తిను పదార్థాల ఎంపికలపై ప్రభావం
ఫుడ్ యాడ్స్ పట్ల ఆకర్షితులవుతున్న చిన్నారులు
జంక్‌ఫుడ్‌తో పోషకాహారానికి దూరం
పిల్లలు, యువత ఎదుగుదలపై ఎఫెక్ట్
అలాంటి మార్కెటింగ్‌పై కఠిన చర్యలు
అవసరం : వైద్య నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : ఎదిగే పిల్లలు, యువత వారు తీసుకునే ఆహారంపై ఎంతో జాగ్రత్త వహించాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ.. మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు ఆందోళనను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా టీవీలు, సామాజిక మాధ్యమాలు, థియేటర్లు, పేపర్లలో వచ్చే ఫుడ్ యాడ్స్.. పిల్లలు, యువతలో తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది వారి ఆహారపు అలవాట్లను క్రమంగా మార్చేస్తున్నది. ప్రకటనల్లో చూసిన వాటి పట్ల, ముఖ్యంగా జంక్‌ఫుడ్ వంటి అస్వస్థకర ఆహార పదార్థాలకు వారు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతున్నది. చిన్న వయసులోనే ఊబకాయం, గుండెజబ్బుతో పాటు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాజా అధ్యయనమొకటి ఇదే విషయాన్ని తెలిపింది.
ఇలాంటి ప్రకటనలను చూసినప్పుడు వారు అస్వస్థకరమైన ఆహారాలను ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనాన్ని కెనడా, ఆస్ట్రేలియా, చిలీ, మెక్సికో, యూకే, అమెరికా వంటి ఆరు దేశాల్లో నిర్వహించారు. ఫాస్ట్‌ఫుడ్, తీపి పానియాలు, చిప్స్, బిస్కెట్స్, ఐస్‌క్రీమ్ వంటి ఆహార ప్రకటనలు చూసిన పిల్లలు అదే ఆహార పదార్థాలను తీసుకుంటున్నారని ఈ అధ్యయనం గుర్తించింది. అంటే పిల్లలు తాము చూసే ఆహార సంబంధ ప్రకటనలకు ఆకర్షితులై, ఆ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టాన్ని చూపుతున్నారు. ఈ అధ్యయనాన్ని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బిహేవియరల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ’ అనే అంతర్జాతీయ పత్రికలో ప్రచురించారు. పిల్లలు, యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆహార ప్రకటనలపై కఠిన, చట్టపరమైన ఆంక్షలు విధించాలని ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల ప్రభుత్వాలను కోరింది.
పిల్లల్లో ఊబకాయం సమస్య : వైద్య నిపుణులు
ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ యాడ్స్ పిల్లలు, యువతపై చూపుతున్న ప్రభావంపై వైద్య నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అధ్యయన ఫలితాలు మార్కెటింగ్ ఎలా నేరుగా అస్వస్థకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహిస్తుందో స్పష్టంగా చూపిస్తున్నాయని పిల్లల వైద్య నిపుణులు, న్యూట్రిషన్ అడ్వకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ (న్యాపీ) వేదిక కన్వినర్ డాక్టర్ అరుణ్ గుప్తా చెప్పారు. ”మార్కెటింగ్ అనేది ఒక చిన్న విషయం కాదు. ఇది అస్వస్థకరమైన, హాని కలిగించే ఆహార వినియోగానికి ప్రధాన కారణం. అధికంగా ప్రాసెస్ చేసిన, కొవ్వు, ఉప్పు, చక్కెరలు ఎక్కువగా ఉన్న (హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్) ఆహార పదార్థాలను బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇవి పిల్లల ఆహారపు అలవాట్లను ప్రభావితం చేసి, వారిలో ఊబకాయానికి కారణమవుతున్నాయి” అని ఆయన హెచ్చరించారు.
అలాంటి మార్కెటింగ్‌పై కఠిన చర్యలు అవసరం
భారత్ ‘నేషనల్ మల్లీ-సెక్టోరల్ యాక్షన్ ప్లాన్ (ఎన్‌ఎంఏపీ) 2017-2025లో ఊబకాయం సమస్యను గుర్తించారు. అయినప్పటికీ ఫుడ్ మార్కెటింగ్‌పై కఠినమైన ఆంక్షలు, నియంత్రణ ఇంకా అమలులో లేవని డాక్టర్ అరుణ్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు, యువతను కాపాడటం మన బాధ్యత కాబట్టి భారత్‌లో చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని పలువురు వైద్య, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి ఫుడ్ యాడ్స్ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.
అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్న కంపెనీలు
ఇక పిల్లలు, యువత సహజంగానే కార్టూన్లు, సినిమా హీరోలు, క్రీడాకారులను అభిమానిస్తుంటారు. అయితే వారి అభిమానాన్ని ఆహార కంపెనీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. సినీతారలు, కార్టూన్ లేదా సినిమా పాత్రలు, క్రీడా ప్రముఖులను తమ అంబాసిడర్లుగా లేదా తమ ఉత్పత్తిని ప్రమోట్ చేసేలా వారితో యాడ్స్ చేయిస్తున్నారు. ఇది కూడా పిల్లలు ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంలో కీలకంగా మారిందని అధ్యయనం తెలిపింది. ఆహార, పానీయాల ప్రకటనలను తరచుగా చూసే యువతలో ఆహార అభిరుచులు, వారి కొనుగోలు నిర్ణయాలు, ఎంపికలు గణనీయంగా ప్రభావితమవతున్నాయి. పిల్లలను లక్ష్యంగా చేసుకున్న ఆహార ఉత్పత్తుల్లో ఎక్కువశాతం పోషకాలు తక్కువగా ఉండి, చెడు కొవ్వును పెంచేవి ఎక్కువగా ఉంటున్నాయని అధ్యయనం హెచ్చరించింది. ఇక వారిలో మెదడు అభివృద్ధి పరిమితంగా ఉండటం కూడా దీనికి కారణమవుతున్నది. దీంతో వారు పోషకాహారం లేని పదార్థాలను తీసుకొని ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొంటున్నారు.



