మాడిఫైడ్ సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యం చేస్తే చర్యలు తప్పవు
నిజామాబాద్ డిసిపి అడ్మిన్ బస్వారెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్
రోడ్డు రోలర్ తో మాడిఫైడ్ సైలెన్సర్లను నిజామాబాద్ పోలీసులు ధ్వంసం చేశారు. నిజామాబాద్ నగరంలో గత మూడు నాలుగు నెలల నుండి వాహనదారులు మాడిఫైడ్ సైలెన్సర్లను బిగించుకొని నగరంలో శబ్ద కాలుష్యం చేయుచున్నారని ట్రాఫిక్ పోలీసు దృష్టికి రాగా ట్రాఫిక్ పోలీస్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలకు బిగించినటువంటి 350 మాడిఫైడ్ సైలెన్సర్లను సీజ్ చేసామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మాడిఫైడ్ సైలెన్సర్లను బిగించుకొని నడుపుతున్నటువంటి వాహనాల పైన చట్ట ప్రకారం చర్య తీసుకొని వెంటనే వాటికి గల మాడిఫైడ్ సైలెన్సర్లను సీజ్ చేసామన్నారు. మోడీఫైడ్ సైలెన్సర్లను బుధవారం రైల్వే స్టేషన్ ముందు నిజాంబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అడిషనల్ డిసిపి బసవ రెడ్డి సమక్షంలో రోడ్డు రోలర్ సహాయంతో సీజ్ చేసినటువంటి 350 మాడిఫైడ్ సైలెన్సర్లను ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ బసవ రెడ్డి మాట్లాడుతూ.. శబ్ద కాలుష్యం చేసేటువంటి మాడిఫైడ్ సైలెన్సర్లను అక్రమంగా బిగించుకున్న వాహనదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని అదేవిధంగా మునుముందు కూడా కఠినంగా వ్యవహరిస్తామని ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్ బిగించుకొని ప్రజల యొక్క ప్రశాంత వాతావరణము మానసిక స్థితి ప్రజల ఆరోగ్యం పైన ప్రభావం చూపేటువంటి మాడిఫైడ్ సర్వీస్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేసినారు, మోడీఫైడ్ సైలెన్సర్స్ బిగించే వ్యాపారులపైన చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించినారు, అదే విధంగా మోటార్ వాహన సవరణ చట్టం 2019 ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి మొదటిసారి పదివేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడునని, మొదటిసారి పట్టుబడిన తర్వాత మూడు సంవత్సర కాలంలో మరొకసారి పట్టుబడినట్లైతే రెండవసారి పదిహేను వేల రూపాయలు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడునని తెలియజేశారు. కావున వాహనదారులు రోడ్డు నియమాలు పాటించాలని ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఏసిపి మస్తాన్ అలీ, నిజాంబాద్ డివిజన్ ఏసిపి రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ఆర్ఐ సురేష్, శ్రీనివాస్, వినోద్ ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



