ఓటుకు రూ.పది వేలు పంచిన అధికార పార్టీ : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాయిజం, రౌడీయిజం చేసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్, బీహార్ ఎన్నికలను తలపించే రీతిలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర సంప్రదాయాలకు తెరతీశారని అన్నారు. ఇంత బీభత్సంగా ఎప్పుడూ ఎన్నికలను చూడలేదన్నారు. ఓటుకు రూ.పదివేల దాకా పంచారని చెప్పారు. లక్ష మందికి చీరలు కూడా పంచారని వివరించారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై రేవంత్‌రెడ్డికి విశ్వాసం పోయిందనీ, అందుకే అంతులేని అక్రమాలకు తెరలేపారని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు 20 ఫిర్యాదులు ఇచ్చినా స్పందన లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు దగ్గర ఉండి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్, డీజీపీ శివధర్‌రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. అక్రమాలకు సహకరించిన అధికారులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాననీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. దొంగ ఓట్లకు పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బంది సహకరించారని ఆరోపించారు. అన్ని నిబంధనలనూ కాంగ్రెస్ నేతలు అతిక్రమించారని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అక్రమాలకు మూడు నాలుగు నెలల ముందే రేవంత్‌రెడ్డి తెర తీశారని విమర్శించారు. 13 ఏండ్ల అమ్మాయితో కూడా కాంగ్రెస్ నేతలు ఓటు వేయించారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో ఈసీ కుమ్మక్కైందని చెప్పారు. మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సైలెంట్ ఓటు బీఆర్‌ఎస్‌కే పడిందన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని అక్రమాలు చేసినా జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌దే విజయమని చెప్పారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ రౌడీయిజం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



