నేడే రెండోదశ పోలింగ్
122 నియోజకవర్గాల్లో ఓటింగ్‌కు సర్వం సిద్ధం
1302 మంది అభ్యర్థులు…3.7 కోట్ల మంది ఓటర్లు
విధుల్లో 4 లక్షల మంది : ఎన్నికల సంఘం
రాంచీ : బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల సంగ్రామం తుది దశకు చేరుకుంది. నేడు (మంగళవారం) 20 జిల్లాల్లోని 122 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. 3 కోట్లా 70 లక్షల మంది ఓటర్ల కోసం ఈసీ 45,399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో 40,073 పోలింగ్ బూత్‌లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎన్నికల విధుల్లో 4లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించిం ది. మొత్తం 1,302 మంది అభ్యర్థుల భవిత వ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగానూ మెజారిటీ స్థానాల్లో జరుగుతున్న రెండో విడత పోల్‌పైనే అందరి దృష్టి నెలకొని ఉంది.
బరిలో 1,165 మంది పురుషులు, 136 మంది మహిళలు
రెండో విడత పోలింగ్ జరగనున్న 122 అసెంబ్లీ స్థానాల్లో 101 జనరల్ సీట్లు, 19 ఎస్‌సీ రిజర్వుడ్ సీట్లు, 2 ఎస్‌టీ రిజర్వుడ్ సీట్లు ఉన్నాయి. ఈ స్థానాల్లో మొత్తం 1,761 నామినేషన్లు దాఖలవగా 1,372 నామినేషన్లే చెల్లుబాటయ్యాయి. వీరిలో 70 మంది అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా చేసుకు న్నారు. దీంతో ఎన్నికల బరిలో 1,302 మంది మిగిలారు. వీరిలో 1,165 మంది పురుషులు, 136 మంది మహిళలు, ఒకరు థర్డ్ జెండర్ అభ్యర్థి. మొత్తం అభ్యర్థుల్లో దాదాపు 10 శాతం మంది మహిళలు ఉన్నారు. వనితలకు ఆర్‌జేడీ 13, జన్ సురాజ్ 12, బీజేపీ 10, జేడీయూ 9, కాంగ్రెస్ 2 టికెట్లు ఇచ్చాయి.
ఏ పార్టీ నుంచి ఎంతమంది అభ్యర్థులు ?
బీజేపీ : 53, జేడీయూ : 44, ఆర్‌జేడీ : 71, కాంగ్రెస్ : 37, జన్ సురాజ్ : 120, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ): 7, సీపీఐ (ఎంఎల్-ఎల్): 6, సీపీఐ(ఎం) 4, ఎల్‌జేపీ (రామ్ విలాస్): 15, స్వతంత్రులు: 462, ఇతరులు : 487, స్వతంత్రులు, చిన్న పార్టీల అభ్యర్థులే ఎక్కువ తుది విడత పోలింగ్ జరిగే 122 అసెంబ్లీ స్థానాల్లో 462 మంది స్వతంత్ర అభ్యర్థులు, 487 మంది ఇతరులు (చిన్న పార్టీలు) పోటీ చేస్తున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీహార్‌లోని ప్రధానమైన రాజకీయ పార్టీలు బీజేపీ, జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్, జన్ సురాజ్, వీఐపీ, సీపీఐ (ఎంఎల్-ఎల్), ఎల్‌జేపీ (రామ్ విలాస్) మాత్రమే. కానీ ఆసక్తికరంగా రెండోవిడత పోలింగ్ బరిలో ఏకంగా 109 రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన నేతల్లో కొందరు చిన్న పార్టీల తరఫున ఎన్నికల బరిలోకి దూకారు. ఆ అవకాశం కూడా దొరకని వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అందుకే ఈ రెండు కేటగిరీలకు చెందిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది.
బీహార్‌లో ‘ఓట్ల చోరీ’ జరగనివ్వం.. అమిత్ షాతో ఈసీ కుమ్మక్కైతే తీవ్ర పరిణామాలు సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్
ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాగట్‌బంధన్ బీహార్‌లో ‘ఓట్ల చోరీ, వంచన’ను సహించదని ఆర్‌జేడీ నేత, మహాగట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన బీహార్‌లో మొదటి దశ పోలింగ్ జరిగి నాలుగురోజులైనా ‘జెండర్ వైజ్ (స్త్రీ, పురుషులు, థర్డ్ జెండర్ ఓటర్ల) డేటా’ను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్ షా నాయకత్వంలో ఈసీ సరిగ్గా పని చేయడం లేదని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. అమిత్ షాతో ఈసీ కుమ్మక్కై సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తే, అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు.
”బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి మొత్తం 208 కంపెనీల భద్రతా సిబ్బందిని బీహార్ ఎన్నికల విధుల కోసం మోహరించారు. మేం వారిపై నిఘా ఉంచుతున్నాం. కేంద్ర హౌంమంత్రి అమిత్ షాతో సహా బయటి వ్యక్తులు బీహార్‌ను నియంత్రించాలని అనుకుంటున్నారు. దీనిని బీహార్ ప్రజలు అనుమతించరు” అని తేజస్వీ యాదవ్ అన్నారు. ప్రధాని మోడీపై కూడా తేజస్వీ విమర్శలు గుప్పించారు. ”మోడీ తన ఎన్నికల ప్రచార సమయంలో బీహార్‌లోని నిరుద్యోగం, వలసలు వంటి సమస్యలపై మాట్లాడలేదు. కేవలం కుటిల రాజకీయాలు మాత్రమే చేశారు” అని అన్నారు. బీహార్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని తేజస్వీ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ”నవంబర్ 18న ప్రమాణ స్వీకారం చేస్తామని అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని, మహాగట్‌బంధన్ బీహార్ ఎన్నికల్లో గెలిస్తే నేరస్థులు, మతతత్వ శక్తులు, అవినీతి పరులపై చర్యలు తీసుకుంటాం” అ ఆయన పేర్కొన్నారు.



