మద్యం, డబ్బులు, చీరలు, మిక్సీ గ్రైండర్ల పంపిణీ
కాంగ్రెస్‌పై సీఈవో సుదర్శన్‌రెడ్డికి హరీశ్‌రావు ఫిర్యాదు
ఆధారాలతో కూడిన వీడియోలు, ఫొటోల సమర్పణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఇష్టారాజ్యంగా మద్యం, విచ్చలవిడిగా డబ్బులు, లక్షకుపైగా చీరలు, మిక్సీ గ్రైండర్లను పంపిణీ చేస్తున్నదని వివరించారు. అధికార పార్టీకి కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని వీడియో, ఫొటో ఆధారాలను ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డిని సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ భవన్‌లో హరీశ్‌రావు నేతృత్వంలో కలిసి సమర్పించారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేస్తున్నామనీ, పోలీసు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు తెలివైన వారనీ, తగిన రీతిలో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తారని అన్నారు.
అధికార దుర్వినియోగం జరుగుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. సున్నిత, సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల్లో కేంద్ర బలగాలను పెట్టాలని కోరారు. మహిళా పోలీస్ అధికారులను, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లను అక్కడ నియమించి లోపలికి వెళ్లే ఓటర్లను గుర్తించిన తర్వాతనే పోలింగ్ బూత్‌లలోకి అనుమతించాలని సూచించారు. ఓటర్ గుర్తింపు కార్డు లేకుండా ఓటర్లను పోలింగ్ బూత్‌లలోకి పంపించొద్దని అన్నారు. నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులను తయారు చేశారని చెప్పారు. యూసుఫ్‌గూడాలో కాంగ్రెస్ కార్యాలయానికి ఆనుకొని పోలింగ్ బూత్‌ను ఎలా పెడతారని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామంటూ సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, వి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



