ముందస్తు సమాచారం లేకుండా మూసివేత దారుణం – ముక్తికాంత్ అశోక్
నవతెలంగాణ వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి సమయంలో మూసివేయడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేపింది. ఈ చర్యపై సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు ముక్తికాంత్ అశోక్ తీవ్రంగా స్పందించారు. ఆలయాన్ని అకస్మాత్తుగా మూసివేయడం అన్యాయమని, భక్తులకు ముందుగానే సమాచారం ఇవ్వడం దేవాలయ అధికారుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఆకస్మికంగా దర్శనాలు నిలిపివేయడం వల్ల స్థానిక వ్యాపారులు, వసతి గృహాల యజమానులు, భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఐ(ఎం) అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. కానీ ప్రజల జీవనోపాధి దెబ్బతినే విధంగా తీసుకునే నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కావు” అని ఆయన స్పష్టం చేశారు. ముందు రానున్నది మహాశివరాత్రి, సమ్మక్క–సారక్క జాతరల వంటి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలు తీసుకుంటే అస్తవ్యస్తత తప్పదని హెచ్చరించారు. ఆలయాన్ని మూసివేయాల్సిన అవసరం ఏమిటో, దానికి సంబంధించిన కారణాలు ప్రజలకు వెల్లడించాలని ఆయన కోరారు. “ప్రజా నిర్ణయాల్లో పారదర్శకత అవసరం, అధికారులు భక్తులతో, స్థానిక నాయకులతో చర్చించి తగిన సమాచారం ఇవ్వాలి” అని అశోక్ డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ఆలయ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడం గమనార్హం. సీపీఐ(ఎం) ఈ అంశంపై పరిశీలన జరిపి, సమస్యకు తక్షణ పరిష్కారం తీసుకురావాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నామని అన్నారు.



