కేంద్ర మంత్రి బండి సంజయ్ కి అల్లీపురం డిమాండ్
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సీనియర్, జూనియర్ జట్ల ఎంపికలో సెలక్షన్ కమిటీ, ఆఫీస్ బేరర్ల అవినీతి తారా స్థాయికి చేరుకున్న తీరుపై కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆలస్యంగా స్పందించటం శోచనీయమని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) అధ్యక్షులు, క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. తొమ్మిది దశాబ్దాలుగా హెచ్‌సీఏ అవినీతి కూపంలో కూరుకుంది. ఫలితంగా గ్రామీణ క్రికెటర్లకు తీరని అన్యాయం జరిగింది. ప్రతిభావంతులైన జిల్లా క్రికెటర్లు బీసీసీఐ టోర్నమెంట్లలో ఆడే అవకాశానికి దూరమవగా.. అవినీతి, దొడ్డిదారిన పసలేని క్రికెటర్లు రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
హెచ్‌సీఏ ప్రక్షాళన ఇక అసాధ్యం, ప్రత్యేక తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌తోనే గ్రామీణ క్రికెటర్లకు న్యాయం చేకూరుతుంది. గ్రామీణ క్రికెట్ అభివద్దిపై చిత్తశుద్ది ఉంటే కేంద్ర మంత్రి హౌదాలో బండి సంజయ్ హెచ్‌సీఏ అవినీతిపై పూర్తి స్థాయి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. హెచ్‌సీఏలో హైదరాబాద్ నుంచే 200కు పైగా క్రికెట్ కబ్ల్‌లు ఉండగా.. గ్రామీణ తెలంగాణ నుంచి పట్టుమని పది జట్లకు కూడా ప్రాతినిథ్యం లేదు. 33 జిల్లాలకు ప్రాతినిథ్యం లేని హెచ్‌సీఏతో గ్రామీణ క్రికెట్‌కు ఎప్పటికీ న్యాయం చేకూరదు. అందుకే, తెలంగాణ గ్రామీణ క్రికెట్ అసోసియేషన్‌కు బీసీసీఐ గుర్తింపు కోసం బండి సంజయ్ కేంద్ర స్థాయిలో కృషి చేయాలని అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు.



