Tuesday, November 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవేధింపులు ఆపాలని విధులు బహిష్కరించిన ఐఐటీ కార్మికులు

వేధింపులు ఆపాలని విధులు బహిష్కరించిన ఐఐటీ కార్మికులు

- Advertisement -

ఐఐటీ హైదరాబాద్‌ గేటు ఎదుట కాంట్రాక్ట్‌ కార్మికుల ధర్నా
ప్రతినెలా రెండవ తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్‌

నవతెలంగాణ-కంది
ఐఐటీ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని, భూములు కోల్పోయిన ఐఐటీ కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని కాంట్రాక్ట్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఐఐటీలో పనిచేస్తున్న దాదాపు 500 మంది కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించి క్యాంపస్‌ ప్రధాన గేటు ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. ఐఐటీ కార్మికులపై వేధింపులు ఆపాలని, భూములు కోల్పోయిన కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని కోరారు. అనంతరం సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య ఆధ్వర్యంలో కార్మికులు ఐఐటీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కాంట్రాక్టర్‌, ఐఐటీ అధికారులు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కాంట్రాక్ట్‌ కార్మికులు మాట్లాడుతూ.. తమ భూములు కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఐఐటీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నామని అన్నారు. కానీ అధికారులు, కాంట్రాక్టర్‌ సూపర్‌వైజర్లు మాత్రం.. ముగ్గురు చేసే పనిని ఒకే కార్మికునిపై వేసి పనిభారం మోపుతున్నారని తెలిపారు. కార్మికులు ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తే వారిని తొలగించడం, వారి ఫోటోలను బయట అతికిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. స్థానిక డీసీఎల్‌ అధికారులు ఐఐటీ అధికారులతో కుమ్మక్కై కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమను రెగ్యులర్‌ చేసి, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ను అమలు చేయాలన్నారు. కార్మికులందరికీ క్యాంటీన్‌ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేల చెల్లించాలన్నారు. కొంతమంది భూములు కోల్పోయినప్పటికీ ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు.

కార్మికులు సంఘటితం కావడం కోసం సంఘం స్థాపించుకోవాలనుకుంటే కార్మిక శాఖ అధికారులు కుమ్మక్కై సంఘం పెట్టుకోకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించకుండా డబ్బులు తీసుకుని ఇతరులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని అన్నారు. కార్మికులందరికీ ఐఐటీలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స సదుపాయాన్ని కల్పించాలని, హెల్త్‌ కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రమాద బీమా సౌకర్యం రూ.10 లక్షలు కల్పించాలన్నారు. ప్రతి నెలా రెండో తేదీన వేతనాలు చెల్లించాలన్నారు. వెంటనే ఐఐటీ అధికారులు, కాంట్రాక్టు సూపర్‌ వైజర్లు తమ సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పల్పనూరు శేఖర్‌, కుమ్మరి గోపి, కాజా పాషా, మహబూబ్‌,భాస్కర్‌, సత్యనారాయణ, దామోదర్‌, సంజీవ్‌, మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -