– సెషన్ల వేళల్లోనూ మార్పులు
– గువహటి టెస్టులో కొత్త ప్రయోగం
– భారత క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
నవతెలంగాణ క్రీడావిభాగం
టెస్టు క్రికెట్‌లో మూడు సెషన్లు… తొలుత లంచ్, ఆ తర్వాత టీ విరామం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పాటిస్తున్న సంప్రదాయ పద్దతి ఇదే. డే నైట్ టెస్టుల్లోనే తొలుత టీ విరామం, ఆ తర్వాత డిన్నర్ బ్రేక్ ఉంటుంది. భారత్, దక్షిణాఫ్రికా ‘ఫ్రీడమ్ టెస్టు సిరీస్’లో బీసీసీఐ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టుకు అస్సాంలోని గుహవటి ఆతిథ్యం ఇవ్వనుంది. శీతాకాలం, ఈశాన్య ప్రాంతంలో త్వరగా సూర్యాస్తమయం వంటి అంశాలను గమనంలో ఉంచుకుని బీసీసీఐ సెషన్లు సమయం, టీ, లంచ్ విరామాలను మార్పు చేసింది.
సెషన్ల వేళలు ఇలా..
భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు ఈ నెల 22 నుంచి ఆరంభం కానుంది. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన గువహటి.. తొలిసారి ఓ టెస్టు మ్యాచ్‌కు వేదిక కానుంది. గువహటి టెస్టులో ఉదయం 8.30 గంటలకు టాస్ ఉంటుంది. 9 గంటలకు మ్యాచ్ ఆరంభం. 9 నుంచి 11 వరకు తొలి సెషన్, ఆ తర్వాత 20 నిమిషాల టీ బ్రేక్. 11.20 నుంచి 1.20 వరకు రెండో సెషన్. ఈ సెషన్ తర్వాత 40 నిమిషాల లంచ్ విరామం. మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు మూడో సెషన్. ఓవరాల్‌గా మూడు సెషన్లలో ఆరు గంటల పాటు 90 ఓవర్ల ఆట సాగనుంది.
వాస్తవిక మార్పులు
ఈశాన్య ప్రాంతంలో సూర్యోదయం, సూర్యాస్తమయం త్వరగా జరుగుతుంది. శీతాకాలంలో ఇది మరింత త్వరగా ఉంటుంది. సాయంత్రం 4 గంటల తర్వాత సూర్యాస్తమం ఆరంభంతో వెలుతురు ఎక్కువగా ఉండదు. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి. గువహటి పరిస్థితులపై మంచి అవగాహన కలిగిన దేవాజిత్ సైకియా.. ఈ మార్పులను తీసుకొచ్చారు. ‘ఇది వాస్తవిక పరిస్థితులతో తీసుకున్న నిర్ణయం. ఈశాన్య ప్రాంతంలో సూర్యోదయం, సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. సాయంత్రం 4 తర్వాత పగటి వెలుతురు కనిపించదు. అందుకే మ్యాచ్‌ను 9 గంటలకు మొదలుపెట్టి 4 గంటలకు ముగించనున్నాం. ఆటగాళ్లు ఉదయం 11 గంటలకు లంచ్ తీసుకోవటం సరైన సమయం కాదు. అందుకే, లంచ్ బ్రేక్‌లో మార్పులు చేశామని’ సైకియా తెలిపారు.

టాస్‌కు ప్రత్యేక నాణెం
భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు మహత్మా గాంధీ- నెల్సన్ మండేలా ఫ్రీడమ్ సిరీస్‌గా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నామకరణం చేశాయి. దీంతో ఫ్రీడమ్ సిరీస్‌లో టాస్‌కు ఉపయోగించే నాణెంను బీసీసీఐ ప్రత్యేకంగా తయారు చేయించింది. ఈ నాణెంకు ఓ వైపు గాంధీ-మండేలా ఫోటోలు (బొమ్మ), మరోవైపు బీసీసీఐ, క్రికెట్ దక్షిణాఫ్రికా లోగోలు (బొరుసు) ఉంటాయి. భారత్, దక్షిణాఫ్రికా రెండు టెస్టుల సిరీస్ ఈ నెల 14న ఈడెన్ గార్డెన్స్ టెస్టుతో ఆరంభం అవుతుంది. భారత్‌లో టెస్టులు సాధారణంగా ఉదయం 10 గంటలకు ఆరంభం అవుతాయి. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్ టెస్టు ఓ అర గంట ముందుగా షూరూ కానుంది. ఈడెన్‌గార్డెన్స్ టెస్టులో తొలుత లంచ్ విరామం, ఆ తర్వాతే టీ బ్రేక్ ఉండనున్నాయి.



