Monday, November 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇసుక ట్రాక్టర్ బోల్తా..

ఇసుక ట్రాక్టర్ బోల్తా..

- Advertisement -

– డ్రైవర్ తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన సోమవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని హసకోత్తూర్ గ్రామ వీఆర్ఏ తమ విధి నిర్వాహణలో భాగంగా గ్రామ బస్టాండ్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా.. భీంగల్ వైపు నుండి కమ్మర్ పల్లి దిశగా వెళ్తున్న ట్రాక్టర్ ను గమనించాడు. బ్లూ రంగు తాటిపత్రి కప్పుతో వాహనం పట్ల అనుమానం రావడంతో వెంటనే వెంబడించి హసకోత్తూర్ గ్రామంలోని గురడికాపు స్మశాన వాటిక వద్ద ఆ ట్రాక్టర్‌ను ఆపి డ్రైవర్‌ను ప్రశ్నించాడు. విచారణలో డ్రైవర్ తన పేరు పల్లపు సాయికుమార్, వేల్పూర్ మండలం అక్లూరు గ్రామమని తెలిపాడు. భీంగల్ కు చెందిన  ట్రాక్టర్ యజమాని వేముల భాస్కర్ ఆదేశాల మేరకు భీంగల్ మండలం కుప్కాల్ గ్రామంలోని ఒర్రె నుండి ఇసుకను నింపుకొని కమ్మర్ పల్లి మాధవ్ మేస్త్రికి అమ్మడానికి తీసుకువస్తున్నానని వివరించాడు.

ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు తేలడంతో వెంటనే వీఆర్ఏ ఈ విషయాన్ని మండల రెవెన్యూ అధికారి శరత్ కు ఫోన్ లో సమాచారం అందించాడు. ఆయన ఆదేశాల మేరకు ట్రాక్టర్‌ను కమ్మర్ పల్లి  పోలీస్ స్టేషన్ కు అప్పగించేందుకు ప్రయత్నిస్తుండగా.. డ్రైవర్ సాయికుమార్ ట్రాక్టర్‌ను తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. మార్గమధ్యంలో కమ్మర్ పల్లి బైపాస్ వద్ద ఉన్న బీడీ కంపెనీ దగ్గర వాహనాన్ని అతి వేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనలో డ్రైవర్ సాయికుమార్, ట్రాక్టర్ యజమాని భాస్కర్ ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే ప్రయత్నం చేసినందుకు, సంబంధితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -