Tuesday, November 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికుక్కకాటుకు సుప్రీం దెబ్బ

కుక్కకాటుకు సుప్రీం దెబ్బ

- Advertisement -

కుక్కలంటేనే విశ్వాసానికి ప్రతిరూపమని అంటాం. అవి ఇంటిని, మనల్ని ఆపద సమయాల్లో రక్షిస్తాయని భావిస్తాం. కానీ ఆ కుక్కలే మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి. రక్తం రుచి మరిగినట్టుగా మనుషులపై దాడిచేసి కరుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వీధి కుక్కలు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. చిన్నపిల్లలపై అవి క్రూరంగా దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. మొన్న జులైలో మెదక్‌ జిల్లా శివ్వం పేట మండలంలో మూడేండ్ల బాలుణ్ణి రాకాసి శునకాలు మూకుమ్మడిగా చుట్టుముట్టి చంపేశాయి. అదే జిల్లాలోని తూప్రాన్‌లో ఒకేరోజు పాతికమంది గ్రామసింహాల భారిన పడ్డారు. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రమన్న తేడాలేదు. దేశమంతా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయ స్థానం జనసమ్మర్ధ ప్రాంతాల్లో అస్సలు వీధికుక్కలు కనబడకూడదంటూ తీర్పు నిచ్చి సంచలనం సృష్టించింది.’జనం తిరిగే ప్రాంతాల్లో వీధికుక్కలు ఉండకూడదు.. తక్షణమే వాటిని రక్షణ కేంద్రాలకు తరలించి సంతాన నియంత్రణ చికిత్సలు చేయాలని’ కీలక ఆదేశాలు జారీచేసింది.

కుక్కల బెడదపై సుప్రీంకోర్టు అధ్యయనం చేసినట్టుగా ఇంకెవరూ చేసి ఉండరేమోనని అన్పిస్తుంది. తాజాగా వీధికుక్కల మీద ఒక ఉద్యమమే నడిపింది. ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణాల్లో వీటి జాడే ఉండరాదని, రెండేరెండు వారాల్లో ఆయా ప్రాంతాల్లో కంచెలు వేయాలని కూడా ఆదేశించింది. అక్కడ కన్పించిన కుక్కలను తక్షణమే స్టెరిలైజ్‌ చేసి షెల్టర్లకు తరలించాలని, దీని అమలుపై మూడువారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. గత మూడు నెలలుగా సర్వోన్నత న్యాయస్థానం దేశంలో కుక్కలబెడదపై విచారణ చేస్తూనే ఉంది. పౌరుల భద్రత, చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యానికి గురైన వారి రక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్న దృక్పథంతో కోర్టు ఈ రకమైన తీర్పునివ్వాల్సి వచ్చింది. సుప్రీం బాధలో ఎంత ‘బాధ్యత’ ఉందో వేరే చెప్పక్కర్లేదు.

దేశ జనాభా 146 కోట్లు ఉండగా, వీధి కుక్కలు 1.53 కోట్లు ఉన్నట్లు ఒక అంచనా. దేశవ్యాప్తంగా రోజుకు పది వేల కుక్కకాట్లు ఉంటున్నాయంటే కుక్కల స్వైరవిహారం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 2024లో 37.15 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. 2022-24 మధ్యకాలంలో అత్యధికంగా కుక్కకాటు కేసులు నమోదైన టాప్‌-10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర (13.5 లక్షలు) మొదటిస్థానంలో ఉండగా, తెలంగాణ (3.33 లక్షలు) 8వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర రేబిస్‌ మరణాల్లో (35) అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జులై వరకు 87,366 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. కానీ, నిన్నటికి నిన్న (ఆదివారం) రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డున 22 మందిని కుక్కలు దారుణంగా కరిచాయి… బాలానగర్‌లో గాయపడిన వారిని ‘ఫీవర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లండి… ఇక్కడ రేబిస్‌ టీకాలు అందుబాటులో లేవని’ చెప్పడం… మరోచోట వెటర్నరీ వైద్యులు ‘జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల విధుల్లో ఉన్నారని’ చెప్పడం ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ ఉదాసీనతను తెలియజేస్తుంది.

వీధికుక్కల గుంపుల స్వైరవిహారంతో బయటికి రావాలంటేనే జనం భీతిల్లుతున్నారు. నానా రకాల చెత్త, ఆహార వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వీధికుక్కల సంతతిని ఇబ్బడిముబ్బడి చేస్తుందని ప్రజలూ సైతం గుర్తించాలి. భీకరంగా అరుస్తూ వాహనదారులను వెం బడిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2030కల్లా దేశంలోంచి రేబిస్‌ వ్యాధిని తరిమికొట్టాలన్నది కేంద్రం లక్ష్యమని చెబుతున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాటలకు… చేతలకు పొంతన లేదనడానికి పైన చెప్పిన గణాంకాలకు మించిన ఉదాహరణలు అవసరంలేదు. నిజంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే శునకాల సంతాన నియంత్రణకు ప్రభుత్వాలు తగినంతగా నిధులు కేటా యించాలి.

ప్రభుత్వాసుపత్రుల్లో రేబిస్‌ టీకాలను విరివిగా అందుబాటులో ఉంచాలి. కుక్కకాటు ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే సుప్రీంకోర్టు అంత తీవ్రంగా తీర్పునిచ్చింది. కుక్కలను పట్టుకొని సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్స చేసిన తిరిగి అదే ప్రదేశంలో వదిలి పెట్టడం కుక్కల సిబ్బంది ఆనవాయితీ. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ అలా చేయవద్దని సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేయడం గమనార్హం. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలపై పశువుల విచ్ఛలవిడి సంచారంపైనా ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేయడం మరో విశేషం. అలాంటి పశువులను గోశాలకు తరలించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల శాఖ, స్థానిక సంస్థలు, హైవే గస్తీ బృందాలు పకడ్బందీగా ఈ ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -