Tuesday, November 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివిభజన విద్వేషాలకు విరుగుడు

విభజన విద్వేషాలకు విరుగుడు

- Advertisement -

సమాధిలోని లార్డ్‌కర్జన్‌ ముసిముసిగా నవ్వుకుంటూ వుంటాడు. బారక్‌ లోయలో, ఇటీవలనే శ్రీభూమిగా పేరు మార్చిన కరీంగంజ్‌ జిల్లాలో స్థానిక కాంగ్రెస్‌ నాయకులొకరు రవీంద్రనాథ్‌ టాగూర్‌ గీతం (‘అమర్‌ సోనార్‌ బంగ్లా, అమీ తోమై వలోబాషి’ అన్న చిరస్మరణీయ గీతం) పాడారు. ఇంకేముంది హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఆ వెంటనే తీవ్రంగా విరుచుకు పడింది. ప్రతిపక్షంపై దాడి చేయడానికీ వారి విధేయతను ప్రశ్నించడానికీ చిక్కిన గొప్ప అవకాశంగా స్వయంగా ముఖ్యమంత్రి దాన్ని పరిగణించారు. 1971లో జాతీయ విమోచనోద్యమ విజయం, నూతన రిపబ్లిక్‌ స్థాపన తర్వాత బంగ్లాదేశ్‌ దాన్ని తమ జాతీయ గీతంగా స్వీకరించింది. ఆరెస్సెస్‌, బీజేపీ దీనికి దేశాంతర విధేయ తను ఆపాదించేందుకు సిద్ధమైపోయాయి.

తమపై ఉర్దూ రుద్దడానికి వ్యతిరేకంగా తమ భాషా సాంస్కృతిక భావనలు వెల్లడించడానికి తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీ ప్రజానీకం ఈ పాటను పాడారనే సంగతి వారు కావాలనే ఇష్టపూర్వకంగా మర్చిపోయారు. పాకిస్తాన్‌ పాలకులుగా వున్న మత ప్రేరిత జాతీయతా భావనను బలవంతంగా తమపై విధించడాన్ని వ్యతిరేకించే క్రమంలో ఈ పాటనే పాడారు. ఏమైనా వైవిధ్యభరితమైన సంస్కృతికి నిలయ మైన దక్షిణాసియా గడ్డపై జాతీయతకు కేవలం ఏకరూప నిర్వచనం ఇవ్వడం నిలిచేది కాదని సమకాలీన చరిత్ర చెబుతున్నది. విభజన, వేర్పాటు తత్వంతో కూడిన బ్రిటిష్‌ వలసవాద విధానానికి వ్యతిరేకంగా బెంగాలీ ప్రజానీకం పాటించిన సమ్మిళిత దృక్పథానికి ఈ గీతం ఆవిర్భావ వికాసాలే ఒక తార్కాణం. సాంస్కృతిక వైవిధ్యం, వేల మైళ్ల దూరంగల రెండు ప్రాంతాలను కలిపివుంచడానికి మతపరమైన గుర్తింపు గురించిన మురిపెం ఒక్కటే సరిపోదని చెప్పడానికి ఇంతకన్నా బలమైన ఆధారం అక్కర్లేదు.

టాగూర్‌ గీతంపై కత్తి
బ్రిటిష్‌ ప్రభుత్వం బెంగాల్‌ను మొదటిసారి విభజించడానికి నిరసనగా రాయబడిన పాట అది. అవిభక్త బెంగాల్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలనే నిర్ణయం 1905 జులై 19న లార్డ్‌ కర్జన్‌ ప్రకటించారు. అది అక్టోబర్‌ 16న అమలులోకి వచ్చింది. విభజనకు శక్తివంతమైన నిరసనగా కలకత్తాలోని చారిత్రిక టౌన్‌హాల్‌లో 1905 ఆగష్టు 7న జరిగిన నిరసన సభ కోసం టాగూర్‌ ఈ పాట రాశారు. ఇందులోని ప్రతి ఘటన వారసత్వానికి నిజమైన కొనసాగింపుగానే పాటలోని మొదటి పది పంక్తులను బంగ్లాదేశ్‌ జాతీయ గీతంగా తాత్కాలిక ప్రభుత్వం 1971 ఏప్రిల్‌ 10న విమోచన సమరంలో స్వీకరించింది.

ఈ రోజున కర్జన్‌ వారసత్వమే బీజేపీ, ఆరెస్సెస్‌లనూ వారి ప్రచార వేషధారి హిమంతనూ రగిలిస్తున్నది. ఆ పాట పాడటం జాతి వ్యతిరేకమని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. బంగ్లాదేశ్‌ జాతీయ గీతంగా స్వీకరించబడటానికి 66 ఉఏండ్ల కిందట రాసిన పాటను పాడితే అది బారక్‌ లోయ ప్రజలు అన్య దేశ విధేయత చూపడంగా చెప్పేందుకు ప్రయత్నం జరుగుతున్నది. వాస్తవంగా ఈ పాటపై యుద్ధం కేవలం బెంగాల్‌ భాషపై పథకం ప్రకారం జరిగే దాడికి కొనసాగింపు మాత్రమే కాదు. దాన్ని పాడటం అంటే బంగ్లాదేశీ ముద్రవేసి చట్టవిరుద్ధంగా ప్రకటించడం మాత్రమే కాదు. భాషను, చొరబాటును ముడిపెట్టడాన్ని మళ్లీ గట్టిగా ముం దుకు తెచ్చే ఉద్వేగభరిత సూత్రీకరణ ఇది. సరిహద్దుకు ఇరువైపులా ఒకే భాష మాట్లాడవచ్చుననే వాస్తవాన్ని మనమెలా మటుమాయం చేయగలం?

హిమంత నిస్పృహ, గిరిజనుల నిరసన
వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు జరగనున్న అస్సాంలో బీజేపీ హిమంత, పూర్తి నిస్పృహలో వున్నారనడం నిస్సందేహం. స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే భూకబ్జాలకు బలవుతున్న ప్రజలు తొలగింపులనూ బుల్డోజర్లనూ ప్రతిఘటిస్తున్నారు. గిరిజన ప్రాంతాలలో భూ ఆక్రమణ పేరుతో మైనార్టీలపై యుద్ధం సాగించడం ఇంకేమాత్రం సాధ్యపడే పరిస్థితి లేదు. అస్సాంలోని ఆరు గిరిజన వర్గాలు-తారు అహోం, మొరాన్‌, మొటోక్‌, చుటియా, టీ తెగలు లేదా కూచ్‌ రాజ్‌ భంగ్సీ ఆదివాసీలు అత్యధిక స్థాయిలో ప్రతిఘటనకు దిగుతున్నారు. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో వీరంతా కలిస్తే దాదాపు ముప్పై శాతం వున్నారు. బీజేపీ మద్దతుదారులలో ప్రధాన భాగంగా ఉన్న వీరు ప్రస్తుతం గిరిజన హోదా (ఎస్‌టి) కోరుతూ వీధుల్లోకి వచ్చారు.

రాష్ట్రంలో ఇతర వెనకబడిన వర్గాల (ఓబిసి) జాబితాలో చేర్చబడిన వీరంతా ఇప్పుడు షెడ్యూల్డు తెగలుగా గుర్తించాలని కొరుతున్నారు. ఈ జాబితా వల్ల లభించే పరిమిత అవకాశాలకన్నా ఆ విధంగా తమకు విద్యాసంస్థలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎక్కువ అవకాశం లభిస్తుందని వారి అభిప్రాయంగా వుంది. రాష్ట్ర యువతలో విపరీతమైన నిరుద్యోగంతో పాటు ఎలాంటి జాతి మత విభజనలు లేకుండా ఒక్క తాటిపైకి తెస్తున్నది మరొకటి వుంది. అస్సాం ప్రజల ప్రియతమ పుత్రుడైన జుబిన్‌గార్గ్‌ ఎంతో ధైర్యంగా ముందుకు తెచ్చిన నూతన దార్శనికతను వారు ఒక్క గొంతుతో నిర్భ యంగా వినిపిస్తున్నారు. హిమంత అంతగా రెచ్చిపోవడానికి నేపథ్యం అదే.అయితే కేవలం అస్సాంలోనే కాదు. దేశమంతా హిందూత్వ వేర్పాటు రాజకీయాలతో ముందుకొస్తున్న విద్వేషపు గొంతుకలు ఇంకా చాలా వున్నాయి. భాషా సమస్యనే తీసుకుంటే కొంతకాలం కిందట హిందీ రుద్దడానికి వ్యతిరేకంగా మరాఠీ భాష కోసం నిరసన గొంతులు వినిపించాయి.

తేలిపోయిన ‘సర్‌’
చొరబాట్లు, చొరబాటుదారులు అనేవాటికి వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం చేసిన హిందూత్వ అగ్రదళాలు ఎన్నికల కమిషన్‌ను సతాయించి ‘సర్‌’ ప్రక్రియ మొదలెట్టేట్లు చేశాయి. పౌరసత్వ సమస్యను దొడ్డిదోవన తీసుకొచ్చాయి. అయితే వాస్తవంలో అది పూర్తిగా పైపైనే తేలిపోయింది. మొత్తంపైన పరిశీలించిన 7కోట్ల 42 లక్షల మంది ఓటర్లలో కేవలం 9,500 మంది లేదా 0.012 శాతం మాత్రమే విదేశీయు లని తేలింది. శోధించి తొలగించి తరలించు అంటూ అమిత్‌ షా హడలెత్తించినా దానికి ఏమాత్రం ప్రాతిపదిక లేదని నిరూపితమైంది. అయితే నిజం ఎందుకు వంటపడుతుంది? మనం సత్యానంతర ప్రపంచంలో వున్నాం కదా! ఇదేమో ఎన్నికల సీజనాయె. బీజేపీ దగ్గరున్న కోట్లతో ఫేక్‌ వార్తల యంత్రాలు అహోరాత్రులు పనిచేసి మరిన్ని కట్టుకథలు, వక్రీకరణలు వదులుతాయి. వారు పరాయి వారంటూ విద్వేషం వండి వార్చుతాయి. జీవితాన్నీ అలాగే అసలు ఉనికికి మూలమైన జీవనోపాధినీ చుట్టుముడుతున్న ఈ నిత్యసంక్షోభాన్ని, ముక్త కంఠంతో ఎదుర్కోవాలంటే మనం ఒక్కతాటిపై నిలవడం, ఒక్క గొంతు వినిపించడం అత్యవసరం.
(నవంబర్‌ 5 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -