అధికారులను అడ్డుకున్న బాధిత రైతులు
డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-కడ్తాల్
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి, మరిపల్లి గ్రామాల్లో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ భూ సేకరణ నేపథ్యంలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. భూ సర్వేకు వచ్చిన అధికారులను బాధిత రైతులు అడ్డుకున్నారు. పంట పొలాల మీదుగా రోడ్డు వెళ్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ సాగు భూములు కోల్పోతామనే భయంతో రైతులు సర్వే బృందం ఎదుట నిరసన తెలిపారు. రైతులు భూమి ఇవ్వాల్సిందేనని అధికారులు స్పష్టం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ భూములు ఇచ్చేది లేదని రైతులు కూడా తేల్చి చెప్పారు. అనంతరం తమ డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని రెవెన్యూ అధికారులకు అందించారు. గత్యంతరం లేక సర్వే బృందం వెనుదిరిగింది.
ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లోని తమ పంట పొలాల నుంచి రోడ్డు వెళ్లడంతో తాము రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులు తాటిచెట్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, రోడ్డుతో తాటిచెట్లు నాశనమైతే తమ బతుకుదెరువు సర్వనాశనం అవుతుందని తెలిపారు. పండ్ల తోటలు కూడా రోడ్డుకు వెళ్లే లైన్‌లో ఉన్నాయని అన్నారు. పంటల కాలంలో భూములపై సర్వే చేయడం అన్యాయమని అన్నారు. భూ సేకరణకు ముందుగా ప్రజలతో చర్చించి సరైన పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు జోగు వీరయ్య, రవికాంత్‌గౌడ్, భిక్షపతి, వెంకటరెడ్డి, గౌరయ్య, నారాయణరెడ్డి, మహేష్, రాములు, మల్లేష్, యాదయ్య, అన్నేపు జెన్నయ్య, శంకరయ్య, చంద్రయ్య, వెంకటేష్, శ్రీను, జోగు యాదయ్య, నరసింహ, కటిక రామచంద్రి, శంకర్‌రెడ్డి, మొహమ్మద్ చోటే, గౌపూర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ రోడ్డు భూ సేకరణ ఉద్రిక్తత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



