Monday, November 10, 2025
E-PAPER
Homeదర్వాజ'మేలిమి చింత' వియోగ దీర్ఘకావ్యం

‘మేలిమి చింత’ వియోగ దీర్ఘకావ్యం

- Advertisement -

”I loved you for your whole life and I will remember you for the rest of mine” ”హృదయం ద్రవించింది/ మస్తిష్కం చేతనమైంది/ స్వంతం చేసుకున్న పదం/ కవిత్వరూపం దాల్చింది/ ఆ కవిత్వమే నన్ను బతికిస్తుంది” ప్రమోద్‌ ఆవంచకి 2019 లో తగిలిన మానని గాయం తన అర్ధాంగి వియోగం. తనలో నిద్రాణమై ఉన్న కవితాహృదయం ఆ వియోగంచే చేతనమై కవిత్వరూపంలో ఆవహించి తనను బ్రతికిస్తుందంటాడు. నిజానికి, ఈ కవి తెలుగు కవిత్వప్రపంచంలోకి ఆలస్యంగా అడుగు పెట్టినా, ఆ ఖాళీని తొందరగానే తన కవిత్వంతో పూరించగలిగాడు. తన వియోగవేదనను, మదిలో మెదిలే ఆలోచనల్ని, దుఃఖాన్ని, హృదయం పలికే శబ్ధాల్ని కలిపి తన తొలి కవితాసంపుటి ”గుండెచప్పుళ్ల” ను మనతో పంచుకున్నాడు.

ప్రమోద్‌ రాసిన ఈ కవితలన్నీ తన వ్యక్తిగత శోకంలోంచి వచ్చిన శ్లోకాలైనప్పటికీ మన హృదయపు విషాదతంత్రుల్ని మీటే అశ్రుకవనాలు. తాను ఎవరితో చెప్పుకోలేని బాధల్ని, అంతరంగ సంవేదనల గుండె భారాన్ని తగ్గించిన వాహిక కవిత్వమే. ఒక వ్యక్తిలో నిభిడీకతమై ఉన్న కవితాశక్తి బయటికి రావాలంటే ఆ వ్యక్తికి అత్యంత బాధపెట్టె సంఘటనో లేక సంతోషపెట్టే సందర్భమో ఎదురవ్వాలి. అప్పుడే ఆ సంఘటన తాలూకు అనుభవానుభూతి ఏదో ఒక కళాత్మకరూపంలో ఒక అపురూప కళాఖండంగా ఆవిష్కతమవుతుంది. తన మనస్సులో ఇగిరిపోని ఆమె తాజా జ్ఞాపకాల్ని, ఎప్పటికీ తడి ఆరని ఆమె స్మతుల్ని మళ్ళీ ఇప్పుడు తన కవితల్లోకి అనువదించి ”మేలిమి చింత” వియోగదీర్ఘకావ్యంగా మన ముందుకొచ్చాడు.

‘ఆరాధించే కళ్ళు’ అనే కవితలలో… ఆమెనే ధ్యానిస్తూ ఒంటరి జీవితపు గతకాలపు అనుభవాలను నెమరేసుకుంటాడు ఇలా… ”తెరిచి తెరిచి చూసినా ఆరాధించే కళ్ళల్లో కన్నీళ్లు/ మసక మసకగా జీవితం/ విభజించబడ్డ ప్రేమలో ఒంటరి తనం/ చుట్టూ నీ ధ్యానం/ మిన్నూ మన్నూ అంతా మన ప్రపంచం” విరివిగా కవిత్వం రాసినప్పటికీ, రాసిన ప్రతి కవితను అచ్చులో చూసుకోవాలనే ఉబలాటం లేని కవి ప్రమోద్‌. తాను రాసే ప్రతి కవిత బలమైన కవితగా మల్చాలనే తపన ఆయన కవిత్వం చదివితే ఇట్టే అర్థం అవుతుంది. ఈ వియోగకవిత్వం పాఠకులను ఒక తీవ్రమైన ఆవేదనకో… అనూహ్యానుభూతికో గురిచేస్తుంది.

ఇందులోని చాలా కవితల్లో తన భార్యలేని లోటును తన ఒంటరితనాన్ని వాళ్ళిద్దరి మధ్య ప్రేమ యొక్క శాశ్వతత్వాన్ని గాఢంగా స్మరించుకుంటాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం, పంచుకున్న ప్రేమ ఎప్పటికీ తరిగిపోని, హదయపు లోతుల్లో ఎన్నటికీ చెరిగిపోనీ అవ్యక్తానుభూతే. మెటాఫిసికల్‌ కవి జాన్‌ డన్‌, రొమాంటిక్‌ కవి జాన్‌ కీట్స్‌ వంటి వారు భార్యావియోగంలో ఆంగ్లంలో అసాధారణమైన కవిత్వం రాశారు. ప్రఖ్యాతకవి జాన్‌ మిల్టన్‌ తన భార్య జ్ఞాపకాలను తలపోస్తూ ”On His Diseased Wife” అనే అద్భుతమైన కవిత రాస్తాడు. ఆ కవితలో ఆమె ఔన్నత్యాన్ని, పవిత్రమైన మనస్సును, అమాయకత్వాన్ని వర్ణిస్తాడు.

ఈ ‘మేలిమి చింత’ సంపుటిలో కేవలం ఆవేదనాత్మక కవితలే కాదు, అనుభూతినిచ్చే అనుభవైక, సామాజికస్పహ కలిగిన కవితలు కూడా మనల్ని వెంటాడతాయి. పూలవర్షం పంచే సువాసనా పరిమళాల గుభాళింపులు, కళ్ళలో ఆవిరౌతున్న తడిఆరని జ్ఞాపకాలు మెల్లగా, మౌనంగా ప్రవహించే అనంతమైన ఆలోచనలు..ఆకాశంలో పరుచుకున్న వెండిమబ్బులు…అర్ధచంద్రాకార హరివిల్లులు…ఈ కవితల్లో చూడవచ్చు. John Donne ”A Valediction:Forbidding Morning అనే కవితలో భార్యాభర్తల అనుబంధాన్ని చాలా metaphorical గా వర్ణిస్తాడు.

వెలుగు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి అందరున్నా చీకటి మిగిల్చిన ఒంటరి జీవితాన్ని…ఆశలన్ని ఆవిరైపోయి, నిశీధిశకలాల్లో మౌనంగా సాగిపోతూ, అందని ఆకాశాన్ని అందుకునే ప్రయత్నంలో దారితప్పిన బాటసారి అనంత ప్రయాణానికి, దీపదారి ఈ కవితాక్షరాలు. ‘చుట్టుకున్నవేడి’ లో తన కవితాత్మను ఎలా వ్యక్తీకరించాడో చూడండి. ”అందని ఆకాశాన్ని తాకే వధా/ ప్రయాసం చేస్తూ…/ శ్వాస శ్లోకమై నిన్ను జపించే/ జ్ఞాపకమై సాగిపోతుంది.” మరిచిపోలేని కన్నీళ్ళ భావోద్వేగ జ్ఞాపకాలు, మాసిపోని గతకాలపు మానని గాయాలు నిరంతరం ఊపిరిలో ఆవిరౌతున్న ప్రతి క్షణం ఆగిపోని కాలంతో సాగిపోతున్న జీవితానికి ప్రతీకలు ఈ కవితలు. ”ఆ పదం…/ నిన్ను చేరే అంతిమ గమ్యమై/ మన ఎన్నోజ్ఞాపకాల వెలుగుల మంటలయ్యే/ ఆ పదం మరణమే కదూ….” అంటూ పుట్టినరోజే మరణ ముహూర్తం ఖరారౌతుందనే చేదు నిజాన్ని తాత్వికగాఢతతో పలికిస్తాడు.

తీగ తెగిన జీవితం పలికే అపస్వరాల గమకాల్నిమౌనంగా పాడుకుంటూ….నిశీధి నిండిన దారినంతా ఆరిపోయిన దీపాలను వెలిగించుకుంటూ…సజీవమైన ఆమె జ్ఞాపకాల్ని స్వప్నాలలో ధ్యానిస్తాడు. గమ్యం తెలియని ప్రయాణం సాగిస్తూ, తన గుండె నిండుగా ఆమె ప్రాణాన్ని నింపుకొని ఆమె శ్వాసనే తన ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా చేసుకొని జీవనయానం కొనసాగిస్తున్నానంటూ..తన కవితాత్మను ”నా శ్వాసవు నువ్వు” అనే కవితలో ఇలా పలికిస్తాడు. ”నీ నడకే నా గుండె చప్పుడై/ మనసు పలికింది/ నీ ప్రాణం తో నిండిన నా గుండె/ నేటికీ నీ శ్వాసతోనే బతుకుతుంది” మబ్బులు కమ్మిన ఆకాశంలో జలపాతాల్లా, ప్రవహించే ప్రేమ కావ్యాలు రాసే రసహృదయం కలిగిన కవి ప్రమోద్‌ ఆవంచ…వర్షం వచ్చిపోయిన మరుక్షణమే అందమైన హరివిల్లు కోసం చిన్నపిల్లాడిలా ఎదురుచూసే పసిహృదయం కలిగిన ఈ కవి కలం నుంచి పాఠక హృదయాలను కదిలించి, మనసులను కరిగించే మరెన్నో కవిత్వసంపుటాలు రావాలని బలంగా కోరుకుంటూ…

  • ప్రొ||బాణాల శ్రీనివాసరావు, 9440471423
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -