చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం :యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు
డీఈ కార్యాలయం ఎదుట ధర్నా, వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-డిచ్‌పల్లి
విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్‌పై దాడిచేసిన లైన్‌మెన్‌పై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని, లేకపోతే.. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని టీజీయూఈఈయూ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు అన్నారు. సోమవారం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నిజామా బాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్పల్లి సెక్షన్ ఆపరేటర్ సంతోష్‌పై శనివారం ఉదయం 11 గంటలకు సబ్ స్టేషన్ ఆవరణలో దాడిచేసి కొట్టి, బూతులు తిడుతూ చంపడానికి ప్రయత్నం చేసిన లైన్‌మెన్ గంగాదాస్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతనితో పాటు అసిస్టెంట్ లైన్‌మెన్ ప్రవీణ్ కూడా పోలీస్‌స్టేషన్‌లో సంతోష్‌ను ‘నువ్వు ఎలా డ్యూటీ చేస్తావో చూస్తాను.’ అంటూ బెదిరిస్తూ యూనియన్ నాయకుల ముందే బెదిరించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
వీరిద్దరిపై శాఖపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐటీయూ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది.. ఆర్టిజన్లపై చిన్నచూపు చూస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇలాంటి చర్యలు సరైనవికావని అన్నారు. భౌతిక దాడులకు దిగడం, భయభ్రాంతులకు గురి చేయడంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో డీఈ లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అంతకుముందు పెద్దఎత్తున నినాదా లు చేస్తూ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు జి.ఆంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.కనకరాజు, యూనియన్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు నల్లూరి నరేష్, బట్టు గంగాధర్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.



