పెద్ద నోట్ల రద్దుకు తొమ్మిదేండ్లు
ఆస్తుల రూపంలో భద్రంగా నల్లధనం
రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయ-ఆర్థిక నిపుణులు
తుగ్లక్ నిర్ణయమంటూ ప్రతిపక్షాల మండిపాటు
న్యూఢిల్లీ : 2016 లో దేశంలో అనేక సర్జికల్ స్రైక్స్ జరిగాయి. పాకిస్తాన్‌పై దాడి ఓ సర్జికల్ స్రైక్ అయితే నల్లధనం, ఉగ్రవాదుల నిధులు, మాదక ద్రవ్యాల సొమ్ముపై జరిగింది మరో సర్జికల్ స్రైక్. అదే పెద్ద నోట్ల రద్దు. అది ప్రజలపై ఎంతగా ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు జరిగింది. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లకు కాలం చెల్లి తొమ్మిది సంవత్సరాలు గడిచాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రస్తుతం నయా ఉదారవాద అభివృద్ధి అజెండాను తలకెత్తుకొని ముందుకు సాగుతోంది. గతంలో దేశాన్ని పాలించిన యూపీఏ ప్రభుత్వం మాదిరిగానే ప్రపంచీకరణ విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్ వ్యాపార సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రభుత్వానికి, వ్యాపారానికి మధ్య విడదీయలేని అవినాభావ సంబంధం ఏర్పడింది.
బ్యాంకుల ఎదుట సొమ్మసిల్లి…
బ్యాంకులకు నగదు ప్రవాహాన్ని పెంచడానికి పెద్ద నోట్ల రద్దు ఉపకరించింది. ‘మనం నిజాయితీ కలిగిన పౌరులుగా అవినీతి, నల్లధనం, బినామీ ఆస్తులు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం’ అని ప్రధాని మోడీ గతంలో ”నోట్ల రద్దు దినోత్సవ” ప్రసంగంలో చెప్పుకొచ్చారు. కానీ జరిగిందేమిటి? మన వద్ద ఉన్న పాత డబ్బును ఇచ్చి కొత్త నోట్లను పొందడానికి బ్యాంకుల ఎదుట బారులు తీరాం. ఈ క్రమంలో మహిళలు, వృద్ధులు అనేక మంది సొమ్మసిల్లి పడిపోయారు. మోడీ ప్రభుత్వం డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చి నగదు లావాదేవీలు పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు, వ్యాపారాలు సులభంగా చేసుకునేందుకు అది ఉపయోగపడుతుందని చెప్పుకుంది. నగదు రహిత లావాదేవీలు భారీగా జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. పెద్ద నోట్లు రద్దయిన పక్షం రోజులలోనే పేటీయం ద్వారా రికార్డు స్థాయిలో 70 లక్షల లావాదేవీలు జరిగాయి. ఆ మరునాడే పేటీయం యాజమాన్యం వార్తా పత్రికలలో పూర్తి పేజీ ప్రకటనలు గుప్పించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానిని అభినందించింది.
నిపుణుల మాట
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని రాజ్యాంగ ధర్మాసనం సమర్ధించింది. అయితే ఐదుగురు సభ్యుల ఆ ధర్మాసనంలో జస్టిస్ బీవీ నాగరత్న ఆ నిర్ణయంతో విభేదించారు. ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తన లక్ష్యాన్ని సాధిస్తుందా లేదా అన్న దానితో తనకు సంబంధం లేదని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. పెద్ద నోట్ల రద్దు వెనుక మోడీ ప్రభుత్వం మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. నల్లధనాన్ని పూర్తిగా వెలికితీయడం, నకిలీ కరెన్సీ నోట్లను నిర్మూలించడం, డిజిటల్ లావాదేవీల ద్వారా నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడం. పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని ఏ మేరకు వెలికితీశారో చెప్పడం కష్టం. ఎందుకంటే దీనికి సంబంధించి ఎలాంటి నివేదికలు లేవు. పెద్ద నోట్ల రద్దును ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా వ్యతిరేకించారు.
ఆస్తులపై ప్రభావం నిల్
నల్లధనాన్ని నిర్మూలించడంలో పెద్ద నోట్ల రద్దు విఫలమైందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. స్థిరాస్తులు, బులియన్ వంటి ఆస్తుల రూపంలో ఉన్న నల్ల సంపదను వెలికితీయడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని విశ్లేషకులు తెలిపారు. కేవలం నగదు రూపంలో ఉన్నది మాత్రమే బ్యాంకులకు తిరిగి చేరుకుంది. పెద్ద నోట్ల రద్దు సహా నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలు లెక్కకు రాని ఆదాయాన్ని, ఆస్తులను పన్ను పరిధిలోకి తెచ్చిందని కొన్ని ప్రభుత్వ నివేదికలు చెప్పాయి. అయితే ప్రతిపక్షాలు, అనేక ఇతర నివేదికలు మాత్రం లక్ష్య సాధనలో వైఫల్యాన్ని ఎండగట్టాయి. రూ.15.41 లక్షల కోట్ల విలువ కలిగిన నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఇందులో 99.3 శాతం డబ్బు తిరిగి బ్యాంకులకు చేరింది. అంటే నగదు రూపంలో ఉన్న నల్లధనంలో ఎక్కువ భాగం బ్యాంకింగ్ వ్యవస్థ వెలుపల లేదన్న మాట. అయితే నల్లధనం అంటే కేవలం నగదే కాదు. అది ఆస్తులు, బంగారం, విదేశీ కరెన్సీ రూపంలో కూడా ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వీటిపై ఏ మాత్రం ఉండదు.
తుగ్లక్ నిర్ణయమన్న ప్రతిపక్షం
తొమ్మిది సంవత్సరాల క్రితం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు ప్రక్రియను ‘వినాశకర తుగ్లక్ నిర్ణయం’గా అనేక ప్రతిపక్ష పార్టీలు అభివర్ణించాయి. ఇది భారతీయులకు జరిగిన అతి పెద్ద మోసమని మండిపడ్డాయి. కోట్లాది ప్రజల జీవితాలు అతలాకుతల మయ్యాయని, వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఆరోపించాయి. మోడీ ప్రభుత్వ ‘నోట్‌బందీ’ నిర్ణయంతో భారత ఆర్థిక వ్యవస్థ వెనకపట్టు పట్టిందని, అది నేటికీ కోలుకోలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేష్ విమర్శించారు. ‘వాణిజ్యం, ఎంఎస్‌ఎంఈలు దెబ్బతిన్నాయి. 92 శాతం ఉపాధిని కల్పిస్తున్న అసంఘటిత రంగం నాశనమైపోయింది. నల్లధనం, నకిలీ నోట్లు ఏమీ తగ్గలేదు. నగదు రహిత నినాదానికి అర్థమే లేకుండా పోయింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రెండు వేల రూపాయల నోటును కూడా వెనక్కి తీసుకున్నారు’ అని ఆయన మండిపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ) తదితర పార్టీలు కూడా ప్రభుత్వ వైఫల్యంపై ధ్వజమెత్తాయి.
కొత్త నోట్లతోనే పట్టుబడ్డ ఉగ్రవాదులు
పెద్ద నోట్ల రద్దుతో ఉగ్రవాదులకు నిధుల కొరత ఏర్పడుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ జరిగింది వేరు. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత పట్టుబడిన ఉగ్రవాదుల వద్ద కొత్త కరెన్సీ నోట్లు లభించాయి. అంటే ఉగ్రవాద నిధులపై ప్రభుత్వ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపలేదని అర్థమవుతోంది.
బయటపడింది ఐదు శాతం సొమ్మే
అధికారంలో ఉన్న పార్టీకి లేదా ఏదైనా ప్రధాన రాజకీయ పార్టీకి వ్యాపార వర్గాల మద్దతు అవసరం. కాబట్టి ఆ వ్యాపారంలో నైతికత ఉంటుందని ఊహించడం ఆత్మహత్యా సదృశమే అవుతుంది. ఏదేమైనా పెద్ద నోట్ల రద్దుతో సాధించింది ఏమన్నా ఉన్నదా అంటే లేదనే సమాధానమే వస్తుంది. కనీసం మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయల నల్లధనం బయటికి వస్తుందని మోడీ ప్రభుత్వం భావించింది. రద్దయిన సొమ్ములో 99 శాతానికి తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలో చేరిందని ఆర్‌బీఐ చెప్పింది. కానీ ఆర్థికవేత్తలు చెబుతున్న లెక్కలు వేరేలా ఉన్నాయి. కేవలం ఐదు శాతం నల్లధనం మాత్రమే నగదు రూపంలో ఉంటుందని, మిగిలినది రియల్ ఎస్టేట్, బంగారం వంటి ఇతర ఆస్తుల రూపంలో ఉంటుందని వారు స్పష్టం చేశారు. మరి అలాంటి చీకటి సొమ్ము ఎలా బయటపడుతుంది?



