సభ్యులను సన్మానించిన పాఠశాల విద్యా సంచాలకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గతేడాది (2024-25) 35 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న ఆ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది (2025-26) 114కు పెరిగింది. వికారాబాద్ జిల్లా బొమ్రాస్‌పేట్ మండలం, ఎంకెపల్లి గ్రామంలోని మణెమ్మ నాయకత్వంలోని స్వయం సహాయక బందం సభ్యులు బడి బాట కార్యక్రమంలో తీసుకున్న చొరవతో ప్రయివేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడిలోకి మారారు. ఆ బృందం ప్రభుత్వ పాఠశాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో బస్సు ప్రయాణ సౌకర్యం, గ్రామీణ రోడ్ల అభివృద్ధి తదితర మౌలిక వసతుల కోసం చేసిన కృషి ఫలిచింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ ఆ బృందాన్ని ప్రత్యేకంగా సన్మానించారు. ప్రభుత్వ విద్య పట్ల ప్రజలకున్న నమ్మకానికి ఎంకెపల్లి ఒక ఉదాహరణ అని ఆయన తెలిపారు. స్థానికంగా ఉండే ప్రజలు చొరవ తీసుకుంటే పాఠశాలల బలోపేతంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని సూచించారు. ప్రస్తుతం పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులున్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు తగినట్టు అవసరమైన సహకారాన్ని అందజేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.



