‘ఎందుకింత వివక్ష? మహిళలకు సమాన ప్రాతినిథ్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు..?’ ఇవి సుప్రీంకోర్టు కేంద్రానికి సంధించిన ప్రశ్నలు. ఇలా కోర్టులతో చెప్పించుకోవల్సిన దుస్థితిలో ఉన్నారు మన పాలకులు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. చట్టాల అమలు కోసం కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. ఇది, మన ఏలికల వారు మహిళలకు ఇస్తున్న గౌరవం. ఒకపక్క మహి ళలను పూజించే ప్రభుత్వం మాదే అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మరోపక్క వారు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలను మాత్రం పక్కకు నెడుతున్నారు. మహిళా రిజర్వేషన్ చట్టమే దీనికి ఉదాహరణ. జనగణన, నియోజక వర్గాల పునర్విభజన పేరుతో చట్టాన్ని అమలు చేయకుండా కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం వ్యాఖ్యలతో ఈ చట్టం మరోసారి చర్చనీయాంశమైంది.
మహిళా సంఘాలు ఏండ్లుగా చేసిన పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలోని 106వ సవరణ ప్రకారం లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ చట్టానికి 2023 సెప్టెంబర్‌లో ఆమోదం లభించింది. ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు ఈ చట్టం అమలుకు నోచుకోకపోవడం అత్యంత దారుణం. మహిళల పట్ల పాలకుల వివక్షకు ఇదొక నిదర్శనం. అందుకే చట్టం అమలులో ఆలస్యం, అందులోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత డాక్టర్ జయా ఠాకూర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దాఖలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎదురు చూడకుండా చట్టాన్ని అమలు చేయాలని ఆమె తన పిల్‌లో కోరారు. దీనిపై జస్టిస్ బి.వి.నాగరత్న నేతృత్వంలోని న్యాయమూర్తి ఆర్.మహాదేవన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా చట్టం అమలుకు జాప్యం ఎందుకో తెలియజేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
మోడీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన నూతన పార్లమెంటు భవనంలో అమోదం పొందిన మొట్ట మొదటి బిల్లు ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ (మహిళా రిజర్వేషన్ బిల్లు). తాము తీసుకొచ్చిన చారిత్రాత్మక చట్టంగా బీజేపీ పాలకులు దీని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఆమోదం పొంది రెండేండ్లు పూర్తయినా కేవలం కాగితాలకే పరిమితమయింది. మహిళా సాధికారత పట్ల మన సర్కారు చిత్తశుద్దికి ఇదొక మచ్చు తునక. అందుకే చట్టం అమలు కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. దీనిపై స్పందించిన ధర్మాసనం ‘మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లో జాప్యం ఎందుకు, జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు రిజర్వేషన్లు లేకుండా పార్లమెంటులో ఎందుకు ప్రాతినిధ్యం కల్పించడం లేదు..’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద మైనారిటీలుగా ఉన్న మహిళల పట్ల వివక్ష ఎందుకని కూడా నిలదీసింది. ఇలా ధర్మాసనం ఘాటుగానే స్పందించింది.
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడమంటే మహిళలకు రాజకీయ న్యాయం కల్పించడం. రాజకీయ న్యాయం కూడా సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయాలతో సమానం. మహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు, అనుకూలమైన నిబంధనలు తీసుకొచ్చేలా రాజ్యాంగం అధికారాన్ని కల్పిస్తుంది. వీటిని కూడా సుప్రీంకోర్టు తన నోటీసులో ప్రస్తావించింది. కోర్టు స్పందన నిజంగా హర్షించదగినది. అయితే మోడీ ప్రభుత్వానికి ఇవేవీ తెలియని విషయాలు కావు. మనం గుర్తిం చాల్సింది ఏమిటంటే ‘అసలు మహిళలకు రాజకీయాలు అవసరమా’ అనే ధోరణి సమాజంలో బలంగా నాటుకుపోయింది. బీజేపీ పాలనలో ఇది మరింతగా వేళ్లూనుకుంది. ఇక మహిళల హక్కులు, చట్టాలను ఎలా అంగీకరిస్తారు? స్త్రీలను పిల్లల్ని కనే యంత్రాలుగానే చూడాలనేది మనువాదుల కోరిక. వీరు మహిళలు బయటకు అడుగుపెట్టడమే భరించలేరు. ఇక మహిళా రిజర్వేషన్ చట్టం అమలును ఎలా జీర్ణించు కుంటారు? అందుకే కాలపరిమితి అనేదే లేని నియోజకవర్గాల పునర్విభజన, జనగణనను సాకులుగా చూపి ఆపేస్తున్నారు.
పార్లమెంటు అనేది దేశంలోనే అత్యున్నతమైన చట్టసభ. దేశాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలన్నీ అక్కడే జరుగుతాయి. అలాంటి చోట మహిళలుంటే కాషాయ దళం భరించలేవు. 65 లక్షల మంది మహిళల ఓట్లు గల్లంతు చేసినప్పుడే మన పాలకులు రాజకీయాల్లో మహిళలకు ఇస్తున్న స్థానం ఏపాటిదో అర్థమవుతోంది. స్త్రీల ఓటు హక్కునే హరిస్తున్న వాళ్లు ఇక చట్లసభల్లో అడుగుపెట్టనిస్తారా? ఇలా నిలువెల్లా మనువాదాన్ని నింపుకున్న కేంద్ర పాలకులు కోర్టు నోటీసుపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి? ఏది ఏమైనా జనాభాలో సగం మంది నిర్ణయాధికార శక్తిని దూరం చేస్తున్నారు. మహిళలను ప్రజాతంత్ర ప్రక్రియల్లోకి రాకుండా నియంత్రి స్తున్నారు. ఇది స్త్రీలకే కాదు మొత్తం సమాజానికే తీవ్ర నష్టం. అందుకే మహిళా సమానత్వం, సాధికారతకై ఐక్యంగా ఉద్యమించాలి.
అమలు చేసేదెప్పుడు..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



