నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ మండలం అవంతిపురం లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో దాన్యం కొనుగోలు చేయకుండానే అడ్డదారులు ట్రక్ షీట్ జారీ చేయడంపై జిల్లా కో-ఆపరేటివ్ అధికారి ఎం పత్యానాయక్ ఆదివారం విచారణ నిర్వహించారు. ఆదివారం జిల్లా కో-ఆపరేటివ్ అధికారి పత్యానాయక్ అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకొని కేంద్రంలో ఉన్న ధాన్యం రాశులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు వివరాలను సేకరించారు. సెంటర్ కు దాన్యం రాకుండానే నేరుగా రైతు కల్లం వద్దకి బస్తాలు ఇవ్వడం పచ్చి సరుకును నేరుగా పట్టణ పరిధిలోని శ్రీ శివ సాయి రైస్ ఇండస్ట్రీస్ కు తరలించారు ఈ విషయం పై పిఎసిఎస్ సీఈఓ సైదులు ను విచారణ చేసి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో 17% తేమ ఉంటేనే ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని వివరించారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామనీ, ఇంకా మరో 75 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు .ఇప్పటివరకు 96వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 158 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఆయన వెంట ఇంచార్జి ఏ డి ఏ సైదా నాయక్ తదితరులు ఉన్నారు.



