నవతెలంగాణ-హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరామని ఎమ్మెల్యే హరీస్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేయడంపై హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో సీఈవో సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ..ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. వీటన్నింటికీ సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధారాలను ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించామని తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలను ఈసీకి అందజేసి.. ఆయా బూత్‌ల్లో కేంద్ర బలగాలను పెట్టాలని కోరామన్నారు. ముఖ్యంగా మహిళా పోలీసు అధికారులు, ఆశ, అంగన్‌వాడీ వర్కర్లను నియమించి, లోపలికి వెళ్లే ఓటర్ల ఐడెంటిటీని గుర్తించాలని.. ఆ తర్వాతే వారిని పోలింగ్ బూత్‌లోకి అనుమతించాలని కోరామని తెలిపారు. ఓటర్ ఐడీ గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ బూత్‌లకు పంపించకూడదని సూచించారు.
మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఈసీని కోరామని హరీశ్‌రావు తెలిపారు. చాలావరకు ఫేక్ ఓటర్ ఐడీలను తయారుచేశారని.. దానికి సంబంధించిన వీడియోను ఎన్నికల ప్రధాన అధికారికి సమర్పించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, ఫేఖ్ ఐడీ కార్డుల వివరాలను ఎలక్షన్ అబ్జర్వర్లకు కూడా అందజేశామని పేర్కొన్నారు. తొత్తులుగా మారిన అధికారులపై తప్పకుండా చర్యలు చేపడతామని సీఈవో హామీ ఇచ్చారని తెలిపారు.




