Tuesday, November 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభవన నిర్మాణ కార్మికులను విస్మరిస్తే సంఘటిత ఉద్యమం

భవన నిర్మాణ కార్మికులను విస్మరిస్తే సంఘటిత ఉద్యమం

- Advertisement -

డిసెంబర్‌ 5న చలో హైదరాబాద్‌
కార్యాచరణ ప్రకటించిన జేఏసీ
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. వారి సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులను అధికారుల వాటాల కోసం దారిమళ్లిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా కార్మికుల బతుకులు మారటం లేదు. మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ అమలులో భాగంగానే కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలు ఇస్తున్నది. కార్మికుల సంక్షేమం కోసమే మేమున్నామంటూ శ్రీరంగ నీతులు చెబుతూ వారి సంక్షేమాన్ని విస్మరిస్తుంది. దీన్ని కార్మిక వర్గం సంఘటితంగా తిప్పి కొట్టాల్సిందే. అందుకు క్షేత్ర స్థాయి నుంచి సన్నద్ధం కావాలి’. అని ఈ నెల 13న జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి 17న కార్మిక శాఖ మంత్రి జి వివేక్‌ వెంకటస్వామికి వినతి పత్రం అందజేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. 25న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలుంటాయని తెలిపారు.

అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్‌ 5న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వంగూరి రాములు(సీఐటీయూ), పల్లా దేవేందర్‌రెడ్డి(ఏఐటీయూసీ), సాంబశివ(టీయూసీఐ), జి అనురాధ(ఐఎఫ్‌టీయూ), చంద్రమౌళి (స్ఫూర్తి కార్మిక సంఘం), విజరు(ఐఎఫ్‌టీయూ) అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఒంగూరి రాములు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు సంఘటిత పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సంక్షేమ బోర్డు ఎవరి దయాదాక్షిణ్యాలతో ఏర్పడలేదనీ, పోరాటాల ఫలితంగా అది ఏర్పడిందని తెలిపారు.

దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా కార్మికులపైనే ఉందని స్పష్టం చేశారు. సంక్షేమ బోర్డులో తానా అంటే తందాన అనే సంఘాలను సలహామండలిలో పెట్టుకుని కార్మికుల సంక్షేమానికి తిలోదకాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఆదేశాలకనుగుణంగానే కార్మికుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. నాలుగు లేబర్‌ కోడ్స్‌ కార్మికులకు మరణశాసనం కాబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ సర్కారు తీసుకొస్తున్న కొత్త కేంద్ర కార్మిక విధానం శ్రమశక్తి నీతి 2025తో మొత్తం కార్మిక వర్గానికి ప్రమాద ఘంటికలు మోగనున్నాయని హెచ్చరించారు. ఈ విధానం కార్మికులకు అత్యంత ప్రమాదంగా, అప్రజాస్వామికంగా ఉన్నదని చెప్పారు. దీన్ని మనుస్మృతి ప్రేరణతో తీసుకొస్తున్నామంటూ చెబుతున్న కేంద్రం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నాయని విమర్శించారు. కేంద్రం తీసుకొస్తున్న ఆ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం జీ హుజూర్‌ అంటూ అమలు చేస్తే కార్మిక వర్గం సంఘటిత శక్తితో సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ వామపక్షాల ఒత్తిడితో 1996లో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం వచ్చిందని గుర్తు చేశారు. దాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు జరగుతున్నాయని తెలిపారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు కార్మికుల కడుపులు కొట్టి కార్పొరేట్లకు పెడుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.టీయూసీఐ అధ్యక్షులు సూర్యం, నాయకులు ఎం హన్మేష్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌, బీఎన్‌ఆర్‌కేఎస్‌ బాధ్యులు ఐలన్న, స్ఫూర్తి కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమార్‌,హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర బాధ్యులు పరమాత్మాచారి, బీఆర్‌టీయూ బాధ్యులు గణేష్‌ మాట్లాడుతూ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా అమలు చేస్తున్న 12 రకాల సంక్షేమ పథకాల్లో నాలుగు మాత్రమే ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఇచ్చి, ప్రసూతి, వివాహ కానుక, ఆస్పత్రి, దహన సంస్కారాల ఖర్చులు వంటి సంక్షేమ పథకాలు కార్మికులకు అందకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -