– నిలువ నీడలేక ఫుట్‌పాత్‌లపై అమ్మకాలు
– రూ.5 భోజనం సెంటర్ల నిర్వహణ అధ్వానం
– డస్ట్‌బిన్లు, మురికికాల్వల పక్కన ఏర్పాటు
– కంపు కొడుతున్న పరిసరాలు
– పేరు మార్పుచేసి చేతులు దులుపుకున్న సర్కార్
హైదరాబాద్ నగరంలోని ఫుట్‌పాత్ లేబర్, అడ్డాకూలీలు, నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన రూ.5 భోజన పథకం రోడ్డున పడింది. అన్నపూర్ణ పేరుతో పండేండ్ల క్రితం మొదలైన ఈ పథకం పేరును ”ఇందిరా క్యాంటీన్లు” గా పేరు మార్చిన ప్రభుత్వం వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. కొన్ని ప్రాంతాల్లోని సెంటర్లకు నిలువ నీడ లేక ఫుట్‌పాత్‌లపై అమ్మకాలు సాగిస్తున్నారు. రాంనగర్, ఇమ్లీబన్ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో గతంలో ఉన్న కంటైనర్స్ చెడిపోవడంతో వాటిని తొలగించారు. ఇందిరమ్మ క్యాంటిన్ల పేరుతో కొత్తగా కంటైనర్స్ ఏర్పాటు చేస్తానని చెప్పిన సర్కార్ … ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా పలు సెంటర్లలో పేదలు కడుపు నింపుకోడానికి ఫుట్‌పాత్‌లపై ఎర్రటి ఎండల్లో కాపుకాస్తున్నారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
2014 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో రూ.5కే భోజనం పేరిట అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ సౌజన్యంతో హరేకృష్ణ ఫౌండేషన్ ఈ క్యాంటిన్లను నిర్వహిస్తోంది. ఇందుకు కావాల్సిన పూర్తి ఖర్చులను బల్దియానే భరిస్తున్నది. 50 సెంటర్లతో ప్రారంభమై పదేండ్ల కాలంలో 150కి పెరిగాయి. ప్రతి రోజు ఈ పథకం ద్వారా 30 నుంచి 35 వేల మంది భోజనం చేస్తున్నారు. రోజువారీ కూలీలు, వలస కార్మికులు, విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతున్నది. వీటి నిర్వహణను అటు జీహెచ్‌ఎంసీ గాని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా సెంటర్ల కోసం ఏర్పాటు చేసిన కంటైనర్స్ పదేండ్ల కాలంలో పలు ప్రాంతాల్లో తుప్పుపట్టి చెడిపోయాయి. ఇటీవల వాటిని తొలగించిన అధికారులు కొత్తవి ఏర్పాటు చేయలేదు. దాంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపైనే వాటిని నిర్వహిస్తున్నారు. దాంతో భోజనం చేయడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలంలో భోజనం క్వాలిటీ, క్వాంటిటీ కూడా తగ్గింది. 450 గ్రాముల రైస్, 150 గ్రాముల పప్పుసాంబార్, 100 గ్రాముల కూర, 15 గ్రాముల పచ్చడి అందించాలి. కాని నగరంలో మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. 250 గ్రాముల నుంచి 300 గ్రాముల అన్నం, నీళ్ల చారును మరిపించే పప్పు సాంబార్, ఉడికీ ఉడకని కూర, ఒక వాటర్ పాకెట్ అందిస్తున్నారు. నగరంలోని 150 సెంటర్లలో ఒకటీ అర తప్ప మెజార్టీ సెంటర్లలో పచ్చడి ఇవ్వడం లేదు.
పర్యవేక్షణ కరువు…
ఈ పథకాన్ని సక్రమంగా అమలు జరిగేలా చూడిల్సిన జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు. కొంత మంది అధికారులు వారికి వత్తాసు పలకడంతో నిర్వాహకులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి సెంటర్‌కు ఇంత మొత్తంలో భోజనాలు తయారు చేయాలని నిబంధన ఉంది. ఒక సెంటర్లో100 మంది కోసం వండిన బోజనాన్ని సెంటర్ రద్దీని భట్టి 150 మందికి సర్దుబాటు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి మాత్రం 150 భోజనాలకు సరిపడా బిల్లును తీసుకుంటున్నారు. ప్రతి రోజు ఎన్ని క్వింటాళ్ల బియ్యం వండుతున్నారు. ఎన్ని భోజనాలు సరఫరా చేస్తున్నారనే విషయంపై జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యవేక్షణ కరువైంది.
ఇందిరమ్మ క్యాంటీన్లుగా…
అన్నపూర్ణ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు మార్చింది. మధ్యాహ్న భోజనంతో పాటు రూ.5కే టిఫిన్ కూడా అందిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 29న మచ్చుకు మూడు సెంటర్లను ఆర్భాటంగా ఏర్పాటు చేసి చేతులు దులుపు కుంది. వీటి నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కంటెనర్లలో సీటింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే అవి ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. పంజాగుట్ట నిమ్స్‌తో పాటు కొన్ని చోట్ల కంటెయినర్స్ ఏర్పాటు చేసినా వాటిని స్థానిక రాజకీయాల కారణంగా ప్రారభించలేదని తెలుస్తోంది.
నాణ్యత తగ్గింది : శ్రీనివాస్, ఇమ్లిబన్ బస్టాండ్
మాది వరంగల్ జిల్లా. నాలుగేండ్ల క్రితం హైదరాబాద్ వచ్చి చిన్నా చితక పనులు చేసుకుంటూ ఫుట్‌పాత్ మీద ఉంటున్నాను. నెలలో ఎక్కువ రోజులు ఇదే భోజనం మా కడుపు నింపుతుంది. ఐతే రోజురోజుకు నాణ్యత తగ్గుతోంది. ఒక్కో సారి అన్నం కూడా ఉడకడం లేదు. గతంలో పెట్టినంత క్వాంటిటీ కూడా అందించడం లేదు.
వాసనలోనే తింటున్నాం : మహేందర్, అఫ్జల్‌గంజ్
అబ్జల్‌గంజ్ మురికి కాలువకు ఎదురుగా క్యాంటిన్ ఉంది. కాలువ నుంచి ముక్కుపుటాలు అదిరే వాసన వస్తుంది. అయినా తప్పడం లేదు. భోజనానికి ఒక్క వాటర్ ప్యాకెట్ మాత్రమే ఇస్తున్నారు. రెండు సార్లు చేతులు కడుక్కోవడం, తినడానికి నీళ్లు సరిపోవడం లేదు.
అరకొర సౌకర్యాలు..
రూ.5 భోజన కేంద్రాలు చాలా చోట్ల కంపు కొడుతున్నాయి. డస్ట్‌బిన్లు, మురికి కాలువలు, చెత్త కుప్పల పక్కనే ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భోజనం చేసిన తర్వాత పేపర్ ప్లేట్లను వేసేందుకు పాలితిన్ కవర్‌ను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ కవర్ సరిపోక చాలా సెంటర్లలో తిన్న ప్లేట్లను రోడ్డుపైన పడేస్తున్నారు. దాంతో వాటితో కుక్కలు ఇతర జంతువులుస్వైర విహారం చేయడంతో ఆ ప్రాంతమంతా చెత్తకుప్పను తలిపిస్తోంది. ప్రతి రోజు వాటిని తొలిగించాల్సిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది పట్టించుకోక పోవడంతో కొన్ని చోట్ల రెండు మూడు రోజుల పాటు అలాగే ఉంటున్నాయి. మురికి కాలువలు, డస్ట్‌బిన్లు, తొలగించని తిన్న ప్లేట్లతో ఆ ప్రాంతమంతా కంపు కొడుతోంది.
వేళలు
టిఫిన్ : ఉదయం 7 గం.ల నుంచి 9.30 గం.ల వరకు (ప్రస్తుతం కొన్ని సెంటర్లలో మాత్రమే)
భోజనం : మధ్యాహ్నం 10 గం.ల నుంచి 2.30 గం.ల వరకు




