నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
“సంపత్” లు సమాజ రుగ్మతల పట్ల పోరాడుతూ సామాజిక సేవలో ముందుండాలని “సంపతుల సేవాసమితి” గ్రూప్ వ్యవస్థాపకుడు ముక్కెర సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం హుస్నాబాద్ లో సంపతుల సేవా సమితి హుస్నాబాద్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ రోజులలో అనేక వాట్సాప్ గ్రూపులు ఏర్పడ్డాయని అన్నారు. సంపత్ అనే పేరు గల వాళ్లతో ఏర్పాటు చేసుకున్న ఈ గ్రూపు ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చర్చించుకున్నట్లు తెలిపారు.
తామంతా అతి త్వరలో భారీ స్థాయిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తహీనతతో బాధపడుతున్న వారికోసం రక్త నిధిని సమకూరుస్తామని అన్నారు. గంజాయి బారినపడి యువతరం పెడదోవ పడుతుందని, దాని నిర్మూలన కోసం అతి త్వరలో ఒక కార్యక్రమం చేపడతామని అన్నారు. రాబోయే మేడారం సమ్మక్క జాతరలో తాము వాలంటీర్లుగా పనిచేసి భక్తులకు సహకరిస్తామని అన్నారు. ఇలా అనేక సేవా కార్యక్రమాల ద్వారా సంపతులందరము సమాజానికి అందుబాటులో ఉందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలం సంపత్ యాదవ్, రేపాక సంపత్ రెడ్డి, భూక్య సంపత్ నాయక్, ఎలగందుల సంపత్, బొంగోని సంపత్, బొడుమల్ల సంపత్ లు పాల్గొన్నారు.



