– శ్రామికుల గొంతుక సీఐటీయూ : రంగారెడ్డి జిల్లా సీఐటీయూ 4వ మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
– అధ్యక్ష కార్యదర్శులుగా జాజుల రుద్రకుమార్, ఎం.చంద్రమోహన్ ఎన్నిక
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
శ్రామిక వర్గాన్ని దోచుకుంటున్న దోపిడీ వర్గాన్ని అంతం చేసేందుకు కార్మిక వర్గం ఐక్యం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. పారిశ్రామికవాడల్లో, ఖర్జానాల్లో పనిచేస్తున్న కార్మికుల గొంతుకగా సీఐటీయూ పనిచేస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లా సీఐటీయూ 4వ మహాసభలు రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ ప్రాంతంలో రెండ్రోజులపాటు జరిగాయి. మంగళవారం మహాసభను ఉద్దేశించి పాలడుగు భాస్కర్ మాట్లాడారు. పెట్టుబడిదారుల పొట్ట చీల్చే విధంగా కార్మికవర్గం ఐక్య పోరాటాలు చేయాలన్నారు. కార్మికుల సమస్యలను సీఐటీయూ పరిష్కరిస్తుంటే.. ఓట్లు మాత్రం బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు వేస్తే.. కార్మిక రాజ్యం ఎట్లా వస్తదని, దీనిపై శ్రామికులు ఆలోచన చేయాలన్నారు. కార్మిక రాజ్యం రావాలంటే శ్రామికుల కోసం పనిచేసే జెండాను గెలిపించుకోవాలని తెలిపారు. కార్మికులు పని ప్రదేశంలోనే ఎర్రజెండా కింద పనిచేయడం కాదని, స్థానిక ప్రదేశాల్లో కూడా ఎర్రజెండాను పరిచయం చేయాలన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మత సిద్ధాంతాలతో కార్మిక సంఘాలను విచ్ఛినం చేయాలని చూస్తున్నాయని తెలిపారు. కార్మిక సంఘాలు అవసరం లేదని మోడీ ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక సంఘాల నాయకులు కార్మిక సిద్దాంతాలకు, మత సిద్ధాంతాలకు వ్యత్యాసాన్ని వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, మహాసభలో 51 మందితో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా జాజుల రుద్రకుమార్, ఎమ్.చంద్రమోన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కార్మికులంతా ఐక్యం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



