్మరణ సభ.. భారీగా జనం హాజరు
– గ్రామంలో వందలాది మంది రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/చింతకాని
సామినేని రామారావు హత్యకు సుదీర్ఘకాలంగా పథకం రచించినట్టు హత్య జరిగిన తీరు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను బట్టి తెలుస్తోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. హత్య జరిగి 9రోజులైనా దోషులను తేల్చకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఢిల్లీలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సమావేశంలో ఉన్న తాము కేంద్ర కమిటీ తరఫున ఖండిస్తూ ప్రకటన చేశామన్నారు. ఆ ప్రకటనను చూసి ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కమ్యూనిస్టు పార్టీలు ఆ హత్యను ఖండించాయన్నారు. హత్యకు కారకులు తేలేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో శనివారం ఏర్పాటు చేసిన సామినేని రామారావు సంస్మరణ సభకు బివి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో కలిసి హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు గ్రామంలో పెద్దఎత్తున నిర్వహించిన ర్యాలీలోనూ రాఘవులు పాల్గొన్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంస్మరణ సభకు జనం భారీగా హాజరయ్యారు.

రాజకీయ దురుద్దేశంతోనే హత్య
శత్రువులతోనూ చాలా సౌమ్యంగా వ్యవహరించే వ్యక్తిత్వం సామినేని రామారావుది అని రాఘవులు అన్నారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేకనే హత్య చేశారని ఆరోపించారు. రాష్ట్ర హౌంమంత్రి, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, ఉపముఖ్య మంత్రిగా మధిర నియోజకవర్గానికి చెందిన భట్టి విక్రమార్క, రాష్ట్రంలో కీలక బాధ్యతల్లో జిల్లా మంత్రులున్నా నిందితులను హత్య జరిగి 9 రోజులైనా ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నిం చారు. దొంగలు, దోపిడీదారులను గంటల్లోనే పట్టుకున్నామని ప్రకటనలు చేసే పోలీసులు ఏం చేస్తున్నారని అన్నారు. హత్య జరిగిన వెంటనే ఖండించిన భట్టి విక్రమార్క ఇప్పటి వరకు దోషులను ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. ప్రజలను దోచుకునేది కాంగ్రెసైతే.. ప్రజలను కాపాడేది కమ్యూనిస్టుల న్నారు. కమ్యూనిస్టులకు ప్రాణత్యాగాలు కొత్త కాదన్నారు. సామినేని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

అన్యాయాన్ని ఎదిరించటంలోనే కమ్యూనిస్టుల వైభవం : తమ్మినేని వీరభద్రం
కమ్యూనిస్టుల వైభవం సీట్లు, ఓట్లలో లేదని అన్యాయాన్ని ఎదిరించటంలో ఉందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. బీహార్‌లో 65 లక్షల ఓట్లు తీసివేశారని తెలిపారు. అయినా గెలుస్తామనే నమ్మకం లేక పార్టీలను చీల్చి, ఫిరాయింపులు చేయించేందుకు పూనుకుంటు న్నారన్నారు. అంతటితో ఆగకుండా 30 రోజులు పోలీసు కస్టడీలో ఉంటే పదవుల్లో నుంచి తొలగించేలా బిల్లు తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెడుతోందన్నారు. వారణాసి, మధురలో మసీదులను కూల్చివేయాలని పథకం రచిస్తోందని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టుల తరహాలో కృషి చేయాల్సిన కాంగ్రెస్‌.. దాన్ని మరిచి ‘చెత్త’ రాజకీయాలు చేస్తోందన్నారు. రామారావు మరణం ఉత్తిగా పోదు.. దానికి సరైన న్యాయం చేస్తామన్నారు. పాతర్లపాడులో ఎర్రజెండా మళ్లీ ఎగురుతుందన్నారు. సామినేని రామారావు కేసు విషయంలో వినతులు, విజ్ఞప్తులకు పరిమితం కాము.. దండానికి, విజ్ఞప్తికి అంగీకరించకపోతే దండం తీసుకోవటమూ తెలుసని హెచ్చరించారు. ప్రజలే పరమావధిగా భావించి నిష్కంళక ఉద్యమాలు చేసిన నాయకుడు సామినేని అని అన్నారు. ఆనాడు ఖమ్మం డివిజన్‌ ఉద్యమంలో హత్యలు, లైంగికదాడులు, దాడులు కొనసాగాయని, కాంగ్రెస్‌ నాయకులు తమకు ఎదురేలేదనట్టుగా కమ్యూనిస్టులను ఊచకోత కోసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. కమ్యూనిస్టు నాయకులపై నిర్బంధకాండ కొనసాగిన గ్రామాల్లో ఒకటి పాతర్లపాడు అన్నారు. నిజమైన కమ్యూనిస్టుకు వ్యక్తిగత ద్వేషాలు ఉండొద్దని, కానీ వర్గపోరాటం విషయంలో తెగువ చూపించే శౌర్యం కమ్యూనిస్టులకు ఉండాలన్నారు. ఆ రకమైన మిలిటెంట్‌ మనస్తత్వం రామారావుది అని తెలిపారు. రామారావు హత్య వెనుక కాంగ్రెస్‌ గూండాలున్నారనేది వాస్తవం అన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ నాయకులు లేరనుకుంటే దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీపై ఉందన్నారు.

దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డారు.. : జాన్‌వెస్లీ
దోపిడీ, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా నిలబడ్డారు కాబట్టే సామినేని రామారావును హత్య చేశారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. 9 రోజులైనా హంతకులను తేల్చకపోతే పోలీసు వ్యవస్థ ఎందుకు? అని ప్రశ్నించారు.
ఆర్థిక ప్రయోజనాల రీత్యా హత్య జరిగితే కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడైనా పంచాయితీ చేసిందా? అని ప్రశ్నించారు. రాజకీయ హత్యకాదంటున్న పోలీసు కమిషనర్‌.. రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరండి..? అని సూచించారు. రాజకీయ హత్యా, ఏ రూపంలో హత్య జరిగిందో తేల్చాలి తప్ప కాంగ్రెస్‌ నాయకునిగా సీపీ వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. హంతకులు అనుకుంటున్నారు.. తమ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎవరూ ఏమి చేయలేరనే రీతిలో వ్యవహరిస్తుం డొచ్చు.. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ అనుకున్నా న్యూయార్క్‌లో ఎర్రజెండా ఎగిరిందనే విషయాన్ని గుర్తుంచుకో వాలని హెచ్చరించారు.

ఫాసిస్టు విధానాలను ధిక్కరించేదే కమ్యూనిజం: వై.వెంకటేశ్వరరావు
హంతకులను తేల్చి కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వ ప్రమేయం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత భట్టి ్టవిక్రమార్కపై ఉందని సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అన్నారు. ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు నిలబడుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో వందలాది మంది కమ్యూనిస్టులకు ప్రాణత్యాగం చేసిన చరిత్ర ఉందన్నారు.
సీపీఐ(ఎం) మధిర డివిజన్‌ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, పాలడుగు భాస్కర్‌, బండారు రవికుమార్‌, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్‌, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి, మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, ఏజే రమేశ్‌, బండి రమేష్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.

వందలాదిగా రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు
సామినేని రామారావు సంస్మరణ సభ ప్రారంభానికి ముందు గ్రామంలో వందలాది మందితో రెడ్‌షర్ట్‌ కవాతు నిర్వహించారు. ఎర్రచొక్కాలు ధరించి కార్యకర్తలు, గ్రామస్తులు ర్యాలీలో కదం తొక్కారు. గ్రామ బీఆర్‌ఎస్‌ నాయకత్వం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ తదితర పార్టీలు సంతాపం తెలిపాయి. ముందుగా నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి రామారావు చిత్రపటానికి బివి.రాఘవులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. సామినేని రామారావుపై ‘నవతెలంగాణ’ ప్రచురించిన ప్రత్యేక సంచికను రాఘవులు, తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -