Tuesday, November 11, 2025
E-PAPER
Homeజాతీయంహైవేల నిర్వహణ ఇలాగేనా?

హైవేల నిర్వహణ ఇలాగేనా?

- Advertisement -

ప్రాణాలు హరించేలా రోడ్లు ఎందుకుంటున్నాయి : ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్రం వివరణ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : హైవేలపై జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిపై, ఆ ప్రమాదాలపై సుప్రీం కోర్టు సోమవారం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వెంట వెంటనే రెండు ప్రమాదాలు చోటు చేసుకోవడం, చాలామంది చిన్నారులతో సహా 40మంది వరకు మరణించడం దిగ్బ్రాంతికరమని, ఇలాంటివి భరించడం చాలా కష్టమని వ్యాఖ్యానించింది. భారతదేశంలో రహదారులు అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకోవడంపై వివరణ ఇవ్వాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ”నిజంగా ఇది చాలా దారుణం, కేవలం రెండు రోజుల్లో రెండు భయంకరమైన ప్రమాదాలు, దాదాపు 40మంది మరణించారు.వీరిలో పిల్లలే ఎక్కువమంది.” అని జస్టిస్‌ జె.కె.మహేశ్వరి వ్యాఖ్యానించారు. ఆమెతో పాటు బెంచ్‌లో జస్టిస్‌ విజరు బిష్ణోరు వున్నారు.

రాజస్తాన్‌లోని ఫలోదిలో ఈ నెల 2న జరిగిన హైవే ప్రమాదంలో 15మంది మరణించారు. భారత్‌మాలా హైవేపై ఒక హోటల్‌ ఎదురుగా పార్క్‌ చేసిన ట్రక్కుపైకి టెంపో దూసుకువెళ్లిపోయింది. ఈ ప్రమాదాన్ని తనకు తానుగా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ మరుసటి రోజునే హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై లారీ, బస్సు ఢ కొనడంతో మూడు మాసాల పసిపాపతో సహా 19మంది మరణించారు. 163వ నెంబరు హైవేపై గల గుంటలో బస్సు పడకుండా తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈరెండు ప్రమాదాలు జరగడం వెనుక గల కారణాలను మీడియా వార్తలు స్పష్టంగానే ఇచ్చాయని జస్టిస్‌ మహేశ్వరి తెలిపారు. క్రమం తప్పకుండా టోల్‌ ఫీజులు చెల్లిస్తూనే వున్నా హైవేల పరిస్థితి అస్సలేమాత్రం బాగోలేదని తెలుస్తోందన్నారు. పైగా సేద తీరేందుకు నిర్దేశించిన ప్రాంతాలు కాదని స్పష్టంగా పేర్కొన్నా కూడా హైవేల పొడవునా అక్రమంగా కాఫీ, టీలతో పాటూ తినే హోటళ్ళు కూడా పెరిగిపోతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.

ఫలితంగా, రోడ్లపై తిరిగే వాహనాలు, హైవేల పక్కన నిలిపివుంచిన ట్రక్కులు లేదా ఇతర వాహనాలను గుర్తించలేకపోతున్నాయని జస్టిస్‌ మహేశ్వరి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న ఆ రెండు హైవేల పరిస్థితిపై నివేదికను అందచేయాల్సిందిగా రహదారుల మంత్రిత్వ శాఖకు, ఎన్‌హెచ్‌ఎఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఆ రెండు హైవేల పొడవునా నోటిఫై చేయని ప్రాంతాలను ఆక్రమించి అక్రమంగా ఏర్పాటు చేసిన డాబాలు లేదా ఈటరీల సంఖ్య, వివరాలు అందచేయాల్సిందిగా ప్రభుత్వ మంత్రిత్వ శఖలు, ఎన్‌హెచ్‌ఎఐని ఆదేశించింది. ఈ రెండు హైవేలు ప్రయాణిస్తున్న రాష్ట్రాల చీఫ్‌ సెక్రెటరీలకు కూడా నోటీసులు జారీ చేయాలని కోర్టు పేర్కొంది. కాగా, అమికస్‌ క్యూరీగా నియమితులైన సీనియర్‌ న్యాయవాది నాద్‌కర్ణి మాట్లాడుతూ, ఈ సుమోటో కేసు పరిధిని దేశవ్యాప్త పరిధికి విస్తరించాలని కోరారు. మొదట ఈ కేసులో ఏం జరిగిందో ముందుగా మనం చూద్దామని జస్టిస్‌ మహేశ్వరి స్పందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -