నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును సీఎం రేవంత్ ఆదేశించారు.
ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందెశ్రీ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ దవాఖానకు తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉదయం 7.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
64 ఏండ్ల అందెశ్రీ 1961, జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా రేబర్తిలో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. మాయమైపోతున్నడమ్మా గీతంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రగీతంగా గుర్తించింది.



