Tuesday, November 11, 2025
E-PAPER
Homeఖమ్మంసామినేని హంతకుల అరెస్టు చేయాలి..

సామినేని హంతకుల అరెస్టు చేయాలి..

- Advertisement -
  • – డీజీపీకి సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకుల వినతి
    – రాజకీయ కక్ష్యలతోనే హత్య
  • – ఘటన జరిగి 12 రోజులైనా కేసును ఛేదించటంలో నిర్లక్ష్యం
    నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హంతకులను అరెస్ట్ చేయాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్, మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెసరకాయల జంగారెడ్డి.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డికి హైదరాబాదులో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. పార్టీకి చెందిన సామినేని రామారావును అక్టోబర్ 31వ తేదీన పాతర్లపాడు గ్రామంలో ఉదయం 5:30 గంటల సమయంలో అతి కిరాతకంగా హత్య చేశారని… ఈ ఘటన జరిగి ఇప్పటికీ 12 రోజులు అవుతున్నా నిందితులను అరెస్టు చేయటంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. పాతర్లపాడు గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్, కంచుమర్తి రామకృష్ణ, మద్దినేని నాగేశ్వరరావు, కండ్రా పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.
  • రాజకీయ కక్షతోనే హత్య
    రామారావు బతికి ఉంటే సీపీఐ (ఎం)ను ఓడించటం సాధ్యం కాదని భావించి రాజకీయ కక్షలతోనే ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కుట్రపన్ని హత్య చేశారని ఆరోపించారు. హంతకులను నేను స్వయంగా చూశాను.. అని వారి పేర్లతో సహా రామారావు భార్య స్వరాజ్యం పోలీసులకు పిటిషన్ ఇచ్చినా ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవటాన్ని తప్పు పట్టారు. రామారావు నిస్వార్ధ నాయకుడు, వారి స్వగ్రామానికి రెండుసార్లు ఆయన ఏకగ్రీవ సర్పంచిగా ఎన్నికయ్యారని తెలిపారు. రామారావు సతీమణి ఒకసారి గ్రామ సర్పంచ్ గా పనిచేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలోని పేదలకు తమ సొంత భూమిని ఇండ్ల స్థలాల కోసం పంచిన చరిత్ర రామారావు కుటుంబానికి ఉందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిగా రామారావు సేవలు అందించారని, సీపీఐ (ఎం)లో దాదాపు 50 ఏళ్లుగా కొనసాగుతున్నారని వివరించారు. గత కొంతకాలంగా తన స్వగ్రామం పాతర్లపాడు లో ఉంటూ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. ఇది సహించలేని కాంగ్రెస్ నాయకులు ఆయన ఉంటే రాజకీయంగా తమ మనుగడ సాగదని భావించి, కుట్ర చేసి హత్య చేశారని ఆరోపించారు. ఈ హత్యకు కారణమైన వారందరినీ అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి వినతిపత్రం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -