క్యూ2 ఆదాయంలో 25 శాతం వృద్ధి
హైదరాబాద్ : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 4.2 శాతం వృద్ధితో రూ.49.5 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.47.6 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2025-26 క్యూ2 ఫలితాలకు ఆ కంపెనీ బోర్డు శనివారం ఆమోదం తెలిపింది. ఈ త్రైమాసికంలో ఒలెక్ట్రా రెవెన్యూ 25.4 శాతం పెరిగి రూ.657 కోట్లకు చేరింది. 2024-25 ఇదే త్రైమాసికంలో రూ.524 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. అయితే మార్జిన్లు మాత్రం 15.5 శాతం నుంచి 13.6 శాతానికి తగ్గాయి.
గడిచిన క్యూ2లో 375 వాహనాలను డెలివరీ చేసి నూతన మైలు రాయిని సాధించినట్లు ఒలెక్ట్రా తెలిపింది. ఇప్పటివరకు 3254 వాహనాలు డెలివరీ చేయటంతో పాటు 9818 వాహనాల ఆర్డర్ బుక్‌తో భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాది వేసుకుంది. ‘ఒక త్రైమాసికంలో అత్య ధికంగా 375 ఎలక్ట్రిక్ వాహనాలు, అందులో 25 ఎలక్ట్రిక్ టిప్పర్లు విజయవంతంగా డెలివరీ చేయడం మాకు గర్వ కారణం. ఆపరేషనల్ సామర్థ్యంపై ఫోకస్ పెట్టడం ద్వారా ఆదాయంలో, లాభంలో గణనీయమైన వృద్ధి సాధించాము. భారతదేశంలో తొలిసారిగా బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ సర్టిఫికేషన్ సాధించినందుకు సంతోషిస్తున్నాము.” అని ఒలెక్ట్రా మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ బాబు పేర్కొన్నారు.
ఒలెక్ట్రాకు రూ.49.5 కోట్ల లాభాలు
- Advertisement -
- Advertisement -



