నవతెలంగాణ-హైదరాబాద్: ఓట్ల చోరీతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలకు ప్రమాదం పొంచి ఉందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా పాంచ్‌మరి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 25లక్షల ఓట్లు చోరీ అయ్యాయని ఆయన ఆరోపించారు. ఎనిమిది మందిలో ఒకరు ఓటు చొప్పున ఓటర్ జాబితాలో పేర్లు గల్లంతు అయ్యాయన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, మహారాష్ట్రల్లో ఇదే తంతు జరిగిందని, ఓట్ల చోరికి బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం భాగస్వామ్యముందని ఆరోపించారు. ఓట్ల చోరీపై తమ వద్ద అనేక ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే అవి బయటపెడతామన్నారు.
ఎన్నికల దుర్వినియోగాన్ని సంస్థాగతీకరించడానికి అధికార బీజేపీ ఒక యంత్రాంగాన్ని సృష్టిస్తోందని, ప్రధాన సమస్య ఓటు చోరీని SIR ద్వారా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ చేత రాయబడిన భారత్ రాజ్యాంగంపై పీఎం మోడీ, అమిత్ షా, ఈసీ ఉమ్మడిగా దాడులు చేస్తున్నాయని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.



