Wednesday, November 12, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిగిట్టుబాటు ధరల్ని విస్మరించిన 'అగ్రికల్చర్‌ రోడ్‌ మ్యాప్‌'

గిట్టుబాటు ధరల్ని విస్మరించిన ‘అగ్రికల్చర్‌ రోడ్‌ మ్యాప్‌’

- Advertisement -

దేశంలో దాదాపు ఎనభై శాతం మంది రైతుల వార్షికాదాయం రూ.17 వేల నుంచి 60 వేల లోపే ఉందని నిటి ఆయోగ్‌ అత్యంత భయంకరమైన నిజాలు బయట పెట్టింది. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో నిటి ఆయోగ్‌ వ్యవసాయ రంగంలో సాధించాల్సిన ప్రగతికి సంబంధించిన రీ ఇమేజింగ్‌ అగ్రికల్చర్‌ రోడ్‌ మ్యాప్‌ను ఈనెల 3న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారం భించింది.ఈ సందర్భంగా మన దేశ సాగు ముఖచిత్రాన్ని నిటి ఆయోగ్‌ పత్రం బట్టబయలు చేసింది.భారత వ్యవసాయం నేడు ఆహార భద్రత, రైతులు జీవనోపాధి లాంటి క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొం టున్నది. ప్రపంచ సగటు ఉత్పాదకతకంటే, మన సగటు ఉత్పాదక చాలా తక్కువగా ఉంది.రైతులు సాగుకు స్వంతంగా చేసే ఖర్చు ప్రపంచ సగటుతో పోలిస్తే ఎక్కువ ఉంటుంది. భారత దేశ వైవిధ్యభరితమైన వ్యవసాయ ప్రకృతి దృశ్యంలో ఉత్పాదకత, స్థిరత్వం ఆదాయాలను పెంపొందించ డానికి వాతావరణ అనూహ్య మార్పులు తట్టుకునే సరైన విత్తనాలు, డిజిటల్‌ టెక్నాలజీ, కచ్చితమైన పంట సలహాలు, ఏఐ,అధునాతన యాంత్రీకరణ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించు కోవడానికి ఈ నివేదిక ఒక వ్యూహాత్మకాన్ని వివరిస్తుంది. మన వ్యవసాయ పంటలను, సాగుదారులను ప్రపంచ పోటీకి సిద్ధం చేయడం, ప్రపంచ మార్కెట్‌కి అణుగుణంగా ఇక్కడ పంటలు సాగు చేయించటం ప్రధానంగా ధ్వనిస్తుంది.
దేశంలో సగటు 1.08 హెక్టార్ల వ్యవసాయ విస్తీర్ణంతో భూ కమతాలు ఆర్థిక వ్యవస్థలను, యాంత్రీకరణ సామర్థ్యాన్ని పరిమితం చేశాయి. వనరుల క్షీణత ముఖ్యంగా భూగర్భ జలాలు వెలికితీత, నేల క్షీణత దీర్ఘకాలిక ఉత్పాదకను దెబ్బతీస్తుంది.భూ కమతాలు చిన్నచిన్నగా ఉండటం, వర్షాల మీద ఆధారపడటం, ఒకటిరెండు పంటలు సాగుకే పరిమితం కావటం, అవి కూడా ఆహార ధాన్యాలే కావటం రైతుల ఆదాయం తక్కువగా ఉండటానికి కారణమని పేర్కొంది. వాతావరణ అస్థిర , అనూహ్య రుతుపవనాలు, తీవ్రమైన వాతావరణం మార్పులు తెగుళ్ళు వైరస్‌లు ఉత్పాదకతను దెబ్బతీయటంతో పాటు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటంలోనూ అల్పాదాయ రైతులు వెనకబడి ఉన్నారని విడుదల చేసిన రీ ఇమేజింగ్‌ అగ్రికల్చర్‌ రోడ్‌ మ్యాప్‌ ఫర్‌ ప్రాంటియర్‌ టెక్నాలజీ లీడ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ నివేదిక తెలిపింది.

1990-91 ఆర్థిక సంవత్సరం నుంచి మనదేశంలో అమలవుతున్న నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా వ్యవసాయ రంగంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, మార్కెటింగ్‌ , యాంత్రీకరణ మొదలగు అంశాలు ప్రయివేటు సంస్థలకు, బాహుళజాతి కంపెనీలకు అవకాశం కల్పించడంతో రైతు, భూమి, పశువులు ఆధారిత వ్యవసాయం కాస్త కంపెనీ, భూమి ఆధారిత వ్యవసాయంగా రూపాంతరం చెందింది. దీంతో ఖర్చు పెరిగి మన వ్యవసాయంలో ఆదాయం ఒకటి, ఖర్చు రెండుగా మారింది. రైతు సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు సమగ్ర ఉత్పత్తి ఖర్చును పరిగణలోకి తీసుకొని స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు ప్రధానమైన సి టూ ప్లస్‌ యాభై శాతం ప్రకారం మద్దతు ధరలు నిర్ణయం చేసి చట్టబద్ధత కల్పించి రైతుల ఆదాయానికి గ్యారంటీ ఇవ్వాలని ఉద్యమం చేస్తున్నాయి. కానీ, ఉద్దేశ పూర్వకంగా రీ ఇమేజింగ్‌ అగ్రికల్చర్‌ రోడ్‌మ్యాప్‌ దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్‌ చేస్తున్న గిట్టుబాటు ధరలు అంశాన్ని విస్మరించింది.
కేవలం ఉత్పాదకత పెంచటం, పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు, పంటకోత అనంతరం నష్ట నివారణపై మాత్రమే దృష్టి సారించింది. దీని మూలంగా ఆశించిన ఫలితాలు సాధ్యం కాదు, కేవలం చిన్న, సన్నకారు రైతు సేద్యంలోకి కంపెనీలను ప్రవేశపెట్టేందుకు ఉపయోగపడు తుంది. సాగులో ట్రిలరస్‌, డ్రోన్స్‌, రోబోలను వినియోగించి కూలీల ఖర్చు నామమాత్రం చేయడం, ఎరువులు, పురుగు మందుల వినియోగం లేకుండా జీరో బడ్జెట్‌ వ్యవసాయం వైపు అడుగులు వేయించటం ద్వారా రైతులకు ఆదాయం రెట్టింపు అవుతుందనే అంచనా తలకిందులవుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,ఏఐ అక్షరాస్యత యాంత్రీకరణ సామర్థ్యం పెంపుదల, కంపెనీలపై ఆధారపడి సాగు చేయడం లేదా సాగు నుంచి కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.

  • బొంతు రాంబాబు, 9490098205
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -