– తీవ్ర పని ఒత్తిడి, యాజమాన్యాల టార్గెట్లే కారణాలు
– భారత ఉద్యోగుల్లో కొత్త ధోరణి
– సెలవు తీసుకొని మరీ ఆఫీస్ పనుల నిర్వహణ
– ప్రభుత్వాల నియంత్రణ, పర్యవేక్షణ కరువు
– శ్రమ దోపిడీ, మానసిక, శారీరక ఒత్తిళ్లలో ఉద్యోగులు
– హెచ్చరిస్తున్న నిపుణులు
రాజు ఒక కంపెనీలో ఉద్యోగి. సోమవారం ఉద యం ఆఫీస్‌కు వెళ్లకుండా సెలవు తీసుకున్నాడు. అయితే ఆయన తీసుకున్న ఆ లీవ్ తనకు విశ్రాంతి కోసమో, కుటుంబంతో గడపడం కోసమో, ఇతర ఏదైనా వ్యక్తిగత పనులను పూర్తి చేసుకోవడం కోసమో కాదు.. ఆఫీస్‌కు సంబంధించిన తన డిజైన్ ప్రాజెక్ట్‌ను ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి చేయడం కోసం. ఆఫీస్‌లో ఉండే వర్క్‌లోడ్, రెగ్యులర్ మీటింగ్స్, టార్గెట్స్ వంటివి ఆయనను తన పనిని విశ్రాంతిగా పూర్తి చేసుకోనివ్వక పోవటంతో సెలవు తీసుకొని మరీ ఇలా చేశాడు. రాజు తీసుకున్న లీవ్ ఆఫీస్ పని కోసమన్నది యాజమాన్యానికి కూడా తెలియదు. ఇలా రాజులాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉద్యోగులు దేశంలో అనేక మంది ఉన్నారు. భారత ఉద్యోగుల్లో కొత్తగా ఇలాంటి ధోరణి పెరుగుతున్నది. ఒక ఉద్యోగి సెలవు తీసుకోవడం అంటే విశ్రాంతి కోసం కాదనీ, ఆఫీస్ ఒత్తిడి నుంచి దూరంగా కాసేపు శాంతిగా పని చేసుకునే ప్రయత్నమని నిపుణులు చెప్తున్నారు. ఈ విధానాన్ని వారు కాస్త వ్యంగ్యంగా ‘వర్క్-ఫ్రమ్- లీవ్’ గా పిలుస్తున్నారు. ఉద్యోగులపై యాజ మాన్యాలు ఒత్తిడిని తగ్గించాలనీ, ఈ విషయంలో ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ పెరగాలని వారు సూచిస్తున్నారు.
టీచర్లదీ అదే బాధ
భారత్‌లోని విద్యారంగంలో భాగస్వామ్యమైన ఉపాధ్యాయులు కూడా ఇవే పని పరిస్థితులను ఎదుర్కొం టున్నారు. చారూ మాథూర్ (57) ఢిల్లీలోని ఒక ప్రయివేటు స్కూల్‌లో హిందీ టీచర్‌గా పని చేస్తున్నారు. ”బోధన కేవలం క్లాస్‌రూమ్ వరకే పరిమితం కాదు. మేము చాలా అడ్మినిస్ట్రేటివ్ పనులు, స్టూడెంట్ డేటాబేస్‌లు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలి. టెక్నాలజీ అంతగా రాని వారికి ఇందుకు రెండింతల సమయం పడు తుంది. ఫ్రీ పీరియడ్‌లో ఇతర బాధ్యత లుంటాయి. దీంతో మా పనిని పూర్తి చేసేందుకు సమయం దొరకదు. అందేకే పనిని పూర్తి చేసేందుకు టీచర్లు సెలవు తీసు కుంటారు. ఇవన్నీ మానసికంగా, శారీర కంగా అలసటను కలిగిస్తున్నాయి” అని ఆవేదనను వ్యక్తం చేశారు.
సృజనాత్మక రంగంలో కాస్త స్పేస్ కావాలి
శివం సచ్‌దేవా నోయిడాలోని ఒక లగ్జరీ బ్రాండ్ సీనియర్ గ్రాఫిక్ డిజైనర్. ”మీటింగ్స్, టీమ్‌కాల్స్, బ్రేక్‌టైమ్.. ఇవన్నీ ప్రొడక్టివ్ అవర్స్‌ను దెబ్బ తీస్తాయి. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్లకు ప్రశాంత వాతావరణం అవసరం. కానీ ఇక్కడ ఒత్తిడి చాలా ఎక్కువ. రాత్రి ఎంత త్వరగా ఇంటికి వెళ్లినా.. చివరికి సెలవు తీసుకొని కేటాయించిన పనిని,
పెండింగ్ టాస్క్‌ను పూర్తి చేయాల్సి వస్తుంది” అని అన్నాడు.
క్రియేటివ్, మీడియా రంగాల్లోనూ..
దీక్షారారు ఒక ఫీచర్స్ రైటర్. ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. ”కొన్ని ఆర్టికల్స్‌కు ఎక్కువ, లోతైన పరిశోధన అవసరం. ఇందుకు తగినట్టుగానే ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కానీ అంతలోనే నాకు కొత్త అసైన్‌మెంట్స్, టాస్క్‌లు వస్తాయి. అందుకే.. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి సెలవు తీసుకొని పాత పనులు పూర్తి చేస్తాను” అని ఆమె చెప్పారు. సిమ్రన్ అనే ఒక పీఆర్ ప్రొఫెషనల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆఫీస్‌లో తనకు ఇచ్చిన ఒక ముఖ్యమైన టాస్క్‌ను పూర్తి చేసేందుకు సెలవు తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.
భారత్‌లో ఓవర్‌వర్క్ కల్చర్
ఉద్యోగుల్లో ఇలాంటి ధోరణి భారత్‌లో వ్యాపించిన ఓవర్‌వర్క్ కల్చర్‌కు సూచనగా నిపుణులు, మేధావులు చెప్తున్నారు. భారత్‌లో అధిక పని వేళల సంస్కృతిని వారు ఎత్తి చూపుతున్నారు. భారత ఉద్యోగుల్లో 51 శాతం మంది వారానికి 49 గంటల కంటే ఎక్కువ పని చేస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఈ విషయంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండటం ఆందోళనకరమైన విషయమని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)ల అధ్యయనం ప్రకారం.. వారానికి పరిమిత పని గంటల కంటే ఎక్కువ పని చేస్తే స్ట్రోక్ వచ్చే ప్రమాదం 35 శాతం పెరుగుతుంది. అలాగే గుండె సంబంధ వ్యాధితో మరణాలు 17 శాతం పెరుగుతాయి.
న్యూఢిల్లీ : సాధారణంగా మనం సెలవు తీసుకుంటే ఇంటి పనులు, కుటుంబ కార్యక్రమాలు, డాక్టర్ అపాయింట్‌మెంట్, పిల్లల స్కూల్ ఫంక్షన్ వంటి ఇతర అవసరాల కోసం వినియోగిస్తుంటాం. ఆ సమయంలో ఆఫీస్ పనితో సంబంధమే ఉండదు. అయితే భారత్‌లో మారుతున్న పని సంస్కృతి, పెరుగుతున్న శ్రమ దోపిడీ, అమలు కాని చట్టాల కారణంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు ఆఫీస్ పనులు పూర్తి చేసుకోవడానికి సెలవులు తీసుకోవడాన్నే మార్గంగా భావిస్తున్నారు. ఈ ‘వర్క్-ఫ్రమ్-లీవ్’ ధోరణిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో పలువురు ఉద్యోగులు ఆన్‌లైన్ వేదికగా తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కూడా ఈ ధోరణికి సంబంధించి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు స్పందనగా వందలాది మంది ఉద్యోగులు తమ స్పందనను తెలియజేశారు. ”అనవసరపు మీటింగ్‌లు, అంతరాయం కలిగించే అదనపు పనుల నుంచి దూరంగా.. ఆఫీస్‌లో నాకు కేటాయించిన పనిని పూర్తి చేసేందుకు సెలవు తీసుకుంటా” అని ఒకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ”నాకు మేనేజర్, క్లయింట్లు అంతరాయం కలిగించకుండా కాస్త ప్రశాంతంగా పని చేసుకునేందుకు నేను సెలవు తీసుకునేవాడిని..” అని మరొక నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. అయితే ఇదంతా వినడానికి వింతగా అనిపించినా.. భారత్‌లోని లక్షలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే.
వ్యవస్థలో సమస్య..ఉద్యోగుల్లో కాదు
భారత్‌లో ఇలాంటి పని పరిస్థితులు ప్రశాంతమైన వర్క్ కల్చర్‌ను చెడగొడతాయని నిపుణులు చెప్తున్నారు. ‘యెస్ బాస్’ అనే కార్పొరేట్ కల్చర్, సరిహద్దులు పెట్టుకోలేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని దుబారులో పని చేస్తున్న ఐటీ ప్రొఫెషనల్ ఉమాంగ్ సిన్హా అంటున్నారు. అనవసరపు మీటింగ్‌లకు హాజరయ్యే బదులు ఉద్యోగులు తమ సీనియర్లతో మాట్లాడాలని సూచిస్తున్నారు.
ఈ విషయంలో కంపెనీలు కూడా బాధ్యత తీసుకోవాలని హెచ్‌ఆర్ కన్సల్టెంట్ సూర్య శేఖర్ దేవ్‌నాథ్ అంటున్నారు. ”ఉద్యోగి పని దినంలో సగం సమయం మీటింగ్‌లు, ఈమెయిల్స్‌కే పోతోంది. ప్రొడక్టివ్ వర్క్ కోసం సమయం ఉండటం లేదు” అని ఆయన అన్నారు. సంస్థలు ఫోకస్ అవర్స్, నో-మీటింగ్ డేస్, సైలెంట్ బ్లాక్స్ వంటివి అమలు చేయాలని సూచించారు. ఉద్యోగులకు విశ్రాంతి కోసం సెలవు అనే విధానాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఎక్కువ పని గంటలు అంటే ఎక్కువ అవుట్‌పుట్ అనే అపోహ నుంచి సంస్థలు బయట పడాలని సూచిస్తున్నారు. నిజమైన ప్రొడక్టివిటీ మానసిక ఆరోగ్యం, స్పష్టత, ప్రాధాన్యతా క్రమం నుంచే వస్తుందని ఆయన చెప్తున్నారు.



