సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే అది కమ్యూనిస్టు ప్రభుత్వాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో సీపీఐ(ఎం) మాజీ మండల కమిటీ సభ్యులు బొంగరాల వెంకన్న ప్రథమ వర్థంతి సందర్భంగా స్థూపావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొంగరాల వెంకన్న ఉట్లపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పార్టీ నిర్మాణం కోసం అహర్నిశలు పాటు పడ్డారన్నారు. ఆయన సేవలను నేటి తరం గుర్తుంచుకొని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు.
పాలకులు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని ప్రభుత్వం మరిచిందన్నారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారని, సీపీఐ(ఎం) చేసే పోరాటాల్లో భాగస్వాములై ప్రజాఉద్యమాలకు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవినాయక్, జిల్లా కమిటీ సభ్యులు చౌగాని సీతారాములు, మండల కమిటీ సభ్యులు నాగ్‌హుస్సేన్, కన్నెగంటి రామకృష్ణ, చౌగాని వెంకన్న, జిల్లానగేష్, బొంగరాల వెంకన్న కుమారులు హరి, విజయ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



