సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నవంబర్ 26 దేశవ్యాప్త ప్రదర్శనలు
అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజ్జు కృష్ణన్
నవతెలంగాణ – వైరాటౌన్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజ్జు కృష్ణన్ అన్నారు. బుధవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని లాలాపురం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో “కేంద్ర ప్రభుత్వ విధానాలు – వ్యవసాయ రంగంలో సంక్షోభం” పై చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగిన రైతు సదస్సులో విజ్జు కృష్ణన్ ప్రసంగించారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం వల్ల సాగుకు రైతులు దూరం అవుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు. పంట పండిస్తున్న రైతుకు కొన్ని సందర్భాల్లో కేజీ ఉల్లిపాయలు, టమాటాలు, ఎల్లిపాయలకు ఒక రూపాయి ధర వస్తే వినియోగదారులకు కంపెనీలు కేజీ 100 రూపాయలకు విక్రయం చేస్తూ లాభాలు పొందుతున్నాయని అన్నారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులతో లొంగిపోయి పత్తి దిగుమతి సుంకం లేకుండా దిగుమతి చేసుకుంటూ మన దేశ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు రూ 8110 కూడా పొందకుండా అన్యాయం చేస్తుందని అన్నారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 26 దేశవ్యాప్త ప్రదర్శనలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఎనిమిది రకాల పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి నేడు కేవలం సన్న ధాన్యంకు మాత్రమే బోనస్ ఇస్తుందని, అది కూడా రబీ సీజన్లో వరి నన్న ధాన్యం బోనస్ రైతులకు జమ చేయలేదని అన్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2025 విద్యుత్ సంస్కరణల బిల్లు విద్యుత్ సరఫరా వ్యవస్థను ప్రైవేటీకరణ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతుందని, దీని ద్వారా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ద్వారా ఉచిత విద్యుత్ రద్దు అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రైతాంగంకు విద్యుత్ సంస్కరణల అత్యంత ప్రమాదకరమని అన్నారు.
సమస్యలు పరిష్కారం కోసం ఐక్య రైతు ఉద్యమమే మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.కె మీరా, వాసిరెడ్డి ప్రసాద్, రాయల వెంకటేశ్వరరావు, చింతలచెర్వు కోటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ, రైతు మహిళ కో కన్వీనర్ బొంతు సమత, గుడ్డూరి ఉమా, రైతు సంఘం జిల్లా నాయకులు దొడ్డపనేని కృష్ణార్జునరావు, మల్లెంపాటి రామారావు, కొప్పుల కృష్ణయ్య, మేడా శరాబంధి, సంక్రాంతి నర్సయ్య, సంక్రాంతి పురుషోత్తం, సంక్రాంతి చంద్రశేఖర్, దొండపాటి నాగేశ్వరరావు, నల్లమోతు మోహనరావు, తుళ్లూరు రమేష్, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, సిఐటియు నాయకులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు, చెరకుమల్లి కుటుంబరావు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎస్.కె నాగుల్ పాషా తోపాటు వందలాది మంది రైతులు పాల్గొన్నారు.




